కోడెల గృహంలో ఆయన తనయుడు శివరామ్‌తో డాక్టర్ అరవిందబాబు, నాయకులు, కౌన్సిలర్లు
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో అవమానం ఎదురైంది. కోడెలను కలిసేందుకు అరవిందబాబు ఆయన ఇంటికి వెళ్లగా.. కోడెల పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయారు. వివరాలు.. కోడెల వ్యతిరేక వర్గీయుల సహకారంతో అరవిందబాబు చివరి నిమిషంలో అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కోడెల వర్గీయులు పట్టణంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో అరవిందబాబు మంగళవారం బీఫామ్ తీసుకొని ఊరేగింపుగా పట్టణంలోకి ప్రవేశించి తన వైద్యశాల పరిసరాల్లో ప్రచారంలో పాల్గొన్నారు.
(కోడెల వ్యతిరేక వర్గీయులదే పైచేయి)
ఈ ప్రచారానికి కోడెల వర్గీయులు దూరంగా ఉన్నారు. దీంతో బుధవారం ఉదయం కోడెలను కలిసి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో అరవిందబాబు కోడెల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న కోడెల.. అరవిందబాబును చూసి కూడా పలకరించకుండానే కిందకు దిగి వెళ్లిపోయారు. దీంతో అరవిందబాబు కోడెల తనయుడు శివరామ్‌ను కలిసి తనకు సహకరించాల్సిందిగా కోరారు. శివరామ్ తన వర్గానికి చెందిన పార్టీ నాయకులు నాగసరపు సుబ్బరాయగుప్తా తదితరులను పరిచయం చేశారు. అందరూ తనకు సహకరించాలని అరవిందబాబు వారిని కోరారు. కోడెల ఉండవల్లి వెళ్లారని.. ఆయన వచ్చేదాకా వేచి ఉండాలని శివరాం సూచించడంతో అరవిందబాబు వారి ఇంటిలోని పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు. ఎంతసేపు చూసినా కోడెల రాకపోవటంతో చివరకు ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment