Sarva Shiksha Abhiyan scheme
-
సర్వశిక్ష అభియాన్‌లో అడ్డగోలు దోపిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేసిన పుస్తకాల కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. దాదాపు రూ.4.66 కోట్ల సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులను మింగేసిన గోల్మాల్ భాగోతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడితో పాటు ఎస్ఎస్ఏ ఎస్పీడీ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి జి.శ్రీనివాస్‌కు అవినీతి నిరోధక శాఖ శుక్రవారం నోటీసులు జారీ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ‘డ్రీమ్‌వరల్డ్ ఇండియా’ సీడీలు, డీవీడీలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని రెండున్నరేళ్ల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావుకు 16 రకాల పుస్తకాలతో ప్రతిపాదనలు అందజేసింది. పుస్తకాల వాస్తవ ధరలపై 71 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని పేర్కొంది. ఎస్ఎస్ఏ ద్వారా పుస్తకాల కొనుగోలుకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్ఈఆర్టీ) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన తరువాత 11 రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీ జి.శ్రీనివాస్ నిర్ణయించారు. ఎస్ఎస్ఏ అధికారులు, డ్రీమ్‌వరల్డ్ కంపెనీతో కుమ్మక్కు కావడంతో..ముందుగా చెప్పిన రేట్లకు బదులు పుస్తకాల ధరను భారీగా పెంచేశారు. సీఎం రమేష్ ప్రవేశంతో ‘డబుల్’ దందా! డ్రీమ్‌వరల్డ్ తొలుత పేర్కొన్న ధరల ప్రకారం 11 పుస్తకాల సెట్టు ధర రూ.7,200 మాత్రమే. కానీ తరువాత ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, ఆ సంస్థ కుమ్మక్కై ఈ ధరను అమాంతం రూ.13,489కి పెంచేశారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పుస్తకాల కోసం డ్రీమ్వరల్డ్కు ఆగమేఘాల మీద ఆర్డర్లు ఇచ్చారు. డిస్కౌంట్‌ను కూడా 71 శాతానికి బదులు 30 శాతానికి పరిమితం చేశారు. భారీగా కమిషన్ల కోసం రేట్లను అమాంతం పెంచేశారు. డ్రీమ్ వరల్డ్ సంస్థకు రాష్ట్ర కార్యాలయం నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉన్నా.. నిబంధనలను తుంగలో తొక్కి జిల్లా కార్యాలయాల నుంచి చెల్లింపులు చేయించారు. ముఖ్యకార్యదర్శి పరిశీలనలో తేలిన అక్రమాలు.. ఎస్ఎస్ఏలో నిధుల గోల్‌మాల్‌పై తనకు అందిన ఫిర్యాదుల ఫైలును పరిశీలించిన ముఖ్యకార్యదర్శి పుస్తకాల రేట్లు అమాంతం పెరిగిపోవడాన్ని గుర్తించారు. డ్రీమ్‌వరల్డ్ తొలుత ప్రభుత్వానికి అందించిన ధరల ప్రతిపాదనల పత్రాలు ఫైల్లో లేకపోవడం, వాటి స్థానంలో అధిక ధరలతో వేరే పత్రాలు ఉండడం ముఖ్యకార్యదర్శి దృష్టికి వచ్చింది. ముందుగా ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఒక్కో సెట్టు వాస్తవ ధర రూ.7,200 కాగా రూ.13,489కి పెంచేశారు. 11 పుస్తకాల సెట్టు రూ.7200 చొప్పున 7,413 సెట్లకు రూ.5,33,73,600 మాత్రమే అవుతుంది. అయితే ఎస్ఎస్ఏ ఎస్పీడీ కొత్త ధరల పట్టికను చూపిస్తూ రూ.13,489 చొప్పున రూ.9,99,93,957 చెల్లింపులు చేశారు. అసలది పబ్లిషింగ్ సంస్థే కాదు.. విచిత్రమేమంటే డ్రీమ్‌వరల్డ్ ఇండియా సంస్థ అసలు పబ్లిషింగ్ సంస్థే కాదని.. కేవలం పంపిణీదారు మాత్రమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. తొలుత ప్రతిపాదించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీని ముఖ్యకార్యదర్శి ఆదేశించినా ఫలితం లేకుండాపోయింది. ఇదిలా ఉండగా..ఈ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ రంగంలోకి దిగి రికార్డులను స్వాధీనం చేసుకుంది. వాస్తవాలు తేటతెల్లంగా తెలుస్తున్నా సీఎం రమేష్ సహా టీడీపీ నేతల ఒత్తిడితో గత ప్రభుత్వ హయాంలో కేసు ముందుకు సాగలేదు. తాజాగా ప్రభుత్వం అవినీతిపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏసీబీ ఎస్పీడీకి నోటీసులు జారీ చేసింది. అక్రమాలకు సాక్ష్యాలివిగో.. ప్రభుత్వానికి ముందుగా సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ‘స్పిరిట్ ఆఫ్ ఇండియా’ పుస్తకం ధర రూ.1,495 ఉంటే ఎస్పీడీ ప్రతిపాదనల్లో అది రూ.2,495కి పెరిగింది. -
బడి ముగిసాక బూట్లు ఇస్తారట..!!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థుల కోసం ఖర్చు చేయాల్సిన సుమారు రూ.130 కోట్ల నిధులను తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందర తన స్వప్రయోజనాల కోసం పక్కదారి పట్టిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్దిరోజుల ముందు కొన్ని ఉత్తర్వులు, షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా మరికొన్ని ఉత్తర్వులను సర్వశిక్ష అభియాన్ ద్వారా జారీ చేయించి కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ముఖ్యులు భారీ ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఖర్చుల కోసం ఇలా పిల్లల సొమ్మును దోపిడీ చేయడం అన్యాయమని గతంలో ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించ లేదని పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. పాత తేదీలతో పలు ఉత్తర్వులు జారీ చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో భారీగా కమీషన్లు దండుకొనేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కళాజాతాల పేరిట ప్రభుత్వ ప్రచారం బడి బయట ఉన్న విద్యార్థులను స్కూళ్లలో చేర్పించడానికి, బడి మధ్యలో మానేసిన వారిని (డ్రాపవుట్లను) తిరిగి పాఠశాలల్లో చేర్పించడానికి వీలుగా అన్ని గ్రామాల్లో ప్రచారం చేయించడానికి సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. విద్యాసంవత్సరం మొదట్లో అంటే పాఠశాలలు ప్రారంభమైన మొదట్లోనే ఈ నిధులను వినియోగించాలి. అయితే అధికార తెలుగుదేశం పార్టీ విద్యా సంవత్సరం చివర్లో ఈ నిధులను పక్కదారి పట్టిస్తోంది. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో కళాజాతాల పేరిట ప్రభుత్వ ప్రచారానికి తెరలేపింది. ప్రాథమిక స్థాయి తరగతులు ఏప్రిల్ 24 వరకు కొనసాగుతాయి. ఈలోగానే కళాజాతాల పేరిట నిధులను తమ ప్రభుత్వ ప్రచారానికి వినియోగించుకోవడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ గీశారు. భవిత, నాన్ భవిత సెంటర్ల ఏర్పాటు, పత్రికల్లో ప్రకటనలు, కథనాలు రాయించడం వంటివి చేయించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే సీఎంఓ, మీడియా ఇంటర్వెన్షన్ కింద రూ.6.08 కోట్లు ఖర్చు చేయడానికి ఉత్తర్వులు ఇవ్వగా తాజాగా అవుట్డోర్ అడ్వర్టయిజ్మెంట్ల కోసం మరో రూ.3.70 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయిస్తున్న చంద్రబాబు, తెలుగుదేశం ప్రచారానికి పనికొచ్చేలా వాటికి బోర్డులు పెట్టి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది చివర్లో విద్యార్థులకు బూట్లు అంట ఎస్ఎస్ఏ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్దేశిస్తోంది. ఈ కార్యక్రమం కింద మధ్యాహ్న భోజనం, దుస్తుల పంపిణీ వంటివి చేపట్టాలి. బూట్ల పంపిణీ వాటిలో లేదు. అయినా ప్రస్తుతం విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లోని 29,71,098 మంది విద్యార్థులకు బూట్ల పంపిణీ కోసం అంటూ రూ.76 కోట్ల విడుదలకు ఎస్ఎస్ఏ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. పంపిణీ బాధ్యతలు వేర్వేరు సంస్థలకు కట్టబెట్టారు. జత బూట్లు, రెండు జతల సాక్స్‌లకు రూ.254 చొప్పున ధర నిర్ణయించారు. పాఠశాలలు మరో నెలరోజుల పాటే జరగనున్న సమయంలో ఇప్పుడు బూట్లకు ఆర్డర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఎన్నికల ఖర్చుల కోసం కమీషన్లు దండుకోవడానికే తప్ప మరొకటి కాదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు యూనిఫామ్‌లు ఇవ్వలేదు.. మూడో యూనిఫామ్‌కి నిధులు! మరోపక్క 2018–19 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.180 కోట్లతో పంపిణీ చేయాల్సిన యూనిఫామ్‌లు ఇంకా పూర్తిగా పంపిణీ చేయలేదు. అనేక మండలాల్లోని విద్యార్థులకు ఒక్క జత కూడా అందలేదు. ఈ దుస్తుల కోసం కేంద్రం గతంలో రూ.400 ఇచ్చేది. ఇటీవల దీన్ని రూ.600లకు పెంచింది. ఈ పెరిగిన నిధులతో ఇప్పుడు 1నుంచి 5వ తరగతి వరకు ఉన్న 14,42,487 మంది పిల్లలకు మూడో జత అంటూ రూ.30 కోట్ల మేర ఆర్డర్లను ఓకే చేస్తూ ఎస్ఎస్ఏ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దుస్తుల కాంట్రాక్టులో కోట్లకొద్దీ నిధులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయినా మళ్లీ వారికే పనిని కేటాయించి సగం మొత్తాన్ని అడ్వాన్సుగా విడుదల చేయడం గమనార్హం. మదర్సాలు, ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులకు దుస్తుల పంపిణీ కోసం అంటూ మరో రూ.11 కోట్ల మేర కాంట్రాక్టు అప్పగించారు. డిజిటల్ తరగతుల్లోనూ స్వాహా పర్వం రాష్ట్రంలో 500 హైస్కూళ్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదుల వ్యవహారం మూణ్ణాళ్ల ముచ్చటగా ముగిసింది. పలుచోట్ల డిజిటల్ కంటెంట్ లేకపోవడంతో ఆ గదులు మూతపడ్డాయి. కొన్నిచోట్ల డిజిటల్ తరగతుల కోసం పంపిణీ చేసిన ప్రొజెక్టర్లు పనిచేయడం లేదు. కంప్యూటర్లు కూడా ఇంటెర్నెట్ సదుపాయం లేక నిరుపయోగంగా మిగిలాయి. ఈ నేపథ్యంలో 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆయా తరగతులు అసలు నిర్వహించలేదు. అయినా వాటి నిర్వహణ ఖర్చుల కోసం అంటూ ప్రైవేటు కంపెనీకి రూ.2.27 కోట్లను అందించేందుకు ఎస్ఎస్ఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవే కాకుండా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మానటరింగ్ సిస్టమ్ (ఎస్ఐఎంఎస్) కింద డ్రాపవుట్ ప్రిడిక్షన్, వీక్షణం, ఐ–సంపద తదితర కార్యక్రమాల పేరిట మరిన్ని నిధులను ఆయా సంస్థలకు కేటాయించేందుకు ఉత్తర్వులు జారీచేశారు. -
'సర్వశిక్షా అభియాన్' అంతా కనికట్టు
స్వరశిక్షా అభియాన్.. అదో మాయా ప్రపంచం. ఇక్కడ అంతా ఇంద్రజాలికులే. స్కూల్ అదనపు తరగతి గదులు ఉండవు. కానీ రికార్డుల్లో పక్కా కట్టడాలు నిర్మించినట్టు ఉంటుంది. ఇంజినీరింగ్ విభాగం పనులు నిర్వహించరు. కానీ అన్ని పూర్తయినట్లు రికార్డుల్లో ఉంటాయి. పూర్తి చేసిన ప్రతి పనికి ఉండాల్సిన ఎంబుక్‌లు ఒక్కటీ కనిపించవు. ఇదంతా చదువులు చెప్పే సర్వశిక్షా అభియాన్‌లోని ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి బాగోతం. అవినీతి పరాకాష్టకు చేరడంతో సీఎంఓకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణకు ఆదేశించారు. సోమవారం సర్వశిక్షా అభియాన్ డిప్యూటీ డైరెక్టర్‌ను విచారణకు జిల్లాకు రానున్నారు. సర్వశిక్షా అభియాన్‌లో అలజడి రేగింది. సుమారు రూ.3 కోట్ల మేర భారీగా స్వాహా చేసినట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్‌లో చేపట్టే పనులకు లెక్కా పత్రం సక్రమంగా ఉండవు. అక్కడ కొందరు సిబ్బంది అందిన మేర దండుకోవటానికి అలవాటు çపడ్డారు. గతంలో ఏసీబీ కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా యథావిధిగా కొనసాగిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో 2012 నుంచి 2015 వరకు సుమారు రూ.10 కోట్లకు పైగా విలువైన పనులు సర్వశిక్షా అభియాన్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించింది. ముఖ్యంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర పనులు నిర్వహించారు. అయితే ఇందులో ముఖ్యంగా అదనపు తరగతి గదుల నిర్మాణంలో రూ.1.42 కోట్ల మేర స్వాహాకు గురైనట్లు సమాచారం. 2012–13 వార్షిక సంవత్సరంలో రూ.62.20 లక్షలు, 2013–14లో రూ.11.87 లక్షలు, 2014–15లో రూ.68.17 లక్షలు మొత్తం రూ.1.42 కోట్లు అదనపు తరగతి గదులు నిర్మించకుండా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను బ్యాంక్‌ల నుంచి విత్‌డ్రా చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు చేసే ప్రతి పనిని ఎంబుక్ నమోదు తప్పనిసరి. కానీ ఇక్కడ అసలు ఎంబుక్ కూడా లేని పరిస్థితి. దీనిపై గతంలో కలెక్టర్ విచారణకు ఆదేశించి నివేదిక పంపమని కోరినా అధికారులు నేటికీ పంపలేదు. జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 456 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.59 కోట్లు ని«ధులు మంజూరయ్యాయి. వీటిలో 70 శాతం అంటే రూ.79.80 లక్షలు మొత్తం కేంద్ర ప్రభుత్వం వాటా కాగా మిగిలిన 30 శాతం మెత్తం రూ. 23.94 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాటా. అయితే ఈ మొత్తం ప్రాజెక్ట్ ఆఫీసర్ పేరుతో కెనరా బ్యాంక్‌లో ఉన్న ఖాతాకు జమ చేశారు. అక్కడి నుంచి ఇందులో రూ.79.80 లక్షల మొత్తం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు గూడూరు, కావలితో పాటు ఇతరుల ఖాతాలకు జమ చేశారు. ఈ మొత్తంతో చేసిన పనులకు సంబంధించిన ఎంబుక్ నమోదు కానీ, వర్క్ ఆర్డర్ కానీ, జేటీఓ వెరిఫికేషన్ కానీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పాసింగ్ ఆర్డర్ కానీ ఏమీ లేకుండా రూ. 40 లక్షల వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సివిల్ పనులకు సంబంధించి మొత్తం రూ.4.58 కోట్లు నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మొత్తం నిధులు మంజూరు ఇందులో రూ.4.05 కోట్లు విలువైన పనులు మాత్రమే చేశారు. మిగిలిన రూ. 53 లక్షలు పనులు చేయకుండా స్వాహాకు రంగం సిద్ధం చేశారు. అయితే దీనిపై దూమారం రేగడంతో ఆ నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. ఇక నిర్మాణాల నాణ్యత పరిశీలించల్సిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతను ప్రెవేట్ ఏజెన్సీకి అప్పగించి వారికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఇలా ప్రతి పనిలో అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంది. వీటిపై కార్యాలయంలో సిబ్బంది మధ్య విభేదాలు తలెత్తడంతో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొందరు సీఎంను కలిసి దీనిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో సీఎంఓ విచారణకు ఆదేశించింది. సోమవారం సర్వశిక్షా అభియాన్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్ నెల్లూరులో పర్యటించి కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. -
యూ‘నో’ఫాం
- విద్యాసంవత్సరం ప్రారంభమై 3 నెలలు అవుతున్నా సరఫరా కాని యూనిఫాం - ఇక కుట్టేదెప్పుడు.. కట్టేదెప్పుడు - జిల్లాకు రూ.6 కోట్లు కేటాయింపు - రూ.3 కోట్లు ఆప్కోకు విడుదల - ఎయిడెడ్ విద్యార్థుల పట్ల వివక్ష సాక్షి, కడప : ప్రతి యేడాది లాగే ఈ యేడాది విద్యార్థులకు యూనిఫాం కష్టాలు తప్పడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం మాత్రం అందలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ వారంలో మొదలు కావడం చూస్తుంటే మరో మూడు నెలలకైనా యూనిఫాం అందుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,566 పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు యూనిఫాంను సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జిల్లాలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున యూనిఫాం అందజేయాల్సి ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు అందజేయాల్సిన దుస్తులకు సంబంధించిన కాంట్రాక్టును ఆప్కో సంస్థకు కేటాయించారు. అయితే సంస్థకు ఇప్పటి వరకు ఎటువంటి మొత్తం అందజేయకపోవడంతో వారు కేవలం మండలాల వారీగా విద్యార్థుల వివరాలు, ఇండెంట్ మాత్రం సేకరించి మిన్నకుండిపోయారు. కాగా నాలుగు రోజుల క్రితం దుస్తుల కోసం ఎస్ఎస్ఏకు దాదాపు రూ. 6కోట్లు మంజూరు కాగా ఇందులో 50 శాతం నిధులను విడుదల చేసినట్లు తెలిసింది. దీంతో ఆప్కో సంస్థ ఆగమేఘాల మీద విద్యార్థులకు దుస్తులను సమకూర్చే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. కుట్టేదెప్పుడు... కట్టేదెప్పుడు.. విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్ఎస్ఏ అధికారులు మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు కేటాయించారు. దీంతో వారికి రేపో మాపో దుస్తులు కుట్టే బాధ్యత అప్పగించనున్నారు. ఇప్పటికే మూడు నెలల ముచ్చట ముగిసింది. ఇక దాదాపు 4 లక్షల దుస్తులను ఎప్పుడు కుడతారో.. పాఠశాలలకు ఎప్పుడు అందజేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో దసరా సెలవుల ముందైనా అందజేస్తారా లేదా అన్న మీమాంసలో విద్యార్థులు ఉన్నారు. ప్రతిసారీ ఇదే వరుస.. విద్యార్థుల విషయంలో ప్రతిసారీ ఇదే వరుస కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. విద్యార్థుల దుస్తుల విషయంలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. ప్రతిసారీ పాఠశాలల పునఃప్రారంభ సమయంలో బడిబాట పేరుతో హంగామా చేసే అధికారులకు యూనిఫాం గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నా ఉన్న పథకాలను విస్మరించకుండా సరైన సమయంలో విద్యార్థులకు యూనిఫాం అందజేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఎయిడెడ్ విద్యార్థుల పట్ల ఎందుకీ వివక్ష.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్, నగరపాలక, పురపాలక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజనం, ఉచిత దుస్తులను ప్రభుత్వం అందజేస్తోంది. అయితే అదే ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఎయిడెడ్ పాఠశాలల పట్ల మాత్రం ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలను అందజేస్తున్న ప్రభుత్వం ఉచిత దుస్తుల విషయంలో మాత్రం ఎందుకు మీనవేషాలు లెక్కిస్తున్నారో అంతుచిక్కడం లేదు.