ఈనెల 5వ తేదీన తహసీల్దార్ల బదిలీలు చేపట్టారు. శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు తహసీల్దార్ పుల్లన్నను కలెక్టరేట్‌లో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. అదే నియోజకవర్గంలోని నార్పల తహసీల్దార్ శ్రీధర్‌బాబును పుట్లూరుకు బదిలీ చేశారు.
సుమారు 25 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ వీరిద్దరూ బదిలీ స్థానాల్లో కాకుండా ఇదివరకున్న మండలాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. రాజకీయ అండదండలతోనే వీళ్లు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం.
శింగనమల నియోజకవర్గంలో రాజకీయ జోక్యానికి ఇదో ఉదాహరణ మాత్రమే..
శింగనమల: ఎమ్మెల్సీ శమంతకమణి.. ఈమె కుమార్తె ఎమ్మెల్యే యామినీబాల.. ఈమెకు తమ్ముడైన అశోక్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త.. ఎమ్మెల్యే పీఏ కిరణ్.. నియోజకవర్గంలో ఈ నలుగురి మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. కుటుం బంలో సఖ్యత లేని కారణంగా పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయారు. ఈ పరిస్థితి సామాన్య కార్యకర్తలతో పాటు నాయకులను గందరగోళంలో పడేస్తోంది. ఇదే సమయంలో పనుల విషయంలో ఎవరి వద్దకు వెళితే ఏమవుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో చివరి దశలో యామినీబాల నామినేషన్ వేసి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలంలో ఇన్‌చార్జి ఎంఈఓగా పని చేశారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే అయినా.. ఎన్నికయ్యాక మూడు సంవత్సరాల వరకు రాజకీయాల్లో పట్టు సాధించలేకపోయారు. ఆ తర్వాత తమ్మునితో విభేదాలు రావడంతో క్యాంప్ ఆఫీస్ నుంచే వ్యవహారాలు నడుపుతున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్‌కు తమ్ముడు పోటీలో ఉండడంతో, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ్ముడితో విభేదించే నియోజకవర్గ నాయకులను కలుపుకొని పార్టీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.
అశోక్ విషయానికొస్తే..
ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు, ఎమ్మెల్యే యామినిబాలకు తమ్ముడు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడు సంవత్సరాల పాటు అన్నీ తానై వ్యవహరించారు. అధికారుల బదిలీలు మొదలుకొని, పథకాలు.. ఇతరత్రా వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టాడు. అధికారులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అక్కా తమ్ముళ్ల మధ్యభేదాభిప్రాయాలు రావడంతో క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మేల్యే, సొంత ఇంటి నుంచి అశోక్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక గందరగోళంలో ఉన్నారు.
పీఏ కిరణ్ చిచ్చు
ఎమ్మెల్యే యామినిబాల పీఏ కిరణ్ జోక్యం కూడా నియోజకవర్గంలో అధికంగానే ఉంటోంది. అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఉల్లికల్లు ఇసుక రీచ్‌లో ప్రజాప్రతినిధులకు తెలియకుండా సొంతంగా టిప్పర్లు పెట్టి అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పీఏ తన సామాజిక వర్గానికే ప్రాధన్యత ఇస్తుండడంతో పార్టీలోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
నీరు–చెట్టు పనుల్లోనూ కమీషన్లు
నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో 2014–18 మధ్య కాలంలో నీరు–చెట్టు పథకం కింద 589 పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 కోట్లు వెచ్చించారు. ప్రతి పనిలో రూ.లక్షకు 10 శాతం కమీషన్‌ను తీసుకుంటున్నారు. ఇందులో 5 శాతం వరకు ప్రజాప్రతినిధులకు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇలా రూ.3 కోట్ల వరకు కమీషన్ల రూపంలో చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది.
రైతు రథం పథకంలోనూ వసూళ్లు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రైతు రథం పథకంలో భాగంగా 2017–18 సంవత్సరానికి సంబంధించి పెద్ద ట్రాక్టర్ల మంజూరులో భారీగా అవినీతి చోటు చేసుకుంది. ప్రతి ట్రాక్టర్‌కు సిఫారసు లేఖ ఇచ్చేందుకు ఓ ముఖ్యనేత రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 93 ట్రాక్టర్లు మంజూరు కాగా.. రూ.25లక్షలు ఆ ముఖ్యనేత వెనకేసుకున్నట్లు తెలిసింది.
అభివృద్ధి పనుల్లోనూ పర్సెంటేజీలు
నియోజకవర్గంలో ఏ పని మొదలు పెట్టినా పర్సెంటేజీలు తప్పనిసరి అయ్యాయి. శింగనమల టీడీపీ మాజీ మండల కన్వీనర్ ఒకరు 2016లో ఐసీడీఎస్ కార్యాలయం పనులను టెండర్ ద్వారా దక్కించుకున్నారు. అయితే పనులు మొదలుపెట్టిన తర్వాత.. ఓ ముఖ్య నేత అప్పట్లో పని చేసిన ఎంపీడీఓను పంపించి నిలిపివేయించారు. ముఖ్య నేతతో మాట్లాడిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని చెప్పడంతో రూ.లక్ష ముట్టజెప్పి పనులు ప్రారంభించారు. రోడ్లు, భవనాల నిర్మాణాలతో పాటు ప్రతి పనిలోనూ పర్సెంటేజీ ఇవ్వనిదే పనులు కావట్లేదనే అభిప్రాయం పార్టీ వర్గీయుల్లోనే వ్యక్తమవుతోంది.
అధికారుల బదిలీల్లోనూ..
నియోజకవర్గంలో ఒక అధికారి పోస్ట్‌కు రేట్ పెట్టి వసూలు చేశారు. ఓ అధికారి ఇక్కడకు రావాలంటే నిర్ణయించిన మొత్తం చెల్లించుకోవాల్సిందే. లేదంటే వెనక్కు పంపడం ఇక్కడ పరిపాటి. అప్పటికీ కొనసాగితే.. మానసిక వేధింపులతో వెళ్లిపోయేలా చేస్తున్నట్లు అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని రెండు మండలాల తహసీల్దార్లు ఇటీవల బదిలీ అయ్యారు. అయితే వీరి బదిలీ చేసిన ప్రాంతాలకు వెళ్లలేదు. ముఖ్య నేతలతో మాట్లాడుకోవడం వల్లే ఆ ఇద్దరూ ధైర్యంగా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇసుక దందా
ఉల్లికల్లు ఇసుక రీచ్‌లో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. డిసెంబర్ 18, 2014 న వెలుగు ఆధ్వర్యంలో రీచ్ ప్రారంభించారు. ప్రభుత్వం 32వేల క్యూబిక్ మీటర్లుకు అనుమతివ్వగా.. 47వేల క్యూబిక్ మీటర్లు తరలించారు. రికార్డులలో 27వేలు మాత్రమే చూపించారు. భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి రావడంతో 20 మందికి నోటీసులు ఇచ్చి, 16 మంది వెలుగు సిబ్బందిని తొలగించారు. ఇక రెండవసారి 2015 డిసెంబర్ నెల అఖరులో 12వేల క్యూబిక్ మీటర్ల ఇసుకకు అనుమతి లభిస్తే , ఉచితం పేరుతో అక్రమంగా ఇసుక తరలించారు. నిర్వహణ బాధ్యతలు వెలుగు సిబ్బందికి అప్పగించినా.. ఎమ్మెల్సీ తనయుడు ఆశోక్ , ఎమ్మెల్యే పీఏ కిరణ్ కనుసన్నల్లోనే వ్యవహారం సాగింది. ఒక మండల తెలుగు యువత అధ్యక్షుడు, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు ఒక్కో టిప్పుర్‌కు అదనంగా రూ.2 వేలు వసూలు చేశారు. ప్రతి రోజు 30 టిప్పుర్ల చొప్పున రోజుకు రూ.60వేలు దండుకోవడం గమనార్హం. ఈ లెక్కన నెల రోజుల పాటు ఇసుక అక్రమ రవాణాతో సుమారు రూ.15లక్షలు దోచుకున్నారు. అదేవిధంగా ఇసుక తరలింపులోనూ వీరిద్దరూ రూ.20లక్షల వరకు వేనకేసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment