సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థుల కోసం ఖర్చు చేయాల్సిన సుమారు రూ.130 కోట్ల నిధులను తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందర తన స్వప్రయోజనాల కోసం పక్కదారి పట్టిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్దిరోజుల ముందు కొన్ని ఉత్తర్వులు, షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా మరికొన్ని ఉత్తర్వులను సర్వశిక్ష అభియాన్ ద్వారా జారీ చేయించి కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ముఖ్యులు భారీ ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఖర్చుల కోసం ఇలా పిల్లల సొమ్మును దోపిడీ చేయడం అన్యాయమని గతంలో ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించ లేదని పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. పాత తేదీలతో పలు ఉత్తర్వులు జారీ చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో భారీగా కమీషన్లు దండుకొనేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కళాజాతాల పేరిట ప్రభుత్వ ప్రచారం
బడి బయట ఉన్న విద్యార్థులను స్కూళ్లలో చేర్పించడానికి, బడి మధ్యలో మానేసిన వారిని (డ్రాపవుట్లను) తిరిగి పాఠశాలల్లో చేర్పించడానికి వీలుగా అన్ని గ్రామాల్లో ప్రచారం చేయించడానికి సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. విద్యాసంవత్సరం మొదట్లో అంటే పాఠశాలలు ప్రారంభమైన మొదట్లోనే ఈ నిధులను వినియోగించాలి. అయితే అధికార తెలుగుదేశం పార్టీ విద్యా సంవత్సరం చివర్లో ఈ నిధులను పక్కదారి పట్టిస్తోంది. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో కళాజాతాల పేరిట ప్రభుత్వ ప్రచారానికి తెరలేపింది.
ప్రాథమిక స్థాయి తరగతులు ఏప్రిల్ 24 వరకు కొనసాగుతాయి. ఈలోగానే కళాజాతాల పేరిట నిధులను తమ ప్రభుత్వ ప్రచారానికి వినియోగించుకోవడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ గీశారు. భవిత, నాన్ భవిత సెంటర్ల ఏర్పాటు, పత్రికల్లో ప్రకటనలు, కథనాలు రాయించడం వంటివి చేయించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే సీఎంఓ, మీడియా ఇంటర్వెన్షన్ కింద రూ.6.08 కోట్లు ఖర్చు చేయడానికి ఉత్తర్వులు ఇవ్వగా తాజాగా అవుట్‌డోర్ అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం మరో రూ.3.70 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయిస్తున్న చంద్రబాబు, తెలుగుదేశం ప్రచారానికి పనికొచ్చేలా వాటికి బోర్డులు పెట్టి ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఏడాది చివర్లో విద్యార్థులకు బూట్లు అంట
ఎస్‌ఎస్‌ఏ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్దేశిస్తోంది. ఈ కార్యక్రమం కింద మధ్యాహ్న భోజనం, దుస్తుల పంపిణీ వంటివి చేపట్టాలి. బూట్ల పంపిణీ వాటిలో లేదు. అయినా ప్రస్తుతం విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లోని 29,71,098 మంది విద్యార్థులకు బూట్ల పంపిణీ కోసం అంటూ రూ.76 కోట్ల విడుదలకు ఎస్‌ఎస్‌ఏ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. పంపిణీ బాధ్యతలు వేర్వేరు సంస్థలకు కట్టబెట్టారు. జత బూట్లు, రెండు జతల సాక్స్‌లకు రూ.254 చొప్పున ధర నిర్ణయించారు. పాఠశాలలు మరో నెలరోజుల పాటే జరగనున్న సమయంలో ఇప్పుడు బూట్లకు ఆర్డర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఎన్నికల ఖర్చుల కోసం కమీషన్లు దండుకోవడానికే తప్ప మరొకటి కాదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు యూనిఫామ్‌లు ఇవ్వలేదు.. మూడో యూనిఫామ్‌కి నిధులు!
మరోపక్క 2018–19 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.180 కోట్లతో పంపిణీ చేయాల్సిన యూనిఫామ్‌లు ఇంకా పూర్తిగా పంపిణీ చేయలేదు. అనేక మండలాల్లోని విద్యార్థులకు ఒక్క జత కూడా అందలేదు. ఈ దుస్తుల కోసం కేంద్రం గతంలో రూ.400 ఇచ్చేది. ఇటీవల దీన్ని రూ.600లకు పెంచింది. ఈ పెరిగిన నిధులతో ఇప్పుడు 1నుంచి 5వ తరగతి వరకు ఉన్న 14,42,487 మంది పిల్లలకు మూడో జత అంటూ రూ.30 కోట్ల మేర ఆర్డర్లను ఓకే చేస్తూ ఎస్‌ఎస్‌ఏ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దుస్తుల కాంట్రాక్టులో కోట్లకొద్దీ నిధులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయినా మళ్లీ వారికే పనిని కేటాయించి సగం మొత్తాన్ని అడ్వాన్సుగా విడుదల చేయడం గమనార్హం. మదర్సాలు, ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులకు దుస్తుల పంపిణీ కోసం అంటూ మరో రూ.11 కోట్ల మేర కాంట్రాక్టు అప్పగించారు.
డిజిటల్ తరగతుల్లోనూ స్వాహా పర్వం
రాష్ట్రంలో 500 హైస్కూళ్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదుల వ్యవహారం మూణ్ణాళ్ల ముచ్చటగా ముగిసింది. పలుచోట్ల డిజిటల్ కంటెంట్ లేకపోవడంతో ఆ గదులు మూతపడ్డాయి. కొన్నిచోట్ల డిజిటల్ తరగతుల కోసం పంపిణీ చేసిన ప్రొజెక్టర్లు పనిచేయడం లేదు. కంప్యూటర్లు కూడా ఇంటెర్నెట్ సదుపాయం లేక నిరుపయోగంగా మిగిలాయి. ఈ నేపథ్యంలో 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆయా తరగతులు అసలు నిర్వహించలేదు. అయినా వాటి నిర్వహణ ఖర్చుల కోసం అంటూ ప్రైవేటు కంపెనీకి రూ.2.27 కోట్లను అందించేందుకు ఎస్‌ఎస్‌ఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవే కాకుండా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మానటరింగ్ సిస్టమ్ (ఎస్‌ఐఎంఎస్) కింద డ్రాపవుట్ ప్రిడిక్షన్, వీక్షణం, ఐ–సంపద తదితర కార్యక్రమాల పేరిట మరిన్ని నిధులను ఆయా సంస్థలకు కేటాయించేందుకు ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment