ప్రదర్శనగా వెళ్లకుండా చెర్మన్‌ను అడ్డుకుంటున్న సీఐ సత్యానందం
ఉయ్యూరు: టీడీపీలో చైర్మన్‌పై అవిశ్వాస వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జంపాన పూర్ణచంద్రరావు (పూల)కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనతో టీడీపీ పరువు రోడ్డున పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరించే జంపాన కుటుం బం బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కి చంద్రబాబు, ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్యే బోడె, ఎమ్మెల్సీ వైవీబీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో కౌంటర్‌గా టీడీపీ ముఖ్యనేతలు మీడియా సమావేశం పెట్టి సమర్ధించుకునే పనిలోపడ్డారు. అయితే చైర్మన్ పూల తిరుగుబాటు జెండా ఎగురవేయడం, టీడీపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపైనే చర్చ జరుగుతోంది.
ప్రదర్శన అడ్డగింపు.. ఉద్రిక్తత!
మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు (పూల)పై అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ శ్రేణులతో పాటు ఆ సంఘ నాయకులు ర్యాలీకి ఉపక్రమించారు. సమాచారం అందుకున్న పోలీసులు చైర్మన్‌ను కలిసి ర్యాలీకి అనుమతి లేదని, సమావేశాన్ని తన అపార్ట్‌మెంటులోనే నిర్వహించుకుని మీడియాతో మాట్లాడుకోవాలని విన్నవించారు.
ఈ క్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శొంఠి నాగరాజు అక్కడకు చేరుకుని శాంతియుత ప్రదర్శనకు అనుమతి ఏంటంటూ చైర్మన్‌తో కలిసి రోడ్డెక్కారు. సీఐ సత్యానందం నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ప్రదర్శనగా వెళ్లకుండా పూల మద్దతుదారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాదులాటలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసుల దురుసు ప్రవర్తనపై బీసీ సంఘాల ప్రతినిధులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారడంతో చివరకు సెంటర్ వరకు ప్రదర్శనను అనుమతించకతప్పలేదు.
బీసీల సత్తా చూపుతాం
బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఆ వర్గాలకే టీడీపీ అన్యాయం చేస్తుందని టీడీపీకి చెందిన చైర్మన్ పూల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చైర్మన్‌గా పీఠమెక్కించి నాలుగేళ్లు నరకం చూపించారు. ఏ ఒక్కరోజు నన్ను పాలన చేసుకోనివ్వలా.. అన్నీ అవాంతరాలే.. ప్రతి పనికీ ఎమ్మెల్యే అనుమతంటూ ఇబ్బందులు పెట్టారు.. నా సొంత నిర్ణయమంటూ ఏమీ లేదు.. టీడీపీ ముఖ్యనాయకులే పాలించుకున్నారు.. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలోనే ఉంటే నాపై అవిశ్వాసం పెట్టి దింపేస్తానంటారా.. ఇదేనా బీసీలకు టీడీపీలో జరిగే న్యాయం’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు జిల్లాలో ఏ గౌడ కులస్తులను ఎదగనివ్వరన్నారు. ఎమ్మెల్యే కాగిత వెంకట్రావును అణగదొక్కినట్లే తనను కూడా ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపైనా విమర్శలు గుప్పించారు. అవిశ్వాసం వెనక్కి తీసుకోకుంటే రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చూపుతామన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి ఖుద్దూస్‌కు చైర్మన్ ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు.
చంద్రబాబూ.. ఖబడ్దార్..
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శొంఠి నాగరాజు మాట్లాడుతూ, బీసీల జోలికొస్తే ఖబద్దార్ అంటూ హెచ్చరించారు. టీడీపీలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు. బీసీల పేరు చెప్పుకుని గద్దెనెక్కి బీసీ చైర్మన్‌పైనే అవిశ్వాసం పెట్టిస్తావా అని ప్రశ్నించారు. 13 జిల్లాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అవిశ్వాసం వెనక్కు తీసుకోకుంటే 2019 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పూలను బరిలోకి దించి టీడీపీని ఓడిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment