సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు జరగబోతోందా...? బాబు చర్యలను వ్యతిరేకిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు సొంత పార్టీపైనే ధ్వజమెత్తనున్నారా...? పతాక స్థాయికి చేరిన హోదా పోరు చంద్రబాబు సర్కారు ఎన్‌డీఏతో తెగతెంపులు, బీజేపీతో గొడవల నేపథ్యంలో అధికార పార్టీలో అభద్రత భావం పెరిగిందా...? వైఎస్ జగన్ పాదయాత్రపై సర్వత్రా సానుకూలత ప్రభావం టీడీపీ నేతలపై పడిందా..? కరణం బలరాం స్వరం పెంచడం వెనుక కారణమేమిటి..? జిల్లాలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు బలరాంకు మద్దతు పలుకుతుండటం వెనుక అంతర్యమేమిటి...? వారు అధికార పార్టీ నుంచి బయటపడతారా..? లేక ప్రజల్లో అధికార పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారా..? అన్న విషయాలు జిల్లాలో ప్రసుత్తం హాట్‌టాపిక్‌గా మారాయి.
వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి విషయం చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దొనకొండకు ఒక్క పరిశ్రమను కూడా రాకుండా అడ్డుకుంటున్నారని సాక్షాత్తు చంద్రబాబు సమకాలికుడు, అధికార పార్టీ ఎమ్మెల్సీ కరణం బలరాం ఏకంగా మండలిలోనే ధ్వజమెత్తడం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 13 జిల్లాల రాష్ట్ర చిత్రపటంలో అసలు ప్రకాశం జిల్లా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా..? అంటూ బలరాం తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం సొంత పార్టీలో అలజడి రేకెత్తించింది. దొనకొండను రాజధానిగా ఊహించుకున్నా... అది జరగలేదని, కనీసం పరిశ్రమలైనా వస్తాయని భావిస్తే అదీ జరగలేదని బలరాం ఆవేదన చెందారు. పైపెచ్చు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో సాగు, తాగునీరుతో పాటు పరిశ్రమలకు తగినంత నీరు వచ్చే అవకాశం ఉందన్నారు.
అలా కాని పక్షంలో 10 కి.మీ. కాలువ తవ్వితే నాగార్జున సాగర్ కుడికాలువ నీరు పరిశ్రమలకు అందే అవకాశం ఉందని చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి విమానాశ్రయం, రైల్వేజంక్షన్ దొనకొండలో అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇక్కడకు పరిశ్రమలు తీసుకురాకుండా అడ్డుకుంటోందని బలరాం విమర్శించారు. చాలా కాలం తర్వాత కరణం బలరాం ముఖ్యమంత్రితో పాటు ఏకంగా ప్రభుత్వంపైనే విమర్శన బాణాలు సంధించటం జిల్లా అధికార పార్టీని కుదుపునకు గురి చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకోవటాన్ని ఆదిలోనే కరణం వ్యతిరేకించారు. ఇది సరికాదని హితబోధ చేశారు. అయినా బలరాం మాటలను బాబు పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత జిల్లా అభివృద్ధిపైన బలరాం తరచూ తనకున్న అవగాహన మేరకు తన వాణిని వినిపిస్తూనే వచ్చారు. కరణంతో పాటు మిగిలిన పాత నేతలు సైతం అంతర్గతంగా అధినేతతో పాటు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల రాకతో కరణంతో సహా పాత నేతలు దివి శివరాం, పోతుల సునీత, అన్నా రాంబాబు తదితరులను చంద్రబాబు పక్కన పెట్టారు. ఏ మాత్రం ప్రాధాన్యమివ్వక పూచికపుల్లలా చూశారు. ఇది భరించలేని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ కండువాను కిందపడవేసి పార్టీ నుంచి తప్పుకున్నారు. అక్కడ పాత టీడీపీ కార్యకర్తలు, నేతలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్, రేషన్‌కార్డు కూడా తెచ్చుకోలేక అవమానాలకు గురవుతున్నారు.
♦ కందుకూరులోనూ ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే పోతుల రామారావు అధికార పార్టీలో చేరడంతో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం నిరాదరణకు గురయ్యారు. ఉంటే.. ఉండూ.. పోతే పో అన్నట్లుగా అధినేత వ్యవహరించటంతో విధి లేని పరిస్థితుల్లో శివరాం సర్దుకుపోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే పోతుల రామారావు ఆయన సోదరుడు, ఆయన అనుచరగణం అంతా తామై వ్యవహరిస్తుండటంతో శివరాం నిస్సహాయుడిగా మారిపోయారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన ఆయన వర్గం నిరాదరణకు గురై రగిలిపోతున్నారు.
♦ యర్రగొండపాలెం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్‌రాజు అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ పాత నేతలు, కార్యకర్తలు పనికిరాకుండా పోయారు.
♦ చీరాల నియోజకవర్గంలోనూ స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ అధికార పార్టీలో చేరడంతో అతనిపై ఎదురొడ్డి పోరాడిన పోతుల సునీత తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినా పాత టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం నిరాదరణకు గురయ్యారు.
♦ కొండపిలో అధికార పార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామికి అసమ్మతి సెగ తప్పడం లేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడితో మొదలు అధికార పార్టీలో చేరిన జూపూడి ప్రభాకరరావు సైతం ఎమ్మెల్యే స్వామిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
♦ సంతనూతలపాడు నియోజకవర్గంలోని అధికా ర పార్టీలో అసమ్మతి సెగ పతాకస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ను అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విజయకుమార్‌ను మార్చాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు.
♦ అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను చంద్రబాబు టీడీపీలో చేర్చుకోవడంతో కరణం బలరాం వర్గం ఎదురొడ్డి పోరాడాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలకే అధికారాలు అంటూ చంద్రబాబు కరణంను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి ఆయనను అద్దంకికి దూరం చేసేందుకు ప్రయత్నించారు.చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిస్తూ పాత తరం టీడీపీ నేతలను దూరం పెట్టారు. దీంతో వారు అధినేతతో పాటు పార్టీ తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
పెరిగిన అసమ్మతి స్వరం
ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్ర రూపం దాల్చటం, తొలుత హోదా అక్కర్లేదు.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని చంద్రబాబు యూటర్న్ తీసుకోవటం, ఎన్‌డీఎతో తెగతెంపులు చేసుకోవాల్సి రావడం, బీజేపీతో గొడవల నేపథ్యంతో జిల్లా అధికార పార్టీలోనూ ఆందోళన మొదలైంది. వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రకాశం జిల్లాలో అపూర్వ ఆదరణ లభించడం ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో పాటు వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధిని చంద్రబాబు సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలిస్తామన్న మాట నీటి మూటగానే మారింది. విమానాశ్రయం లేదు, పోర్టు లేదు, తీరప్రాంత అభివృద్ధి లేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. దీంతో ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇక పాత నేతలను చంద్రబాబు దూరం పెట్టడంతో వారు మరింత రగిలిపోతున్నారు. ఇదే అదునుగా మరోమారు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. కరణం బలరాం ముందుండి చంద్రబాబు సర్కారుపై విమర్శలు గుప్పించటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనకు జిల్లాకు చెందిన పాత తరం నేతలు దివి శివరాంతో పాటు కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు విజయకుమార్, అన్నా రాంబాబుతో పాటు కొందరు ముఖ్యనేతలు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఇక అధికార పార్టీలో చేరినా..త్రుటిలో మంత్రి పదవిని కోల్పోయి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సైతం కరణం బలరాంకు మద్దతు పలికే అవకాశం ఉందన్న ప్రచారమూ సాగుతోంది. మున్ముందు జిల్లా అధికార పార్టీలో అసమ్మతి దాడి మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాల్సిందే...!
Comments
Please login to add a commentAdd a comment