- విద్యాసంవత్సరం ప్రారంభమై 3 నెలలు
అవుతున్నా సరఫరా కాని యూనిఫాం
- ఇక కుట్టేదెప్పుడు.. కట్టేదెప్పుడు
- జిల్లాకు రూ.6 కోట్లు కేటాయింపు
- రూ.3 కోట్లు ఆప్కోకు విడుదల
- ఎయిడెడ్ విద్యార్థుల పట్ల వివక్ష
సాక్షి, కడప : ప్రతి యేడాది లాగే ఈ యేడాది విద్యార్థులకు యూనిఫాం కష్టాలు తప్పడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం మాత్రం అందలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ వారంలో మొదలు కావడం చూస్తుంటే మరో మూడు నెలలకైనా యూనిఫాం అందుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,566 పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు యూనిఫాంను సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది.
ఈ పథకం ద్వారా జిల్లాలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున యూనిఫాం అందజేయాల్సి ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు అందజేయాల్సిన దుస్తులకు సంబంధించిన కాంట్రాక్టును ఆప్కో సంస్థకు కేటాయించారు. అయితే సంస్థకు ఇప్పటి వరకు ఎటువంటి మొత్తం అందజేయకపోవడంతో వారు కేవలం మండలాల వారీగా విద్యార్థుల వివరాలు, ఇండెంట్ మాత్రం సేకరించి మిన్నకుండిపోయారు. కాగా నాలుగు రోజుల క్రితం దుస్తుల కోసం ఎస్‌ఎస్‌ఏకు దాదాపు రూ. 6కోట్లు మంజూరు కాగా ఇందులో 50 శాతం నిధులను విడుదల చేసినట్లు తెలిసింది. దీంతో ఆప్కో సంస్థ ఆగమేఘాల మీద విద్యార్థులకు దుస్తులను సమకూర్చే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.
కుట్టేదెప్పుడు... కట్టేదెప్పుడు..
విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్‌ఎస్‌ఏ అధికారులు మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు కేటాయించారు. దీంతో వారికి రేపో మాపో దుస్తులు కుట్టే బాధ్యత అప్పగించనున్నారు. ఇప్పటికే మూడు నెలల ముచ్చట ముగిసింది. ఇక దాదాపు 4 లక్షల దుస్తులను ఎప్పుడు కుడతారో.. పాఠశాలలకు ఎప్పుడు అందజేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో దసరా సెలవుల ముందైనా అందజేస్తారా లేదా అన్న మీమాంసలో విద్యార్థులు ఉన్నారు.
ప్రతిసారీ ఇదే వరుస..
విద్యార్థుల విషయంలో ప్రతిసారీ ఇదే వరుస కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. విద్యార్థుల దుస్తుల విషయంలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. ప్రతిసారీ పాఠశాలల పునఃప్రారంభ సమయంలో బడిబాట పేరుతో హంగామా చేసే అధికారులకు యూనిఫాం గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నా ఉన్న పథకాలను విస్మరించకుండా సరైన సమయంలో విద్యార్థులకు యూనిఫాం అందజేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ఎయిడెడ్ విద్యార్థుల పట్ల ఎందుకీ వివక్ష..
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్, నగరపాలక, పురపాలక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజనం, ఉచిత దుస్తులను ప్రభుత్వం అందజేస్తోంది. అయితే అదే ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఎయిడెడ్ పాఠశాలల పట్ల మాత్రం ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలను అందజేస్తున్న ప్రభుత్వం ఉచిత దుస్తుల విషయంలో మాత్రం ఎందుకు మీనవేషాలు లెక్కిస్తున్నారో అంతుచిక్కడం లేదు.
యూ‘నో’ఫాం
Published Wed, Aug 20 2014 2:07 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement