
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ‍్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఈ నెల 17వ తేదీన జలవిహార్ జరగనున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం జలవిహార్‌లోని జన్మదిన వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తలసాని విలేకరులతో మాట్లాడుతూ.... నాలుగేళ్ల మూడు నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కేసీఆర్ జన్మదినాన్ని కోలాహలంగా, పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని చెప్పారు.
జలవిహార్‌లో తెలంగాణ సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా గుస్సాడీ, చిందు యక్షగానం తదితర కళాకారులతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు జానపద గీతాల పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పథకాలను వివరించే స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలిపే రెండు అద్భుత గీతాలు ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఇవేకాకుండా కేసీఆర్ జీవిత నేపధ్యం తెలిపేలా భారీ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక పదిహేడో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిన మహంకాళి అమ్మవారి ఆలయంలో గణపతి హోమం, ఆయూష్ హోమం, చండీహోమం నిర్వహిస్తామని తలసాని పేర్కొన్నారు.
కేసీఆర్ పుట్టినరోజు వేడుక కార్యక్రమానికి టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరు కానున్నారు. కాగా గత ఏడాది కూడా కేసీఆర్ బర్త్‌డే వేడుకలు జలవిహార్‌లోనే నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment