టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణను నిలదీస్తున్న మహిళలు
సాక్షి, ధర్మవరం: టీడీపీ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని పాండురంగ వీధిలో పర్యటించారు. స్థానిక సమస్యలపైన మహిళలు ఆయన్ను గట్టిగా నిలదీశారు. ‘ఇంటి పట్టాలకోసం ఐదేళ్లలో పది సార్లు అర్జీలు ఇచ్చినాం.. ఇళ్లు లేని వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా.. నీ వెనుక తిరిగే వాళ్లకు పట్టాలు ఇచ్చినావ్’ అంటూ ఆయన్ను నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండా సూరి దాటేసుకుని వెళ్లిపోయారు. స్థానిక నాయకులు ‘మేమున్నాంలేమ్మా.. మళ్లీ అధికారంలోకొస్తే ఇప్పిస్తాం ’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే.. చూసినాం పోప్పా..’ అంటూ వారిని అక్కడి నుంచి తరిమేసినంత పనిచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అక్కడా నిలదీతే..
ప్రభుత్వం నుంచి రావాల్సిన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తమకు అందేలా చేయలేదని చేనేతలు సైతం గోనుగుంట్ల సూర్యనారాయణ (సూరి)ను నిలదీశారు. ‘చేనేత ముడిపట్టు రాయితీలూ బకాయి ఉంది.. ఇంకేం చేశారని మీకు ఓటు వేయాలి.. ఈ ఐదేళ్లలో మీ ఇంటి వద్దకు ఎన్నిసార్లు తిరిగినాం.. ఒక్క మగ్గం లోన్ అయినా ఇప్పించారా? ఒక్క బీసీ రుణ మైనా మంజూరు చేశారా? ఏమన్నా అంటే మీ వార్డు కౌన్సిలర్‌ను అడుగు, మీవార్డు ఇన్‌చార్జ్‌ను అడుగండి అంటారు’ అని చేనేత అన్నలు ఎమ్మెల్యేను దుయ్యబట్టారు. ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వినకుండా గుక్కతిప్పుకోండా.. టీడీపీ నాయకుల వైఖరిని ఎండగట్టారు.
Comments
Please login to add a commentAdd a comment