
నేరెళ్ల కోనేరు ప్రాంతంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలకు డబ్బులిచ్చి ఓటు అడుగుతున్న టీడీపీ అభ్యర్ధి వాసుపల్లి గణేష్ కుమార్
విశాఖసిటీ: పనితీరే ప్రజాప్రతినిధి నిబద్ధతకు గీటురాయి.. చేసిన సేవలే ప్రతిఫలాన్నిస్తాయి.. వాటినే గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థించాలి. కానీ ఆయనగారికి ఈ అర్హతలేవీ మచ్చుకైనా లేదుమరి.. అందుకే ఆ అభ్యర్థి బరితెగించారు. ఆయనే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. అదీ.. ప్రచారంలోనే అందరి సమక్షంలోనే నిబంధనలకు నీళ్లొదిలి.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ నోట్లు పంచిపెట్టారు.
ఆయన మరెవరో కాదు.. నిత్యం వివాదాలు, దందాల్లో మునిగితేలే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలుగుదేశం అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్. ఐదేళ్ల పదవీకాలమంతా దందాల్లో మునిగితేలుతూ, ప్రజాలను గాలికొదిలేసిన ఆయన.. ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్ల పంపిణీకి తెగబడ్డారు. తిరిగిన ప్రతి చోటా.. ప్రచారానికి వెళ్లే ప్రతి గడపలోనూ ప్రజల చేతిలో నోట్లు పెడుతూ.. ఓటు తనకే వెయ్యాలంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలోని నేరెళ్ల కోనేరు ప్రాంతంలో వాసుపల్లి బుధవారం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లడం.. ఓటు అడగడం.. జేబులోని నోట్లు తీసి వారి ఆ ఇంటివారి చేతిలో పెట్టడం.. ఇలా ఆ ప్రాంతంలో డబ్బులు వెదజల్లి ఓటర్లను ప్రత్యక్షంగా ప్రలోభాలకు గురిచేస్తున్న వాసుపల్లి తీరును చూసి స్థానికులు విస్మయానికి గురయ్యారు. ఒక్కొక్కరి చేతిలో నాలుగు నుంచి పది వరకు రూ.500 నోట్లు పెట్టారు. వాసుపల్లి బరితెగింపుపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment