
సాక్షి, అనంతపురం : జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. శ్రీరామ్ గెలవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ప్రజలను బెదిరిస్తున్నారు. ఈ సారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ పరిటాల శ్రీరాంను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. అయితే పరిటాల శ్రీరాం ఓడిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. టీడీపీకి ఓటేయకపోతే చంపేస్తామంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను బెదిరిస్తున్నారు.
తాజాగా కనగానపల్లి టీడీపీ నేత ముకుంద నాయుడు బహిరంగంగానే ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. పరిటాల సునీతతో కలిసి తల్లిమడుగు గ్రామంలో ప్రచారం నిర్వహించిన ముకుంద నాయుడు పోలింగ్ తేదీలోగా అందరూ టీడీపీలో చేరిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటేయకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్నారని ఆయన ఓడిపోతే సహించే ప్రసక్తే లేదన్నారు. ‘బెదిరింపు అనుకోండి.. వార్నింగ్ అనుకోండి.. పోలింగ్ తేదీలోగా అందరు టీడీపీలో చేరాలి. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి’ అంటూ ముకుందనాయుడు జనాలను హెచ్చరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వియషంలో రాప్తాడు పోలీసులు ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment