హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి బడ్జెట్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో అంకెలు తప్పా ఏమీ కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ పూర్తిస్థాయి ఆర్థికమంత్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించిన లక్ష్మణ్.. నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ప్రకటించిన 1800 కోట్లు 16 లక్షల మందికి ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు మాటలకు, బడ్జెట్ లెక్కలకు పొంతన లేదని ఆరోపించారు.‘బడ్జెట్‌లో ఉపాధి కల్పన ప్రస్తావన లేదు. వయో పరిమితి పెంపు ప‍్రస్తావన లేదు. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం కొన్ని తాయిలాలు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను మోసం చేస్తోంది. సంక్షేమానికి, అభివృద్ధికి పొంతన లేదు. కొత్త జిల్లాలకు కనీస సౌకర్యాలు లేవు. కేవలం మద్యం రూపంలోనే ఆదాయం పెంచుకోవడం పద్దతి కాదు. ఇది పూర్తిగా అంకెల గారడి బడ్జెట్. బీజేపీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. సన్నహక సాధస్సులు వేగవంతంగా జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీన నిజామాబాద్ లో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. మార్చి 2న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. మార్చి 2నుండి గడప, గడప కు వెళ్లే కార్యక్రమాన్ని ఉదృతం చేస్తాం’ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ( ఇక్కడ చదవండి: సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది: కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment