సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆధిపత్యానికి, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్న అక్కసుతో కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) స్వరం పెంచుతున్నారు. ఎమ్మెల్యే అని చూడడం లేదు...మంత్రి అని తగ్గడమూ లేదు... సహ నేతలపై మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. నువ్వానేనా అన్నట్టుగా ఏదో ఒకటి తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా స్వప్రక్ష ప్రత్యర్థులు కూడా కొండబాబుని లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతున్నారు. కాకినాడ నగరమంతా తనదిగా ఎమ్మెల్యే కొండబాబు భావించడమే కాకుండా ఎంతటి పెద్ద నేతలైనా తన తర్వాతే అన్నట్టుగా వ్యవహరిస్తుండగా జిల్లా కేంద్రమైన కాకినాడ అందరిదీ అనే రీతిలో మంత్రి నిమ్మకాయల చినరాజప్పతోపాటు మిగతా నేతలూ భావిస్తున్నారు. ఆ తరహాలోనే కాకినాడకు వచ్చి పలువురు నేతలు చక్రం తిప్పుతుండడంతో కొండబాబు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు.
కొండబాబే లక్ష్యంగా...
వాస్తవానికి ఎమ్మెల్యే కొండబాబుపై అనేక ఆరోపణలున్నాయి. ఆయన సోదరుడు సత్యనారాయణైతే సూపర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారన్న విమర్శలున్నాయి. పార్టీలోని ప్రత్యర్థులకు ఇవి అస్త్రాలుగా మారాయి. కాకినాడలో పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న ప్రచారానికి ప్రత్యర్థులు తెరలేపారు. ఇదే క్రమంలో కాకినాడ కార్పొరేషన్ మేయర్ గిరీని తన వర్గీయులకు దక్కకుండా మంత్రి రాజప్ప, ఎంపీ తోట నర్సింహం వ్యవహరించారు. కనీసం డిప్యూటీ మేయర్ పదవైనా దక్కించుకోవాలని, ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి ఇప్పించుకోవాలని కొండబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి వ్యూహాత్మకంగా ఎగరేసుకుపోయారు. కార్పొరేషన్‌లోని కో ఆప్షన్ పదవులైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్నా అది కూడా ఫలించేలా లేదు. దీంట్లో మంత్రి రాజప్ప జోక్యం చేసుకుని కొండబాబు వశం కాకుండా పావులు కదుపుతున్నారు. ఇలా అడుగుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతుండడంతో ఆ వర్గం అయోమయంలో పడింది.
రగిలిపోతున్నా అదే బాట...
వరుసగా ఎదురవుతున్నా అవమానాలు, వస్తున్న ఆరోపణలతో కొండబాబు రగిలిపోతున్నారు. తానడిగిన మేరకు ఇవ్వకపోగా కాదన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపోతున్నారు. దీంతో మొన్నటికి మొన్న రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు లక్ష్యంగా పరోక్ష ఆరోపణలకు దిగగా, తాజాగా మంత్రి రాజప్పపైనే ధ్వజమెత్తుతున్నట్టు తెలిసింది. మంత్రి సోదరుడే ఎక్కువ సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తున్నారంటూ ఆరోపణలు సంధిస్తున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో రాజప్ప పెత్తనమేమిటని ప్రశ్నించడమే కాకుండా తన నియోజకవర్గంలో ఎవరి జోక్యం అవసరం లేదని పట్టుబడుతున్నారు. అధిష్టానం వద్దే తేల్చుకుంటానని తన అనుయాయుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. ఒకరిపై ఒకరు ధ్వజమెత్తుతూ సాగుతున్న పోరు టీడీపీలో అసక్తి రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment