సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి, నెల్లూరు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయో రావో ఇంకా సృష్టత రాని పరిస్థితి. ఒక వేళ ఎన్నికలు వస్తే ఎవరు పోటీ చేయాలనే దానిపై అధికార పార్టీలో తర్జనభర్జలకు జిల్లా మహానాడు వేదిక అయింది. మహానాడులో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పరస్పరం ఉప ఎన్నికల విషయమై కౌంటర్లు.. ప్రతి కౌంటర్లు వేసుకోవటం హాట్ టాపిక్‌గా మారింది. తొలుత మాట్లాడిన మాజీ మంత్రి ఆదాల మంత్రి సోమిరెడ్డితో వర్గవిభేదాల నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ ఉప ఎన్నిక స్థానంలో ఇద్దరు మంత్రుల్లో ఎవరో ఒకరు పోటీచేయాలని వ్యాఖ్యనించటం, చివరగా ప్రసంగించిన మంత్రి సోమిరెడ్డి ఆదాల అన్న వద్ద ఉన్నంత డబ్బు తనవద్ద లేదని ఆయనకే టికెట్ ఇస్తే మేం బాధ్యత తీసుకుని గెలిపించుకుంటామని పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీసింది. పనిలో పనిగా మంత్రి సోమిరెడ్డి మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. యథావిధిగా సీనియర్ నాయకులు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడం.. సభలో మాట్లాడిన నేతలు అందరూ ఇప్పుడే టికెట్ల గురించి చర్చకు తెరతీయటం లాంటి పరిణామాల నడుమ జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగింది.
సృష్టత ఎవరికీ లేదు
రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇంకా పూర్తి సృష్టత ఎవరికీ లేదు. ఉప ఎన్నికలు వస్తాయా లేక ముందస్తు ఎన్నికలు వస్తాయా లేక సాధారణ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అనే విషయం తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫలానా సీటులో నీవు అంటే నీవు పోటీ చేయాలంటూ నేతలే చర్చించుకున్నారు. అది కూడా వర్గ విభేదాల నేపథ్యంలో పార్టీకి కష్టంగా ఉండే స్థానాల్లో ఫలానా నేత పోటీ చేయాలంటూ మాట్లాడి రాజకీయ వేడి పుట్టించడంతో పాటు పరోక్షంగా వైరి నేతలకు గట్టిగా కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఇక మహానాడుకు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ గైర్హాజరయ్యారు.
ఆదాల వర్సెస్ సోమిరెడ్డిమంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల మధ్య రాజకీయ విభేదాలు మహానాడు సభలో సృష్టంగా సభలో బయపడ్డాయి. దీంతో పాటు ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకున్నారు. మాజీ మంత్రి ఆదాల పరోక్షంగా సోమిరెడ్డిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ధాన్యంకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయినా పట్టించుకోవటం లేదని పేర్కొనడం కలకలం రేగింది. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే నెల్లూరు పార్లమెంట్ నుంచి మంత్రులు ఇద్దరిలో ఒకరు పోటీ చేయాలని ఆదాల వాఖ్యానించారు. చివరగా మంత్రి సోమిరెడ్డి గంటకు పైగా ప్రసంగించి పనిలో పనిగా తన రాజకీయ ప్రత్యర్థులు ఆదాల, ఆనంపై పరోక్ష విమర్శలు చేశారు. ఆదాలను ఉద్దేశించి సోమిరెడ్డి మాట్లాడుతూ ‘నా దగ్గర అన్న వద్ద ఉన్నంత డబ్బు లేదు.. అన్న దగ్గరే బాగా డబ్బు ఉంది.. అన్నే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత మేం తీసుకుంటాం’ అని ఆదాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఇసుక, సిలికా, రేషన్, ఎర్రచందనం మాఫియా విమర్శలపై మాట్లాడుతూ ప్రతి దానిలో అన్ని పార్టీల వారు ఉన్నారు. అయితే ఎవరు ఏంటో పూర్తిగా తెలుసుకుని మట్లాడితే బాగుంటుంది. ప్రతి దాన్నీ సోమిరెడ్డి పై బురదజల్లేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
పొరపాట్లు మళ్లీ చేయం..
‘2014 ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ చేయం. గతంలో అసెంబ్లీ సీట్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర జాప్యం జరగటంతో జిల్లాలో మెజార్టీ స్థానాలు కోల్పోయాం.. ఈసారి అలా కాకుండా ఎన్నికలు ఆరు నెలల ముందే అభ్యర్థులు ఖరారు చేయాలని అధిష్టానాన్ని కోరతాం.. గతంలో తనకు నెల్లూరు రూరల్ అని చెప్పి చివరి నిమిషంలో సర్వేపల్లికి మార్చారు. అలాగే నెల్లూరు పార్లమెంట్‌తో పాటు కొన్ని సీట్ల కేటాయింపుల్లో జాప్యం జరిగింది. ఈసారి దానికి అవకాశం లేకుండా ముందే సృష్టత కోరతాం’ అని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
సీనియర్ల గోడు యథాతథం
తమకు ప్రాధాన్యం ఇవ్వటం లేదంటూ సీనియర్లు మహానాడు వేదికపై మరోసారి గళం విప్పారు. నాలుగేళ్లుగా చెబుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోవూరుకు చెందిన పార్టీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తానే గొప్ప అనే రీతిలో మన ఎమ్మెల్యేలు వ్యవహరించటం పార్టీకి చేటు తెస్తున్నాయని పరోక్షంగా ఎమ్మెల్యే పోలంరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో సీనియర్ నేత నువ్వుల మంజుల మాట్లాడుతూ సీనియర్లు అంటే గౌరవం లేకుండా పోయిందని వాపోయారు. మొత్తం మీద మహానాడు ఎన్నికల సభలా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment