ఓడినా తగ్గని చింతమనేని అరాచకాలు | TDP Leaders Corruption in West Godavari | Sakshi
Sakshi News home page

దురుద్దేశం.. దుష్ప్రచారం

Published Sat, Sep 28 2019 1:12 PM | Last Updated on Sat, Sep 28 2019 1:12 PM

TDP Leaders Corruption in West Godavari - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో తెలుగుదేశం నేతల్లో వణుకు మొదలైంది. వాటిని కప్పి పుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నారు. గత ఐదేళ్లలో దెందులూరులో రౌడీ రాజ్యాన్ని చూపించిన చింతమనేని ప్రభాకర్‌ జైలుకు వెళ్లగానే ఆయనకేదో అన్యాయం జరిగిపోయినట్లు తెలుగుదేశం నేతలు జిల్లాకు క్యూకట్టారు. ఏదో స్వాతంత్య్ర సమరయోధుడిని అరెస్టు చేసినట్టుగా బాధపడిపోతూ.. ఆయనను పరామర్శిస్తున్నారు. జైలుకు వెళ్లినా కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసు అధికారులతో చింతమనేని ఏ విధంగా వ్యవహరించారో, నోటికి వచ్చినట్లు ఎలా బూతులు తిట్టారో అందరూ చూశారు. తాజాగా మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతోపాటు ఇతర నేతలు జైలుకు వెళ్లి చింతమనేనిని పరామర్శించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. జిల్లా అధికారులపైనా  ఆరోపణలకు దిగారు.

చింతమనేని ప్రభాకర్‌ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిం చడం తెలుగు తమ్ముళ్లకు నొప్పిని కలిగిస్తోంది. గత ఐదేళ్లలో ఆయనపై ఎన్ని కేసులు ఉన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాటిని తప్పుడు కేసులు అంటూ తమ అనుకూలమైన అధికారులతో ఎత్తివేయించుకున్నప్పుడు పోలీసుల పక్షపాతం తెలుగుదేశం నాయకులకు కనపడలేదు. మరోవైపు చింతమనేనికి అన్యాయం జరిగిపోయిందని.. జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లను సమీకరించి ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ వర్ల రామయ్య ప్రకటించారు. మరో అడుగు ముందుకు వేసి తమ ప్రభుత్వం వస్తే ఇంతకు రెండింతలు మీ కుటుంబాలను వేధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

ఓడినా తగ్గని చింతమనేని అరాచకాలు
చింతమనేని ఎమ్మెల్యేగా ఓడిపోయినతర్వాత కూడా జానంపేట వద్ద రైతులు వేసుకున్న పైపులు ఎత్తుకుపోవడం, పినకడిమిలో దళితులపై దౌర్జన్యానికి దిగడం అందరికీ తెలిసిందే. చింతమనేనిని అరెస్టు చేసిన రోజున కూడా డీఎస్పీ స్థాయి అధికారిని  పచ్చిబూతులు తిట్టారు. ఇన్ని చేసినా ఆయనపై కేసులు పెట్టకూడదట. కేసులు పెడితే ఆయనను వేధిస్తున్నట్లుగా తెలుగుదేశం నేతలు కలరింగ్‌ ఇస్తున్నారు. 

బడేటి బుజ్జి చిందులు
ఏలూరులో ఆక్రమణల తొలగింపును మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అడ్డుకున్న సంగతి తెలిసిందే. సుబ్బమ్మదేవి స్కూల్‌ విషయంలో రికార్డులు తారుమారు చేశారని, మున్సిపల్‌ స్కూల్‌ గ్రౌండ్‌ను కైంకర్యం చేశారంటూ అఖిలపక్షం మూడేళ్లుగా ఉద్యమం చేస్తూ వచ్చింది. తాజాగా తప్పుడు సర్వే నంబర్లపై రిజిస్ట్రేషన్లు చేయించారని, ఆ భూమి మున్సిపాలిటీదేనని తేలిన తర్వాత కలెక్టర్‌ స్పందించి రిజిస్ట్రేషన్‌ రద్దు చేయించి ఆ భూమిని స్వాధీనం చేసుకోగానే కలెక్టర్‌పై కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్‌తో ఎవరో కొనుక్కుని కట్టడాలు నిర్మిస్తుంటే దాన్ని మున్సిపల్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటుంటే తన ప్రమేయం లేని మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి రంగంలోకి ఎందుకు వచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ భూ కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

మాధవనాయుడికీ భంగపాటు
మరోవైపు  నరసాపురంలో వ్యక్తిగత గొడవను పార్టీకి పులిమే యత్నం చేసి మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు భంగపడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన గొడవను రాజకీయం చేసేందుకు మాధవనాయుడు యత్నించారు. వైఎస్సార్‌ సీపీ అక్రమ అరెస్టులంటూ గగ్గోలు పెట్టారు. అయితే రెండురోజుల తర్వాత గొడవకు కారణమైన తెలుగుదేశం పార్టీ నాయకులే మీడియా ముందుకు వచ్చి ఇది వ్యక్తిగతమైన గొడవ అని, దీనికి పార్టీలకు సంబంధం లేదంటూ ప్రకటించడంతో మాధవనాయుడి పరువు గంగలో కలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement