టీడీపీ నేతల బరితెగింపు! | TDP Leaders Attack on YSRCP Leaders in Visakhapatnam | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల బరితెగింపు!

Published Mon, Apr 1 2019 1:42 PM | Last Updated on Mon, Apr 1 2019 1:42 PM

TDP Leaders Attack on YSRCP Leaders in Visakhapatnam - Sakshi

దాడిలో గాయపడిన సత్తిబాబు నుంచి వివరాలు తెలుసుకుంటున్న చోడవరం సీఐ బుచ్చిరాజు

ఓటమి భయంతో ఉన్న టీడీపీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు. చోడవరం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కోన సత్తిబాబుపై కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని నిరసన తెలియజేశారు.

చోడవరం: అధికార టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు, దాడులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రజలను మోసం చేసే చర్యలకు పాల్పడడమే కాకుండా ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన చోడవరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

పోలీసులు హెచ్చరిం చిన  పదినిమషాల్లోనే టీడీపీ నాయకులు   రెచ్చి పోవడం వారి బరితెగింపునకు అద్దంపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రలోభాలు.. బెదిరింపులు
వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో విశేషంగా ఆదరణ లభిస్తోంది. దీంతో ఓటమి చెందుతామనే భయంతో ఉన్న అధికార టీడీపీ నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు  బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు   చోడవరం పట్టణంలో దుడ్డువీధి, అన్నవరం వీధుల్లో ఆదివారం ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని,  టీడీపీకి ఓటు వేస్తేనే అవి మీకు ఇస్తామని లేకుంటే వాటిని రద్దుచేస్తామని హెచ్చరిస్తూ,  ఆధార్‌కార్డు నంబరు, వివరాలు అడుగుతున్నారని, పరోక్షంగా ఓటర్లపై బెదిరింపులకు దిగుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వచ్చి ఈ వివరాలను సేకరిస్తున్న టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఆ వీధికి చెందిన టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య పోలీసు సమక్షంలో వాగ్వాదం జరిగింది. వెంటనే ఎస్‌ఐ రామకృష్ణ కలుగజేసుకుని ఇరువర్గాలకు చెందిన నాయకుల పేర్లను తీసుకొని బైండోవర్‌ కేసులు పెడతామని  హెచ్చరించారు. ఇక్కడ నుంచి అందరూ వెళ్లిపోవాలని  ఆదేశించారు. దీంతో అక్కడ నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులంతా వెళ్లిపోయారు. పోలీసులు కూడా  వెళ్లిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికే టీడీపీకి చెందిన స్థానిక పంచాయతీ తాజామాజీ వార్డు సభ్యుడు యర్రంశెట్టి చిన్నతోపాటు మరో నలుగురు ఆగ్రహంతో  ఊగిపోయారు. పోలీ సుల ఆదేశాలు బేఖాతరు చేయడమే కాకుండా  అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోయేందుకు తన బైక్‌ను తీస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు కోన సత్తిబాబుపై   దాడి చేశారు. అప్పటికే అక్కడ నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులంతా వెళ్లిపోవడంతో... వీడే పోలీసులకు ఫిర్యాదు చేశాడంటూ ఒంటరిగా ఉన్న సత్తిబాబుపై టీడీపీ నాయకులంతా మూకుమ్మడిగా   దాడి చేశారు. దీంతో తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నిందితుల కోసం గాలించగా అప్పటికే  పరారయ్యారు.

గాయపడి రక్తంతో ఉన్న  సత్తిబాబును స్టేషన్‌కు తీసుకొచ్చి వివరాలు తెలుసుకుని చికిత్స నిమిత్తం చోడవరం 30 పడకల ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం పట్టణంలో దావానంలా వ్యాపించడంతో మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడుతో పాటు పెద్దసంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు చేశారు.  అసలే అన్నవరం ప్రాంతం తీవ్ర సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటి కావడం  అలాంటి చోట  అధికార పార్టీ నాయకులు  దాడులు చేయడంతో  పట్టణ ప్రజలు ఆందోళన చెందారు.   పోలీసు అధికారులు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు.   144వ సెక్షన్‌ను అమలు చేసి, గస్తీ ఏర్పాటు చేశారు.  

నలుగురు టీడీపీ నాయకులపై కేసు  
సత్తిబాబుపై దాడిచేసిన  టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. వార్డుమెంబరు యర్రంశెట్టి అప్పారావు (చిన్న), పుల్లేటి శంకరావు, పొట్నూరి సత్యనారాయణ, తమడాన సూరిబాబులపై  324, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు  ఎస్‌ఐ రామకృష్ణ చెప్పారు.   ఎవరూ ఎటువంటి ఘర్షణలకు పాల్పడవద్దని, పోలీసు పికెట్‌తోపాటు, గస్తీని విస్తృతం చేశామని ఆయన చెప్పారు.  

ఎమ్మెల్యే ప్రోద్బలంతోగ్యాంగ్‌ల సంచారం
ఎమ్మెల్యే ప్రోద్బలంతో  కొందరు యువకులను గ్యాంగ్‌గా తయారు చేసి వీధుల్లోకి పంపి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని మిలట్రీనాయుడు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్తిబాబును చోడవరం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బుచ్చిరాజు విచారించారు.  దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఎమ్మెల్యే రాజు తన అనుచరులతో వచ్చి పోలీసు అధికారులతో మాట్లాడారు. కేసును తారుమారు చేసేందుకే ఎమ్మెల్యే వచ్చారని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పడంతో    ఇరు పార్టీల నేతలు వెళ్లిపోయారు.  గాయపడిన సత్తిబాబును మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ఇక్కడి వైద్యులు రిఫర్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement