అప్‌డేట్స్‌: ఎమ్మెల్యే కాంపు కార్యాలయాలు ఖాళీ చేయండి! | Telangana Assembly Likely To Dissolve Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ రద్దు అప్‌డేట్స్‌

Published Thu, Sep 6 2018 11:16 AM | Last Updated on Thu, Sep 6 2018 8:30 PM

Telangana Assembly Likely To Dissolve Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందుస్తు ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునున్నారు. అసెంబ్లీ రద్దుపై వ్యూహాలు అవలంభించాలన్న దానిపై ప్రతిపక్షాలు చర్చోపచర్చలు జరుపుతున్నాయి. బీజేపీ నేతలు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. . ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని కోదండరాం అన్నారు. తెలంగాణ శాసనసభ రద్దుకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు మీ కోసం..

ఎమ్మెల్యేల కాంపు కార్యాలయాలు ఖాళీ చేయండి!
రానున్న ఎన్నికల కోసం ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని, వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేయాలని కేసీఆర్‌ అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చదవండి పూర్తి కథనం : ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం

నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్షం!
సాయంత్రం 5. 30 గంటలు: అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్‌ తెలంగాణ బఫూన్‌ అని, ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. చేసిన తప్పులన్నీ కేసీఆర్‌ కాంగ్రెస్‌ మీద నెట్టుతున్నారని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని కేసీఆర్‌ భయపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని మరో కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ హితవు పలికారు. కారణాలు చెప్పకుండానే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని తప్పుబట్టారు. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముందో కేసీఆర్‌ చెప్పాలని బీజేపీ నేత లక్ష్మణ్‌ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అసెంబ్లీని రద్దు చేయడం సరికాదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును కేసీఆర్‌ వమ్ము చేశారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కుటుంబపాలనకు తెరలేపిన కేసీఆర్‌.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.

చదవండి: దిగిపోయేటప్పుడూ కేసీఆర్‌వి అబద్ధాలే...
కేసీఆర్‌ పెద్ద బఫూన్‌...
‘ ఇక మా గెలుపు ఎవరూ ఆపలేరు’

సాయంత్రం 4.30 గంటలు : ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ అన్నివిధాలుగా మోసం​చేశారని మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉందని, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేశానని కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. పోయేకాలం వచ్చి శాసనసభను కేసీఆర్‌ రద్దు చేశారని దుయ్యబట్టారు. స్థాయి మరచి, విజ్ఞత మరిచి ఇందిరాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాహుల్‌గాంధీపై వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. తెలంగాణ ప్రజలు వర్సెస్‌, కేసీఆర్‌ కుటుంబంగా ఈ ఎన్నికలు జరగనున్నాయని, కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజలు తరిమికొడతారని పేర్కొన్నారు.

తెలంగాణ రాజకీయం హీటెక్కింది. అసెంబ్లీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నేడు రద్దు చేశారు. తొమ్మిది నెలలు ముందుగా అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా.. రద్దు చేసిన రోజే 105మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియా ఏమంటోంది. అభినందనలు.. విమర్శలు ఎలా ఉన్నాయి. చదవండి: అసెంబ్లీ రద్దు : ఎందుకంత తొందర..!?

  • ముగిసిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం.. 1 గంట 20 నిమిషాలపాటు విలేకరులతో మాట్లాడిన కేసీఆర్‌

మధ్యాహ్నం 3.30 గంటలు: కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో అనేక ఊహాగానాలకు తెరపడింది. పలు విషయాల్లో స్పష్టత వచ్చింది. సీనియర్‌ నేత వివేక్‌ తిరిగి టీఆర్‌ఎస్‌లోకి రావడంతో పెద్దపల్లి ఎంపీగా ఉన్న విద్యార్థి నేత బాల్క సుమన్‌ అసెంబ్లీకి షిఫ్ట్‌ అయ్యారు. బాల్క సుమన్‌ చెన్నూరు నుంచి పోటీ చేయనున్నారు. దీంతో పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి మళ్లీ వివేక్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్టుంది. ఇక సినీ నటుడు బాబుమోహన్‌కు చేదు అనుభవం మిగిలింది. ఆయన స్థానంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జర్నలిస్టు క్రాంతికూమార్‌కు ఆందోల్‌ సీటు లభించింది. ఇక కేసీఆర్‌ కుమార్తె కవిత అసెంబ్లీకి మారుతారన్న ఊహాగానాలకు సైతం తెరపడింది. నిజామాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ సీటు ఇవ్వడంతో ఆమె అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టత వచ్చినట్టు అయింది.

టీఆర్‌ఎస్‌ వంద స్ధానాల్లో విజయం సాధిస్తుంది.. 50 రోజుల్లో వంద సభలను ఏర్పాటు చేసి మా ఆలోచనలను ప్రజల ముందుంచుతాం.. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ధీమా.. పూర్తి కథనం కోసం చదవండి: వంద స్ధానాల్లో గెలుస్తాం : కేసీఆర్‌

మధ్యాహ్నం 3 గంటలు: ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం సీఎం కేసీఆర్‌ మళ్లీ గజ్వెల్‌ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. చెన్నూరు, ఆందోల్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించారు. వారికి ముందే సమాచారం ఇచ్చామని, వారికి తగినవిధంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఇక 14స్థానాల్లో అభ్యర్థుల పేర్లు పెండింగ్‌లో ఉంచారు.

చదవండి పూర్తి కథనం: 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్‌


మధ్యాహ్నం 3 గంటలు : ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

  • ప్రతిపక్షాలు కాకిగోల చేస్తున్నాయి..
  • ప్రతిపక్ష నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారు
  • ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మీద కోర్టు స్టేలు తీసుకొచ్చి అడ్డుకుంటున్నారు
  • రాష్ట్రంలోఅసహన వైఖరి కనిపిస్తోంది
  • రౌండ్‌ టేబుల్స్‌, వాళ్ల బొంద టేబుల్స్‌ అని పెడుతున్నారు
  • ఒక్కటంటే ఆధారం లేకుండా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు
  • ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ సన్నాసులంతా గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పనిచేసినవారే
  • ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసి కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నాం
  • తెలంగాణకు విలన్‌ నంబర్‌ వన్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్రానికి బిగ్గెస్ట్‌ పీడ కూడా ఆ పార్టీయే

అనేక త్యాగాల ఫలితం తెలంగాణ

  • అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది: సీఎం కేసీఆర్‌
  • రాష్ట్రం బాధ్యతయుతంగా ముందుకుసాగాలనే ఆలోచనతోనే గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాం : సీఎం కేసీఆర్‌
  • గత ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో స్పష్టమైన మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్నారు: సీఎం కేసీఆర్‌

మధ్యాహ్నం 2.50 గంటలు: ప్రారంభమైన కేసీఆర్‌ మీడియా సమావేశం..

మధ్యాహ్నం 2: 35 : ప్రగతి భవన్‌ నుంచి తెలంగాణ భవన్‌ బయలుదేరిన కేసీఆర్‌

మధ్యాహ్నం 1: 45 : అసెంబ్లీ రద్దుపై కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు కేసీఆర్‌ అందించారు. కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రక్రియ పూర్తయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరారు.

మధ్యాహ్నం 1.30: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు సీఎం కేసీఆర్‌, మంత్రులు కలిశారు. అసెంబ్లీ రద్దు గురించి గవర్నర్‌కు నివేదించారు.

మధ్యాహ్నం 1.06: ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు.

మధ్యాహ్నం ఒంటి గంట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రి మండలి నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

మధ్యాహ్నం 12.50: ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని చెప్పారు.

మధ్యాహ్నం 12.35: కాసేపట్లో  రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రులు ప్రగతి భవన్‌కు తరలివస్తున్నారు. కేబినెట్‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మధ్యాహ్నం 12.00: తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందుస్తు ఎన్నికలపై చర్చ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి హాజరయ్యారు. 

ఉదయం 11.30: కేసీఆర్‌ వ్యవహార శైలికి నిరసనగా కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఉదయం 10.57: బీజేపీ నాయకులు గవర్నర్ నరసింహన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. శాసనసభ రద్దైతే రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నాయకులు కోరనున్నారని సమాచారం.

ఉదయం 10.50: స్పీకర్ మధుసూదనాచారితో అసెంబ్లీ కార్యదర్శి పత్ర్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ రద్దైతే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

ఉదయం 10.45: మంత్రులందరూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్‌లో ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారు.

అంతకుముందు సమాచారం...
గురువారం ఉదయం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మంత్రులకు సూచించారు. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు ఉంటుంది? ఎజెండా ఏమిటన్న విషయాలు మాత్రం గోప్యంగానే ఉంచారని ఓ సీనియర్‌ మంత్రి బుధవారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. జీఏడీ అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. 1–30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి కేబినెట్‌ తీర్మానం కాపీని అందజేస్తారు. అనంతరం గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం రెండు గంటలకు కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ భవన్‌కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడతారు. శాసనసభ రద్దుకు సంబంధించి గురువారం సాయంత్రం ప్రకటన వెలువడగానే.. శుక్రవారం ఉదయం సిద్దిపేట జిల్లాకు బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తరువాత హుస్నాబాద్‌కు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.  

నేటి సాయంత్రం నుంచి ఆపధర్మ ప్రభుత్వం
శాసనసభ రద్దుకు సంబంధించి గవర్నర్‌ నరసింహన్‌ సాయంత్రం నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని, అదేసమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కేసీఆర్‌ను కోరతారని అధికార వర్గాలు వెల్లడించాయి. శాసనసభ రద్దయిన వెంటనే 119 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోతారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు యధావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వారి జీతభత్యాలు, అలవెన్సుల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపధర్మ మంత్రిమండలిగా కొనసాగాలని గవర్నర్‌ తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆపధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement