మణి గాంధీకి పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మణిగాంధీకి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వాల్మీకి పోరాట సమితి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. కాగా ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్యనాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసెందే.
టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ
కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి వ్యవహార తీరు పట్ల పలువురు నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫారుఖ్ వర్గాన్ని భూమా బ్రహ్మానంద రెడ్డి పట్టించుకోవడంలేదని ఆ వర్గ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం దశాబ్దాలుగా సేవచేస్తున్న మమ్మల్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల కార్యక్రమానికి, నామినేషన్ కార్యక్రమానికి కనీస పిలుపు లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల మండల పరిధిలోని 15 గ్రామాల టీడీపీ నాయకులు ఎమ్మెల్యే తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 15గ్రామాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సమావేశమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి వ్యవహార తీరు నచ్చకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం లోపు వాళ్ల నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment