సినిమా –2కి బాబు సిద్ధం!  | YS Jagan key suggestions to party booth committee members | Sakshi
Sakshi News home page

సినిమా –2కి బాబు సిద్ధం! 

Published Wed, Mar 6 2019 4:22 AM | Last Updated on Wed, Mar 6 2019 8:00 AM

YS Jagan key suggestions to party booth committee members - Sakshi

నెల్లూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు ఇప్పుడు సినిమా –2 చూపించేందుకు సిద్ధమవుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. భూములు అమ్ముకోవడం, కమీషన్లను కాజేయటంపైనే ఆయన యావ అంతా అని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజా కంటక పాలనకు ముగింపు పలికేందుకు అంతా తనకు అండగా నిలవాలని కోరారు. మంగళవారం నెల్లూరులో సమర శంఖారావం సభ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ బూత్‌ కమిటీ సభ్యులకు వైఎస్‌ జగన్‌ పలు కీలక సూచనలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

బాబు కనిపిస్తే నిలదీయండి.. 
‘2014 ఎన్నికల్లో చంద్రబాబు మనందరికీ ఓ సినిమా చూపించారు. ఓట్ల కోసం మేనిఫెస్టోలో పలు హామీలిచ్చారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నాడు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు కావాలంటే బాబే అధికారంలోకి రావాలన్నాడు. బెల్ట్‌ షాపులను తొలగిస్తూ తొలి సంతకం చేస్తానన్నాడు.  రూ 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తానన్నాడు. ఈ సినిమా ఇంతటితో ఆగి పోలేదు. పిల్లలు కేజీ నుంచి పీజీ వరకూ చదవాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం లేదంటే రూ. 2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. చంద్రబాబు ఎప్పుడైనా కనిపిస్తే దీనిపై నిలదీయండి. ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఉన్నవే ఊడగొట్టారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని మాట మార్చాడు. మత్సకారులను ఎస్సీల్లో చేరుస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు. 

సీఎం కాగానే కమీషన్ల గురించే ఆలోచించారు... 
మూడేళ్లల్లో పోలవరం పూర్తి చేస్తానని 2014లో బాబు చెప్పారు. ఆపదలో ఉన్న మహిళ ఎవరైనా ఫోన్‌ చేస్తే ఐదు నిమిషాల్లో సాయం అందిస్తామన్నారు. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగు రోడ్లంటూ ఊరించారు. ఇంతటితో ఆగకుండా బుల్లెట్‌ రైలు అన్నాడు. అద్భుతమైన రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్‌ చూపించారు. రాజధాని ఎక్కడుంది? అని అడిగితే ఐదేళ్ల తరువాత మళ్లీ అవే గ్రాఫిక్స్‌ చూపిస్తూ బాహుబలి సినిమా చూశారా? అని ఎదురు ప్రశ్నిస్తారు. గత ఎన్నికలప్పుడు ఇలా చాలా చెప్పాడు చంద్రబాబు. కానీ వీటిలో ఏ ఒక్కటైనా  చంద్రబాబు నెరవేర్చారా? అని ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికలు ముగిశాక ఆయన ముఖ్యమంత్రి కాగానే చేసిందేమిటో తెలుసా..? భూములు ఎలా అమ్ముకోవాలి? ఏ కాంట్రాక్టర్‌ దగ్గర నుంచి ఎంత దోచుకోవాలి? మట్టి, ఇసుక ఎంతకి అమ్మాలి? బొగ్గులో కమీషన్‌ ఎలా తీసుకోవాలి? కరెంట్‌ కొనుగోలులో ఎంత కమీషన్‌ కాజేయాలి? అని ఆలోచించారు. అమరావతి నుంచి విశాఖపట్నం వరకు భూములు దోచుకోవాలన్న దురాలోచనతో చివరకు దేవాలయ భూములు, దళితుల భూములను కూడా వదిలిపెట్టలేదు. అది చాలక జన్మభూమి కమిటీలను  మాఫియాలా గ్రామాలపైకి వదిలారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో రెండో సినిమాకు సిద్ధమయ్యారు.  

అలాంటి వాళ్లను ఏమనాలి? 
చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాటు ప్రత్యేక హోదాని ఖూనీ చేశాడు. ఎన్నికలు రావడంతో నల్ల చొక్కాలు వేసుకుంటున్నాడు. ధర్మపోరాట దీక్ష అని అంటూ మరో సినిమా చూపిస్తాడు మనందరికీ. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ సంగతి మాత్రం ఎత్తడు. ఆ రుణాలు వడ్డీలు పెరిగి తడిసి మోపిడై చంద్రబాబు హయాంలో మొదట్లో రూ.14,200 కోట్లు ఉన్న రుణాలు ఈరోజు రూ.25 వేల కోట్లకు చేరాయి.  తాను చేసిన మోసానికి అక్కచెల్లెమ్మలను కనీసం క్షమించమని కూడా అడగడు. ఎన్నికల ముందు పసుపు– కుంకుమ అంటూ ఇంకొక డ్రామా. రైతులందరికి ఏటా రూ.12,500 ఇస్తామని, ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని, అండగా ఉంటామని మేం చెబుతున్నాం. కానీ ఈ పెద్దమనిషి ఐదేళ్ల పాటు రైతులకు ఏమీ ఇవ్వకుండా మోసం చేస్తాడు. ఇప్పుడు మళ్లీ రైతుల్ని మోసం చేసేందుకు ఎన్నికల ముందు అన్నదాతా సుఖీభవ అంటాడు. ఆయన ప్రవేశ పెట్టింది మధ్యంతర బడ్జెట్‌ మాత్రమే. అవ్వా తాతలకు ఫించన్లు పెంచుతామని నేను పాదయాత్ర మొదలు పెట్టకముందు దాదాపు రెండేళ్ల క్రితమే గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రకటిస్తే అప్పుడు చంద్రబాబు నోరు మెదపలేడు. ఎవరైనా 57 నెలలపాటు కడుపు మాడ్చి చివరి మూడు నెలలు అన్నం పెడతామంటే వారిని అన్నా అంటామా? లేక దున్నా అంటామా? అని మిమ్మల్ని అడుగుతున్నా. అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానన్నాడనే సామెత ఇలాంటి వ్యక్తులను చూసే పుట్టింది.
 
జగన్‌కు మీ అందరి తోడు కావాలి.. 
ఎన్టీఆర్‌ 1983లో ఎన్నికలకు ఆరు నెలలకు ముందు ప్రజల్లోకి వెళ్లి తిరుగుతూ తాను అధికారంలోకి వస్తే కిలో బియ్యం రూ.2కే ఇస్తా అని చెప్పారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్‌ నేత విజయభాస్కర్‌రెడ్డి ఎన్నికలకు మూడు నెలల ముందుగా కిలో బియ్యం రూ.1.90కే తాను ఇస్తానని చెప్పినా ప్రజలు ఆయనకు గట్టి గుణపాఠం చెప్పారు. నాలుగున్నరేళ్లు నువ్వు ఏమీ చేయలేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా జరగబోయేది అదే. ఈ పెద్ద మనిషి మోసాలు, అబద్ధాలు ఏస్థాయిలో ఉన్నాయో మీ అందరికీ తెలుసు. వీటికి చరమ గీతం పాడాల్సిన సమయం వచ్చింది. ఈ పని జరగాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీరంతా గ్రామాలకి వెళ్లి బాబు మోసాల గురించి చెప్పాలి. ఒక్కో బూత్‌ కమిటీ సభ్యుడు 35 ఇళ్లకు వెళ్లాలి. అన్యాయాల్ని సరిచేయాలంటే ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉందో లేదో చూడాలి. ఓటరు లిస్ట్‌లో ఓటు లేకుంటే ఎలా చేర్పించాలో  తెలుసుకోవాలి. మొదట ఓటరుకార్డు ఉన్నవారు కార్డుపై ఉన్న ఎపిక్‌ నెంబర్‌ను 1950కి మెసేజ్‌ చేయాలి. ఓటు నమోదు కోసం ఫాం 6 పూర్తి చేసి ఓటరుగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఫాం 6 లభిస్తుంది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో బీఎల్‌ఓల దగ్గర కూడా ఓటు నమోదు చేసుకోవచ్చును. దొంగ ఓట్లు ఉంటే ఫారమ్‌ 7 ద్వారా తొలగించాలి. ప్రతి ఇంటికి వెళ్లి మనల్ని ప్రేమించే ప్రతి ఒక్కరి ఓటు ఉందా లేదా అని పరిశీలించడంలో మీరంతా క్రియాశీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే ఇవాళ మనం చంద్రబాబు అనే మాయావితో యుద్ధం చేస్తున్నాం. ఈ విషయాన్ని మరచిపోకండని చెబుతున్నా.  

ప్రతి ఓటు మనకు కీలకమే.. 
ఇటీవల నేను కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి రాష్ట్రంలో  59 లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని అర్జీ ఇచ్చా. ఇవాళ టీడీపీ అధికారంలోకి ఉండటానికి, మనం ప్రతిపక్షంలో ఉండటానికి తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే. 1.30 కోట్ల ఓట్లు వైఎస్సార్‌సీపీకి వస్తే 1.35 కోట్ల ఓట్లు టీడీపీకి వచ్చాయి. కాబట్టి ప్రతి ఓటు మనకు చాలా కీలకం. చంద్రబాబు ఒక్కరితోనే కాదు అమ్ముడు పోయిన మీడియాతో కూడా నేడు మనం యుద్ధం చేస్తున్నాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ–5 మీడియాతో, ఇంకా అనేక ఛానెళ్లతో యుద్ధం చేస్తున్నాం. వీరంతా అబద్దాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా చూపే కార్యక్రమాన్ని చేస్తున్నారు.  

గ్రామాలకు నిఘా అధికారులను పంపుతున్నారు.. 
తెలంగాణా ఎన్నికలప్పుడు 36 గంటల ముందు ఏం జరిగింది? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఇతర ఎల్లో మీడియాలన్నీ  లగడపాటి సర్వే అంటూ కేసీఆర్‌ దిగిపోయి కాంగ్రెస్‌ – చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారంటూ చూపించారు. ఆ తరువాత లగడపాటి సర్వే ఏమైందో అందరికీ తెలిసిందే. ఈ జిత్తుల మారి నక్కల గురించి అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల సమయం సమీపించడంతో చంద్రబాబు ప్రతి గ్రామానికి ఇంటెలిజెన్స్‌ అధికారులను పంపుతున్నారు. ప్రభావితం చేసే వైఎస్సార్‌సీపీ నాయకులను ఎలా కొనాలి? ఎంత డబ్బు ఇవ్వాలి? అనే దిక్కుమాలిన  ఆలోచనలో ఈప్రభుత్వం ఉంది. మరో రెండు నెలలు అగండి.. మన అన్న వస్తాడు మనందరి జీవితాలు బాగుపడతాయని అందరికీ చెప్పాలని కోరుతున్నా. మీకు కేటాయించిన 35 ఇళ్లకు వెళ్లి నవరత్నాల గురించి తెలియజెప్పండి.  

మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకూ తగిలింది...
ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యులైన ప్రతి బూత్‌ కమిటీ సభ్యునికీ ముందుగా రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రతిపక్షంలో ఉన్న 9 ఏళ్లలో మీరంతా నాకు అండగా నిలిచారు. అధికారంలో ఉన్న వారు మిమ్మల్ని ఎన్ని కష్టాలు, బాధలు పెట్టారో, మీరెంత నష్ట పోయారో నాకు బాగా తెలుసు. మన ప్రతి కార్యకర్తా ఎన్ని కష్టాలు పడ్డారో... ఎన్ని అవమానాలను సహించారో కూడా తెలుసు. కొందరు లాఠీ దెబ్బలు తిన్నారు. మరి కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్నారు. మీ ప్రతి కష్టాన్ని, నష్టాన్ని నేను చూశా. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకూ తగిలింది. రేపు దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ బాగోగులను చూసుకుంటానని మాట ఇస్తున్నా. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మీకు అండగా ఉండి పైకి తీసుకొచ్చుకుంటా అని హామీ ఇస్తున్నా. ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడికీ ఇదే చెబుతున్నా. మీమీద పెట్టిన అక్రమ కేసులు, దొంగ కేసులన్నింటినీ పూర్తిగా ఎత్తేస్తామని హామీ ఇస్తున్నా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం ప్రజలందరికీ అందాలి. ఆ పథకాలను పేదవాడికి అందించేటపుడు కులాన్ని చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు. చివరకు ఏ పార్టీ వారు? అనేది కూడా చూడకూడదని మీ అందరికీ చెబుతున్నా. మీరే ముందుండి ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలా చేస్తానని చెబుతున్నా. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన హయాంలో రావాలి. అలాంటి పాలనకు దిక్సూచిగా మీరే నిలబడతారని హామీ ఇస్తున్నా.

సీ–విజిల్‌ యాప్‌ను ఉపయోగించండి 
స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న వారంతా ‘సీ–విజిల్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. టీడీపీ అక్రమాలను రికార్డు చేసి యాప్‌లో సెండ్‌ బటన్‌ నొక్కండి. మీరు బటన్‌ నొక్కిన వెంటనే రిటర్నింగ్‌ అధికారి వంద నిమిషాల్లోపే మీ వద్దకు వచ్చి పైవారికి నివేదిక ఇస్తారు. ఇది చట్టంలో ఉంది. వంద నిమిషాల్లో ఫలితం కనిపిస్తుంది’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement