సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 94వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మరళీధర్‌రావు, కిషన్‌రెడ్డిలతో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలే ఈ తరం యువతకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. వాజ్‌పేయి ప్రజా సేవ కోసం అంకిత భావంతో పనిచేశారని.. విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు. కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు కావస్తున్న గెలిచిన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం జరుపలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. గుణాత్మక మార్పు కోసం కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
దత్తాత్రేయ మాట్లాడుతూ.. వాజ్‌పేయి గొప్ప కవి అని కొనియాడారు. వాజ్‌పేయి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అని.. ఆయన ప్రభుత్వంలో తాను మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు. వాజ్‌పేయి కన్న కలకు అనుగుణంగా మోదీ పాలన చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో భారత్‌కు ఆయన ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment