టిక్కెట్ల మాటేమోగానీ... జిల్లాలోని టీడీపీ వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు అమరావతి వేదికగా బహిర్గతమయ్యాయి. సిటింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లో టిక్కెట్లు ఇవ్వడానికి వీల్లేదంటూ అక్కడి ఆశావహులు గట్టిగానే నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు పాల్పడిన అక్రమాలను బట్టబయలు చేశారు. ప్రధానంగా చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కాస్త అధినేతకు శిరోభారంగానే పరిణమించింది. ఈ వివాదాల పుణ్యమాని అక్కడి అభ్యర్థిత్వాల ఖరారు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనికి కొనసాగింపుగా అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకుల సమీక్షకు కూడా ఆశావహులు అన్నిఅస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలో సిటింగ్ ఎమ్మెల్యేలకు స్వపక్షంలోనే అసంతృప్తి సెగలు గట్టిగా తగులుతున్నాయి. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తారని భావిస్తున్న తరుణంలో సిటింగ్‌లపై అసంతృప్తి సెగలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సిటింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్టు ఇవ్వవద్దంటూ బహిరంగంగానే ప్లకార్డులతో డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికిభారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుండగా, గజపతినగరం ఎమ్మెల్యే కె.ఏ.నాయుడుకు టిక్కెట్టు ఇవ్వవద్దంటూ సాక్షాత్తూ ఆయన అన్న కొండబాబు గట్టిగా పట్టుపడుతున్నారు.
మృణాళినికి పరాభవం
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చీపురుపల్లి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం వెళ్లిన సిటింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి అమరావతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు అమరావతిలో సీఎం సమీక్ష జరుపుతున్న ప్రదేశంలో ‘చీపురుపల్లి ఎమ్మెల్యేగా మృణాళిని వద్దు’ అంటూ రాసిన ప్లకార్డులను చేతబట్టి నినా దాలు కూడా చేశారు. ఆమెపై నియోజకవర్గ నేతల్లో ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో మరోసారి అమరావతి సాక్షిగా బయటపడింది. అమరావతి వెళ్లిన నేతలతో చంద్రబాబు సమీక్ష జరపడానికి ముందు ఓ కమిటీతో నేతలు సమావేశమవుతున్నారు. అక్కడే సగం పంచాయితీ పూర్తవుతోంది. వెళ్లిన వారిలో ఆశావహులు తమ దరఖాస్తులను, సిఫార్సులను ఈ కమిటీకి విన్నవిస్తుంటే అసంతృప్తులు మాత్రం తాము వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేకు మళ్లీ టిక్కెట్టు ఇవ్వవద్దని, కాదని ఇస్తే నియోజకవర్గంలో పార్టీకోసం పనిచేసేది లేదని తెగేసి చెబుతున్నారు. తమ వెంట తీసుకువెళ్లిన నేతల అవినీతి చిట్టాలను ఆ కమిటీకి సమర్పిస్తున్నారు. ఆ కోవలోనే గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడుకు టిక్కెట్టు ఎలా ఇస్తారని, ఈ సారి తనకే ఇవ్వాలని అతని సోదరుడు కొండబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అరకు పార్లమెంటు సమీక్షకు సన్నాహాలు
ఇక అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షను చంద్రబాబు శనివారం నిర్వహించనున్నారు. జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, నియోజకవర్గాలు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లినా అదే పార్టీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత ఎంపీగా ఉన్నారు. కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సిటింగ్‌లు కాగా పార్వతీపురం నియోజకవర్గం ఒక్కటే టీడీపీ చేతిలో ఉంది. కురుపాం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కుటుంబం టిక్కెట్టు ఆశిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్ పోటీకి వస్తున్నారు. వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌కు అరకు ఎంపీ టిక్కెట్టు దాదాపుగా ఖరారైనట్లే కనిపిస్తోంది. సాలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య సీటు పోరు నడుస్తోంది. ఇదే నియోజకవర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆమె కూడా చినబాబు ద్వారా సీటు పొందాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. భంజ్‌దేవ్‌పై వచ్చిన ఆవినీతి ఆరోపణల చిట్టాలను అస్త్రాలుగా వాడుతున్నారు. పార్వతీపురంలో బొబ్బిలి చిరంజీవులుకు పోటీగా ఇటీవల పార్టీలో చేరిన మరో వర్గం నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో సవరపు జయమణి కూడా ఉన్నారు. వీరి పంచాయితీ ఎలా సాగుతుందో వేచి చూడాలి.
పైరవీల జోరు
ముందురోజు రాత్రికే అమరావతి చేరుకున్న నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వర కూ అసంతృప్తులు, ఆందోళనలు, డిమాండ్లు వ్యక్తీకరిస్తూ గడిపారు. రాత్రికి గానీ చంద్రబాబు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష మొదలుపెట్టలేదు. సమీ క్షకు ముందే జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అసంతృప్తులు చేస్తున్న ఆందోళనలు, ప్రత్యేక సమావేశాల గురించి తెలుసుకున్న చంద్రబాబు అలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిని తీవ్రం గా హెచ్చరించారు. ఎవరైనా పార్టీ వ్యతిరేక సమావేశాలు, కార్యక్రమాలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక రాత్రి జరిగిన సమీక్షలో చంద్రబాబు సిటింగ్‌లకే మరలా అవకాశం ఇవ్వడానికి మొగ్గుచూపారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మళ్లీ అశోక్‌గజపతిరాజునే దాదాపుగా ఖరారు చేశారు. విజయనగరం ఎమ్మెల్యే టిక్కెట్టు సిటింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు ఖాయమైనట్టే కనిపిస్తున్నా... అదంత ఈజీ కాదని తెలుస్తోంది. ఈమెను కాపు వర్గీయులు బలపరుస్తుండగా... మిగిలినవారు వ్యతిరేకిస్తున్నారు. అయితే అదితి గజపతి కొద్దిగా అడ్డుపడుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల విషయంలో ముఖ్యనేతలు మరోసారి సమావేశమై తేల్చాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment