సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తే చంద్రబాబు గుండెల్లో వణుకుపుడుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ విజయం తథ్యమని తెలిసే టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. అనంతపురంలో టీడీపీ అరాచకాలు బయటకు వస్తాయనే.. ప్రభుత్వ ఉద్యోగానికి మాధవ్ సమర్పించిన రాజీనామా ఆమోదం పొందకుండా చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘బీసీలకు సీట్లివ్వరు.. తమ పార్టీ సీట్లిచ్చినా అధికార మదంతో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తారు’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
నేరుగా ఢీకొట్టే సత్తాలేని బాబు.!
‘జనసేన పార్టీలో నాగబాబు చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అది మీ యిష్టం. టీడీపీ అభ్యర్థులు గెలవడానికే జనసేన డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. చంద్రబాబు కూటమిలో కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ, వామపక్షాలతో పాటు ఊరూ.. పేరూ లేని కేఏ.పాల్ పార్టీ కూడా చేరినట్టుంది. బాబుకు నేరుగా పోటీచేయడం.. కనీసం నేరుగా పొత్తులు పెట్టుకోవడం కూడా చేతకాదు. ఎప్పుడూ ముసుగు రాజకీయాలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తుంటారు’ అని చంద్రబాబుపై వాగ్బాణాలు సంధించారు.
(చదవండి : జగనన్నను సీఎంగా చూడాలన్నదే నాన్న కోరిక: వైఎస్ సునీతా రెడ్డి)
వివేకా హత్యపై బాబు కట్టుకథలు
‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారు. వివేకాది అనుమానాస్పద మృతి అని తెలిసేవరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేనదని బుకాయిస్తున్నారు. చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తుంటే పోలీసులు ఎందుకు వాస్తవాలు వెల్లడించడం లేదు. తండ్రి హత్యకేసులో దోషులను శిక్షించడానికి నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని ఆయన కూతురు వైఎస్ సునీత ఫిర్యాదు చేస్తే.. వక్రీకరణలు చేస్తారా. చనిపోయింది మామూలు వ్యక్తి కాదు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా సేవలందించిన వ్యక్తి. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. లోకేశ్ పొరపాటుగానో, గ్రహపాటుగానో వివేకా మృతి విషయం తెలిసి ‘పరవశించా!’ అన్నారు. కానీ, లోకేశ్ మాటలను బాబు నిజం చేస్తున్నారు. సిట్ వేసి అది ఏం చేయాలో ఆయనే చెప్తున్నారు. వాస్తవాలు తొక్కిపట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది నీచ రాజకీయం. వివేకానందరెడ్డిది ఓ పొలిటికల్ మర్డర్. ఎన్నికల దాకా హంతకులెవరో బయటపడకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. దిగజారి మాట్లాడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు’ అని పద్మ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment