తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన సమర శంఖారావం సభలో పార్టీ కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్
అన్నా.. రైతులకు రుణమాఫీ చేస్తామంటూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలుచేయకపోగా, ఇప్పుడు పసుపు–కుంకుమ పేరుతో మరో కొత్త మోసానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. దగాపడ్డ రైతన్నకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి? ఇలాంటి పరిస్థితులను ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎలా ఎదుర్కోవాలి?.. అంటూ తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్తలు వేసిన ప్రశ్నలకు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కాకినాడలో జరిగిన ‘సమర శంఖారావం’ సభలో తనదైన శైలిలో సమాధానమిస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. వీరి ప్రశ్నలకు ఆయన స్పందించిన తీరు పార్టీ శ్రేణులను ఆకట్టుకుంది. సభా వేదిక పైనుంచి వైఎస్ జగన్ వారితో జరిపిన సంభాషణ ఇలా సాగింది.. – సాక్షి ప్రతినిధి, కాకినాడ
ప్రశ్న: అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయి. అవకాశవాద రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
– నిడిగట్ల చింతలరావు, విరవ, పిఠాపురం మండలం
జగన్: అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయని చంద్రబాబు సర్కార్ మోసపూరిత విధానాలను ప్రతి అక్కచెల్లెమ్మకు, అన్నలకు చెప్పండి. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై మాట్లాడిన మాటలు, ఎన్నికల తరువాత మారిన చంద్రబాబు వైఖరి.. మళ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించడం వంటి చంద్రబాబు విధానాలపై ఆలోచన చేయాలని వివరించండి. ప్రత్యేక హోదా సంజీవిని కాదంటూ మాటమార్చి నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేసి అప్పుడు అడగని ప్రత్యేక హోదా ఇప్పుడు అడగడంలో బాబు ఆంతర్యమేమిటని గట్టిగా నిలదీయాలని ప్రజలకు వివరించండి. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకురాలేదో గట్టిగా నిలదీయమనండి. బీజేపీకి విడాకులు ఇచ్చాక పసుపు చొక్కాలు వదిలి నల్ల చొక్కాలు ధరించిన చంద్రబాబు వైఖరిని ప్రశ్నించమనండి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడు ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టి ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించైనా న్యాయపోరాటం చేసి సాధించుకునే వాళ్లం. కాంగ్రెస్ అలా చేయకపోవడంవల్లే ఇప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని తిరుపతి సభలో ప్రకటించిన ప్రధాని మోదీ.. హోదాను ఇవ్వగలిగే స్థానంలో ఉండి కూడా రాష్ట్రానికి మోసం చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో చంద్రబాబుకు, బీజేపీకి ఓటు వేయాలని, న్యాయం చేస్తానంటూ ప్రజలను కోరారు. నాలుగేళ్లపాటు వాళ్లతో సంసారం చేసి ఎన్నికలు రావడంతో ఇప్పుడు ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ వాస్తవాలన్నింటినీ ప్రజలకు వివరిస్తూ ‘అంతా దోషులేనని’ ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. ప్రత్యేక హోదా అనే మనిషిని.. ఒకరు కదలకుండా పట్టుకుంటే మరొకరు కత్తితో పొడిచి చంపారంటూ జగన్ వ్యాఖ్యానించారు.
ప్రశ్న: గత ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్నికలయ్యాక ఆ విషయాన్ని విస్మరించారు. గత హామీలే అమలుచేయని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు రావడంతో హడావుడిగా పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ పంపిణీ చేస్తున్నారు. వీటిని ఎలా అడ్డుకోవాలి?
– రొక్కాల గణేష్, జి.భావారం, కరప మండలం, చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు తుని మండలం
జగన్: పూటకో అబద్ధం, రోజుకో మోసం చేసే అలవాటున్న చంద్రబాబు.. రైతులను కూడా అదే తరహాలో దగా చేశారు. పసుపు–కుంకుమ పేరుతో నిజంగా అక్కాచెల్లెమ్మలకు డబ్బిచ్చే ఉద్దేశ్యమే ఉంటే నాలుగేళ్ల తొమ్మిది నెలల్లో ఈ అక్కచెల్లెమ్మలు ఎందుకు గుర్తుకురాలేదో గట్టిగా అడగమనండి. ఎన్నికలు సమీపించడంతో చెక్కులు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో గుర్తించమని చెప్పండి. రుణమాఫీ పేరుతో విదిల్చిన కొద్దిపాటి సొమ్ము కనీసం వడ్డీ కట్టేందుకు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు దగ్గరపడడంతో చంద్రన్న బాబా అన్నదాత సుఖీభవ అంటూ మరో పథకాన్ని ప్రకటించడంలో ఆంతర్యమేమిటో అర్థమయ్యేలా వివరించండి.
ప్రశ్న: వ్యవసాయమే ఆధారంగా జీవించే సాధారణ రైతులు ఇప్పుడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు, రుణమాఫీ అమలుకావడంలేదు. మహానేత వైఎస్ కాలంలో రైతే రాజు అన్న ధీమా ఉండేది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే అలాంటి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం?
– బాలచర్ల వెంకన్న,జెడ్.రాగంపేట, జగ్గంపేట మండలం
జగన్: ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు ప్రభుత్వంగా ఉంటామని హామీ ఇస్తున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎంతో నమ్మకం ఉంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయం. ప్రతీ రైతు ముఖంలో చిరునవ్వును చూసేలా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. నవరత్నాలలో రైతు సంక్షేమం కోసం చేసిన ప్రతిపాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అర్థమయ్యేలా వివరించండి.
Comments
Please login to add a commentAdd a comment