కాలువ చివరిలో ఇదీ పరిస్థితి
సాక్షి, మనుబోలు : కాదేదీ అవినీతికనర్హం అన్నట్లుగా మండలంలో గత ఐదేళ్ల కాలంలో ప్రతి పనిలోనూ తెలుగు తమ్ముళ్లు వేటినీ వదలకుండా అందిన కాడికి వెనకేసుకున్నారు. మండలంలో సుమారు రూ.20 కోట్లకు పైగా నీరు చెట్టు పనులు చేశారు. అయితే వీటిలో రైతులకు ఉపయోగపడే పనులు చేయకుండా ఏవైతే రైతులకు అవసరం లేదో వాటినైతే ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో అలాంటి పనులనే ఎక్కువగా చేశారు. చేతికందినంత దోచుకున్నారు.
పాలకుల కక్కుర్తితో విఫలం
గతేడాది బండేపల్లి బ్రాంచ్ కాలువ ద్వారా వచ్చే సాగునీరు సరిపడక పంటలు ఎండిపోతుండడంతో రాజోలుపాడు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి దాన్ని బ్రాంచ్ కాలువలో కలిపి పంటలు కాపాడాలని భావించారు. ఇందు కోసం సుమారు రూ.50 లక్షల నిధులు కేటాయించారు. అయితే రాజోలుపాడు వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వకపోగా కాంట్రాక్టర్ బాగా వెనకేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. రూ.50 లక్షలతో గతేడాది ఫిబ్రవరిలో రోజులుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా రోజులుపాడు సమీపంలోని కండలేరు నుంచి మోటార్‌లతో నీటిని పంపింగ్ చేసి బండేపల్లి బ్రాంచ్ కెనాల్‌లో కలిపారు. దిగువనున్న కండలేరు నుంచి ఎగువనున్న బ్రాంచ్ కెనాల్‌కు నీరు వెళ్లాల్సి రావడంతో ఇది విఫలమైంది.
రివర్స్ గ్రేడియంట్(దిగువ నుంచి ఎగువకు) నీటిని పారించే క్రమంలో ఎంత వాలిందో కొలతలు తీసుకుని దానిని అధికమించేందుకు ఎంత నీటిని లిఫ్ట్ చేస్తే ఎగువ ప్రాంతానికి ఎంత నీళ్లు పారుతాయో లెక్కకట్టి చేయాల్సి ఉంది. అయితే అధికారులే చెపుతున్న లెక్కల ప్రకారం కనీసం 200 పైగా హార్స్‌పవర్ మోటార్లు పెడితే తప్పా ఎగువకు నీళ్లు వెళ్లే అవకాశం లేని చోట కేవలం 60 హార్స్‌పవర్ మోటార్లు, నాలుగు పైపులు ఏర్పాటు చేయడంతో ఈ పథకం పూర్తిగా ఫెయిలయింది. మోటార్‌ల నుంచి నీళ్ల వచ్చే చోట నాలుగడుగుల లోతు నీరుండగా చివరికొచ్చేసరికి బ్రాంచ్ కాలువలో కలిసే చోట కనీసం అడుగు లోతు నీరు కూడా రాకపోవడంతో ఈ పథకం వృధా ప్రయాసగా మారింది. దీంలో రూ.50 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయింది.
లిఫ్ట్‌తో రైతులకేమి ప్రయోజనం
కనుపూరు కాలువకు చివరి ఆయకట్టు అయిన మనుబోలు మెట్ట గ్రామాలకు బండేపల్లి బ్రాంచ్ కాలువ నీళ్లు సరిపోకపోవడంతో గతేడాది రూ.50 లక్షలతో రాజోలుపాడు లిఫ్ట్ చేశారు. అయితే తక్కువ కెపాసిటీ ఉన్న నాసిరకం మోటార్లు ఏర్పాటు చేయడం, దిగువ నుంచి ఎగువకు నీటిని మళ్లించడం వల్ల రాజోలుపాడు లిఫ్ట్ విఫల ప్రయత్నంగా మారింది. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్పా రైతులకు ఒరిగిందేమీ లేదు.
– ఎం.వెంకటేశ్వర్లు, రైతు, రాజోలుపాడు
తూతూ మంత్రంగా పూడికతీత
కండలేరు ఉప కాలువ, చెరువుల పూడికతీత పనులు, తూములు, కల్వర్టులు, రెండు చెక్‌డ్యాంలు కూడా అవినీతికి అడ్డాగా మారాయి. కండలేరు ఉపకాలువకు ఇరుపైపులా ఉన్న చిన్నచిన్న కంప చెట్లను తొలగించి జేసీబీతో పల్చగా మట్టిని తీసి తూతూ మంత్రంగా పని కానిచ్చేశారు. వాగు అడుగున బోర్లు ఉన్నాయన్న సాకుతో రైతులు తవ్వేందుకు ఒప్పుకోవడం లేదని చెప్పి చాలా చోట్ల అరడుగుల మందంతో గీకి వదిలేశారు.
ఆత్మగౌరవం లోనూ..
మరుగుదొడ్లలో కూడా వీరంపల్లి, మడమనూరు, మనుబోలు తదితర చోట్ల భారీగా అవినీతి చోటుచేసుకుంది. వందల సంఖ్యలో మరుగదొడ్లు కట్టకుండానే కట్టినట్లు చూపించారు. పాత మరుగుదొడ్లనే సున్నం, రంగులు వేసి మళ్లీ నిర్మించినట్లు చూపడం, ఒకే ఇంటికి రెండు, మూడు మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా భారీగా వెనకేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో అప్పటి వీరంపల్లి పంచాయతీ కార్యదర్శిని కూడా సస్పెండ్ చేశారు.
ఒకే ఇంట్లో రెండు మరుగుదొడ్లు
అక్రమ తవ్వకాలు
వడ్లపూడి, అక్కంపేట, వీరంపల్లి, మడమనూరు, బండేపల్లి, మనుబోలు తదితర గ్రామాల సమీపంలో గ్రావెల్, ఇసుక అక్రమంగా తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారు. అదేమని అడిగితే తమకు రెవెన్యూ అధికారుల అనుమతి ఉందని చెప్పి తమ పనులు చెక్కబెట్టుకునేవారు. కొందరు అధికార పార్టీ నాయకులు ఏకంగా ఇసుకను భారీగా డంపింగ్ చేసుకుని తరువాత విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment