మండవల్లి మండలం ఉనికిలి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయమంగళను అడ్డుకున్న యువకులు
గుర్ల(చీపురుపల్లి)/ఉనికిలి(కైకలూరు)/ఏలూరు రూరల్: ఎన్నికల వేళ ప్రజలు ప్రశ్నిస్తుంటే తెలుగుదేశం అభ్యర్థులు శివాలెత్తి పోతున్నారు. పైకి శాంతంగా కనిపిస్తున్నా.. లోలోపల దాగి ఉన్న ఓటమి భయంతో విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి, కృష్ణాజిల్లా ఉనికిలి, పశ్చిమగోదావరి జిల్లా పోణంగి గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.
శివాలెత్తిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ..
కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి జయమంగళ వెంకటరమణ ఎన్నికల ప్రచారం నిమిత్తం శుక్రవారం మండవల్లి మండలం ఉనికిలి గ్రామానికి వెళ్లారు. గ్రామంలోకి ప్రవేశిస్తుండగానే కొంతమంది యువకులు రూ.100 బాండ్ పేపరుపై తమ గ్రామంలోని స్మశాన వాటిక ప్రహరీ, గ్రామ సొసైటీ అభివృద్ధి వంటి విషయాలను పరిష్కరిస్తామని సంతకం చేసి ఇవ్వాలని పట్టుబట్టారు. లేదంటే గ్రామానికి రానివ్వమని తెగేసి చెప్పారు. యువకుల డిమాండ్‌ను చూసి జయమంగళ శివాలెత్తిపోయారు. గట్టిగా అరుస్తూ మైక్‌ను ప్రజలపైకి విసిరి కొట్టి దుర్భాషలాడారు.
తొక్క తీస్తానన్న ఎమ్మెల్యే బడేటి బుజ్జి..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పోణంగి గ్రామంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్సీ కాలనీ శివారులో మత్తి సుబ్రహ్మణ్యం అనే గ్రామస్థుడు ‘ఇంటి స్థలం ఇస్తామంటూ వెనుక తిప్పించుకున్నారు. ఇంత వరకు ఇవ్వలేదు’ అంటూ బడేటి బుజ్జిని నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన బడేటి బుజ్జి ‘ఏయ్ తమ్ముడూ.. ఆగవయ్యా.. ఆగు..నువ్వు మట్లాడటానికి వచ్చావా, పోట్లాడడానికి వచ్చావా’ అంటూ చిందులు తొక్కారు. ‘నీకు ఇంటి స్థలమే కదా కావాలి. రేపే ఇచ్చేస్తా తీసుకో’ అన్నారు. దీంతో గ్రామస్థుడు నీ స్థలం అక్కర్లేదు. నువ్వు అక్కర్లేదు అంటూ అక్కడ నుంచి వెనుదిరుగాడు. నువ్వు పార్టీ మనిషి అయితే ఇలా మాట్లాడవు. ఆ.. పార్టీ మాటలు ఇక్కడ మాట్లాడావంటే. తొక్కతీసేస్తా, డొక్క చించేస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
బాలకృష్ణ వీరంగం..
తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం చీపురుపల్లిలో వీరంగం సృష్టించాడు. గరివిడి నుంచి చీపురుపల్లి పట్టణంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో కొత్త పెట్రోల్ బంక్ వద్ద బాలకృష్ణ వాహనం ముందు అడ్డంగా నిలబడి కార్యకర్తలు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారు. అది చూసిన బాలకృష్ణ ప్రచార వాహనం దిగి సెల్‌లో వీడియోలు తీస్తున్న కార్యకర్తను వెంబడించి పట్టుకుని ఆయన వద్ద సెల్ లాక్కుని విసిరేశారు. అక్కడితో ఆగకుండా ఆ కార్యకర్తను కాళ్లతో తన్నుతూ చితకబాదాడు. అంతకుముందు గుర్ల మండలం సోలిపిసోమరాజు పేట వద్ద ఆరుగురు కార్యకర్తలపై చేయిచేసుకున్నాడు. నోటికొచ్చినట్టు తిట్టి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అక్కడున్న కార్యకర్తలు ఇంకెవరిని కొడతాడోనని భయంతో రోడ్లపై పరుగులు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment