సాక్షి, అమరావతి : వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తెలిపారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జలీల్‌ఖాన్ అభినందనలు తెలిపారు. తన రాజీనామా నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అనేది పాముల పుట్టవంటిదని పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని.. నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇతరుల వల్ల కొంత నష్టం జరిగిందని.. ఓడిపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎన్నికలు మొత్తం కులరాజకీయాల మీద నడిచాయని పేర్కొన్నారు.
కాగా గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన జలీల్‌ఖాన్ ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి జలీల్‌ఖాన్ కుమార్తెకు టికెట్ ఇచ్చారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఫ్యాను హవా వీచిన నేపథ్యంలో ఆమె ఓటమి పాలయ్యారు.
నామినేటెడ్ పదవుల రాజీనామా పర్వం
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో జలీల్‌ఖాన్‌తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రికి చైర్మన్‌గా ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి నుంచి అంబికా కృష్ణ వైదొలిగారు. ఇక ఇప్పటికే దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ సభ్యులు రాజీనామా సమర్పించగా.. ఎస్వీబీసీ ఛానెల్‌లో పోస్టు దక్కించుకున్న రాఘవేంద్రరావు కూడా రాజీనామా చేశారు. అదే విధంగా.. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment