
పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యేబండారు సత్యనారాయణమూర్తి,విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుల మధ్య వివాదం రాజుకుంటోంది.ముదపాక భూముల వ్యవహారం వీరిద్దరి మధ్య రగడకు కారణమయింది.ఎప్పుడూ వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలతో ప్రతిపక్షనేతలపై నోరు జారేబండారు ఈ సారి తమ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపైవిరుచుకుపడ్డారు. వాడు, వీడు అన్న పదజాలాన్ని ఉపయోగించారు. తననియోజకవర్గంలో అతడికేంపని? ముదపాక భూముల గురించి అతడికేంతెలుసు? అని ప్రశ్నించారు. ‘రాజులు పెట్టే బిర్యానీలు తిని ఇక్కడకు వచ్చి వీరంగం చేస్తుంటారు’ అంటూ దళిత రైతులను అవహేళన చేశారు.
ఆయనకేంటి ఇక్కడ పని : బండారు
‘అతనెవరో విష్ణుకుమార్‌రాజు అంట.. బీజీపీ ఎమ్మెల్యే.. పేరుకు మా పార్టీకి దగ్గరి ఎమ్మెల్యే(బీజేపీ–టీడీపీ పొత్తు)అయినంత మాత్రాన మా నియోజకవర్గంలో అతడికేం పని. ముదపాక భూముల గురించి, మా నియోజకవర్గం గురించి అవగాహన లేకుండా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఎన్నటికీ అమ్ముడు కాని అసైన్డ్ భూములను వుడా ద్వారా మా ప్రభుత్వం తెగనమ్మి రైతులకు న్యాయం చేస్తుంటే అతడేమో మాపై, మా నాయకులపై ఫిర్యాదులు చేస్తాడు.. పేరుకు బీజేపీ ఎమ్మెల్యే కానీ వైఎస్సార్ సీపీకి సపోర్ట్ చేస్తారు’ ఇవీ పెందుర్తి మండలం ముదపాకలో శనివారం నిర్వహించిన ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై చేసిన పరుష వాఖ్యలు.
పెందుర్తి నీ జాగీరు కాదు : విష్ణుకుమార్‌రాజు
ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన వ్యాఖ్యలకు విష్ణుకుమార్‌రాజు కూడా ఘాటుగా స్పందించారు. ఇన్నాళ్లూ బండారును సీనియర్ నాయకుడనుకున్నానని, కానీ ఆయన వ్యాఖ్యలతో తనకు ఆ అభిప్రాయం పోయిందని పేర్కొన్నారు. ‘పెందుర్తి మీ జాగీరు కాదు.. సీఎం చంద్రబాబు నీకేమీ రాసివ్వలేదు.. మీపై ఉన్న గౌరవంతోనే నేను ఇన్నాళ్లూ ముదపాక వెళ్లలేదు. నేను సకాలంలో స్పందించకపోయి ఉంటే ముదపాక భూముల్లో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగి ఉండేది. ఎకరానికి రైతుకు రూ.10 లక్షలు ఇచ్చేసి రూ.కోటిన్నర నుంచి 2 కోట్లు కొట్టేయాలని చూశారు. ముదపాక భూసేకరణ జీవోలో మార్పులు చేయించి ఆ రైతులకు మేలు జరిగేలా చేశాను. అన్యాయం జరుగుతోందంటూ దళిత రైతులు రోడ్డెక్కినప్పుడు మీరు కనబడలేదు. అప్పట్లోనే మీరు స్పందించి ఉంటే మాలాంటి వాళ్లం స్పందించే వారం కాదు.. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ముదపాక వెళ్లి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దమ్ముంటే సీఎంతో విచారణ వేయించండి. ఈ కుంభకోణంలో ఎవరెవరున్నారో తేలిపోతుంది. నేను శాసనసభలో ఫ్లోర్‌లీడర్‌ను. ప్రజా సమస్యలపై ఎక్కడికైనా వెళ్లొచ్చు. చర్చించవచ్చు. ఆ విషయం తెలుసుకోండి.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది’ అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు బండారుకు సూచించారు.
సాక్షి, విశాఖపట్నం: పెందుర్తి మండలం ముదపాకలో దళితులకు చెందిన సుమారు 400 ఎకరాల అసైన్డ్ భూములను వుడా ల్యాండ్ పూలింగ్‌లో కారుచౌకగా తీసుకోవడానికి భారీగా లబ్ధిపొందడానికి బండారు, ఆయన అనుచరగణం స్కెచ్ వేసిందన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అసైనీలు తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును ఆశ్రయించడంతో ఆయన స్పందించి వారికి బాసటగా నిలిచారు. అసైనీలకు నష్టం వాటిల్లే ఆ జీవోను నిలుపుదల చేయించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి అనుకూలంగా సవరణలు చేయించారు. ఇది మింగుడు పడని బండారు అప్పట్నుంచి విష్ణుకుమార్‌రాజుపై గుర్రుగా ఉన్నారు. పరిస్థితి తనకు ప్రతికూలంగా మారడంతో బండారు తన నియోజకవర్గంలోని ముదపాక పరిసరాల్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఎట్టకేలకు శనివారం సాయంత్రం ఇంటింటికి టీడీపీలో భాగంగా ఆయన ముదపాకలో మందీ మార్బలంతో అడుగుపెట్టారు. అక్కడ జరిగిన సమావేశంలో విష్ణుకుమార్‌రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment