దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు
-
మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్
నాయుడుపేట:
దక్షణ భారతదేశంలోనే అత్యంత పెద్దదైన దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు. నాయుడుపేట ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుగరాజపట్నం ఓడరేవును తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. వాకాడు, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, చిట్టమూరు ప్రాంతాలు దుగరాజపట్నం ఓడరేవుతో ఎంతో అభివృద్ధి చెందనుందని అభిప్రాయపడ్డారు. ఓడరేవుకు అనుబంధంగా వంద పరిశ్రమలు వచ్చే అవకాశ ఉందని తద్వారా లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందడంతో పాటు లక్షమంది రైతులు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రైవేటు పోర్టుల నుంచి హెలికాప్టర్లను వినియోగించుకుంటూ వారికి వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటుకు అమ్ముడు పోతున్న జిల్లా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిని చూస్తుంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, వెంకటయ్య, సుబ్బయ్య ఉన్నారు.