నెల్లూరు సమర శంఖారావం సభలో పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సందేహాలను నివృత్తి చేస్తున్న జగన్
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టును నిర్మించి తీరుతామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో మంగళవారం సాయంత్రం జరిగిన సమర శంఖారావం సభలో పోలింగ్‌బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో నిర్వహించిన ముఖాముఖీ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ముఖాముఖీలో భాగంగా బూత్ కమిటీ సభ్యులు పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి..
దుగరాజుపట్నం పోర్టు నిర్మిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు దానిని నెరవేర్చలేదు. మీరు అధికారంలోకి వస్తే దాని నిర్మాణం చేపడతారా?
– వెంకటేష్ (సూళ్లూరుపేట నియోజకవర్గం–కొమ్మూరు)
జగన్: ఇక్కడే కృష్ణపట్నం పోర్టు ఉంది. తడలో సెజ్‌లు ఉన్నాయి. ఇవి ఉన్నా ఇక్కడ చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఎక్కడో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడుకు చెందిన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి.. ‘మీ అందరికీ ఒకటే చెపుతున్నా.. మీరు గ్రామాల్లోకి వెళ్లండి, అన్నా అక్క చెల్లి అని ఆప్యాయంగా పలకరిస్తూ చెప్పండి.. మన అన్న సీఎం అవుతాడు.. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పండి.. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేసి పదిమంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిప్పించే ప్రయత్నం చేస్తాడని చెప్పండి. గ్రామ్లాల్లో రేషన్ కార్డు, ఇళ్లు కావాలన్నా, ఎవరికి ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, నవరత్నాల్లో చేయూత, రైతు భరోసా, బియ్యం కావాలన్నా అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లో అనుమతి చేయిస్తాడని చెప్పండి. ఎవరి సిఫారసు అవసరం లేదు. మనం అధికారంలోకొస్తే ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీర్‌గా నియమించి.. రూ.5 వేలు జీతమిస్తాం. అంతకంటే పెద్ద ఉద్యోగమొస్తే దీన్ని వదులుకోవచ్చు. వీరిద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా మీకు ఇంటికొచ్చి అందించేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తారని నిరుద్యోగులు ఇంతకాలం ఎదురుచూశారు. వేలకు వేలు ఖర్చుచేసి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇవ్వదు. ఇక ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసిన 90 వేల మంది ఉన్నారు. మొత్తంగా 2.30 లక్షల ఉద్యోగాలున్నాయి. అవన్నీ అన్నొస్తే భర్తీ చేస్తాడని చెప్పండి. అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టం చేసి, పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో 70 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. చివరగా దుగరాజపట్నం పోర్టును కచ్చితంగా కట్టితీరుతాం.
నెల్లూరులో పాదయాత్ర చేసినప్పుడు మరిచిపోలేని సంఘటన చెప్పండి..
– సుబ్బారెడ్డి (ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు)
జగన్: నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మర్చిపోలేని సంఘటన ఒకటి చూశా.. పాదయాత్రలో కలచివేసిన సంఘటన. ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక పెద్దాయన, పెద్దమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరకొచ్చారు. పక్కనే వారి గుడిసె. ఆ గుడిసెలో ఒక ఫొటో ఉంది. వారి కొడుకు ఫొటో వేలాడి తీసి ఉంది. అతని పేరు గోపాల్ అనుకుంటా.. అన్నా, ఈ ఫొటోకు దండ వేసి ఉంది నా కొడుకు. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడన్నా అని ఏడుస్తూ చెప్పాడు. నాకు చాలా బాధేసింది.. ఎలా చనిపోయాడన్నా అని అడిగితే.. అన్నా నా కొడుక్కి ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు వచ్చాయన్నా. మంచి స్టూడెంట్ కావడంతో ఇంజనీరింగ్ చదువుతానంటే చేర్పించానన్నా.. ఇంజనీరింగ్ చదివితే తాను బాగుపడతాడు, తనతోపాటు మా బతుకులు బాగుపడుతాయని ఆశపడ్డానన్నా.. ఇంజనీరింగ్‌కు సంవత్సరానికి రూ.లక్ష ఖర్చవుతుందని చెప్పాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంత ఇస్తున్నారని అడిగితే.. రూ.30 వేల నుంచి రూ.35 వేలు వస్తుందన్నా, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి అన్నాడు. ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి రూ.70 వేలు అదనంగా అవుతుందని.. నాలుగేళ్లలో రూ.3 లక్షలు చెల్లించాలన్నా ఆ స్థోమత మాకుందాన్నా అని అడిగాడు. నా కొడుకు మొదటి సంవత్సరంలో చదవనంటే చదవమని చెప్పి రూ.70 వేలు తెచ్చిచ్చానన్నా, రెండో సంవత్సరం సెలవులకు ఇంటికొచ్చి నాన్నా రెండో ఏడాదికి కూడా రూ.70 వేలు కావాలని అడిగితే అప్పోసప్పో చేసి తెచ్చిస్తానని చెప్పానని తెలిపాడు. అన్నా నాకొడుకును కాలేజీకి పంపించా. అలా వెళ్లిన నా కొడుకు నా అవస్థ చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడని గోపాలన్న ఏడుస్తూ చెప్పాడు. బహుశా నా జీవితకాలంలో మర్చిపోలేని సంఘటన ఇది. ఆ తర్వాత గోపాలన్న చెప్పింది నవరత్నాల్లో చేర్చా. ప్రతి పేదవారికీ హామీ ఇస్తున్నా. పేదరికానికి, చదువులకు సంబంధం లేకుండా చేస్తా, మన ఇళ్లలో నుంచి ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ కావాలి.. చదువుకోసం పేదరికం అడ్డుకాకుడదు.. గోపాలన్న పడే బాధ ఏతండ్రికీ రాకూడదని చెపుతున్నా.. ప్రతి తల్లికి, తండ్రికి చెపుతున్నా.. చదవాలనుకునే పిల్లాడికి ఉచితంగా చదివించడమే కాకుండా హాస్టల్‌లో ఉండి చదువుకొనేవారికి మెస్‌చార్జీలకు గాను ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని చెపుతున్నా.. గోపాలన్నా.. నష్టాన్ని వెనక్కి తీసుకురాలేను కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చేస్తానని హామీ ఇస్తున్నా.
అన్నా మన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఎలా బయటపడాలి?
– హరికృష్ణ (సర్వేపల్లి–బ్రహ్మదేవం)
జగన్: ఇదే సమస్య ప్రతి గ్రామంలో ఉంది. మంచీచెడు లేకుండా అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారు. దేవుడు దయవల్ల మన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి అక్రమ కేసును ఉపసంహరిస్తామని హామీ ఇస్తున్నా.. రెండునెలల్లో మంచిరోజులు రాబోతున్నాయి. దగ్గరకు వచ్చేశాం.. కాస్త ఓపిక పట్టండి మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు కదా.. మనం ఎలా ఎదుర్కోవాలి?
– శరత్‌కుమార్ (నెల్లూరు సిటీ నియోజకవర్గం)
జగన్: ఈ ప్రశ్న ప్రతి మనస్సులో ఉంది. ఒకటే ఒకటి చెపుతున్నా. అన్యాయం ఎక్కువ రోజులు నిలబడదు. అన్యాయం చేసేవారికి దేవుడు శిక్ష వేస్తాడు.. రాత్రి పోయాక పగలు వస్తుంది.. మనం చేయాల్సింది ఒకటే.. ప్రతీ ఇంటికీ వెళ్లండి. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దని చెప్పండి. అన్న సీఎం అయితే జరిగే మేలును వారికి వివరించి చెప్పండి.. నచ్చజెప్పండి. అన్యాయమైన చంద్రబాబు ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చినా బంగాళాఖాతంలో కలసిపోయేలా దేవుడే చేస్తాడు.
నెల్లూరుజిల్లాలో యువత ఉద్యోగాలకోసం చెన్నై లాంటి నగరాలకు వెళ్తున్నారు. వారికి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు?
– గణేష్ (వెంకటగిరి–టీచర్స్ కాలనీ)
జగన్: గణేష్ అడిగిన ప్రశ్నకు ఇంతకుముందే చెప్పా. రేప్పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏవిధంగా ఉద్యోగాలకోసం పాకులాడుతామో చెప్పాను. ప్రత్యేక హోదా గురించి చెపుతా.. హోదా ఇస్తామంటూ రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రాన్ని పట్టించుకోకుండా వదిలేయడం చూశాం. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ప్రత్యేకహోదాను చట్టంలో పొందుపరిచి ఉంటే కోర్టుకెళ్లి అయినా ప్రత్యేక హోదా తెచ్చుకునేవాళ్లం. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి మోసం చేసింది. టీడీపీని చూశాం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోరాటం చేయాల్సిన వ్యక్తి.. నాలుగేళ్లపాటు బీజేపీతో చిలకా గోరింకల్లా కాపురం చేసి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఎన్నికల ముందు నల్లచొక్కా వేసుకుని ధర్మపోరాట దీక్షలంటూ మోసం చేస్తున్నాడు. ఇదే పవన్‌కల్యాణ్‌ను చూశాం.. ఎన్నికల ముందు బీజేపీ, చంద్రబాబుతో హామీలు అమలు చేయిస్తానని చెప్పాడు. తర్వాత వెన్నుపోటు పొడిచిన వారిలో భాగస్వామ్యమయ్యాడు. ఇక ఎవరినీ నమ్మొద్దు. మన రాష్ట్రానికి సంబంధించిన 25 మంది ఎంపీలను మొత్తంగా మన పార్టీయే తెచ్చుకునేలా చేయండి. అప్పుడు కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తానని సంతకం పెట్టిన వారికే మద్దతిస్తాం.. ప్రత్యేక హోదా వస్తే హైదరాబాద్‌లా ఉద్యోగ విప్లవం వస్తుంది.. రాయితీలు వస్తాయి.. హోటళ్లు, పరిశ్రమలు, హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకుంటే ఇన్‌కంటాక్స్, జీఎస్టీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment