కుంతియాను సన్మానిస్తున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీని వెలమ సామాజిక వర్గం వ్యక్తులు నడిపిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియా విమర్శించారు. టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఆ పార్టీ బలహీనంగా ఉన్నందునే తమ పార్టీ నేతలను చేర్చుకుంటోందని ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన ముఖ్య నేతల సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మభ్యపెట్టాలని చూస్తున్నారని, అయినా ఉత్తమ్ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ను తాము ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్న కుంతియా.. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు.
గద్దె దించేందుకు ప్రజలూ సిద్ధం: ఉత్తమ్
‘ముందస్తు ఎన్నికలకు సిద్ధం అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ రద్దుపై గవర్నర్‌కు లేఖ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా..? ఎవరైనా వద్దన్నారా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ నిరంకుశ పాలనలో అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన ప్రజలు కూడా ఎన్నికలకు, టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. దానం నాగేందర్ పార్టీని వీడటం బాధాకరమన్న ఉత్తమ్.. సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. తప్పుడు సర్వేలతో కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment