
సాక్షి, గద్వాల : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టీ కాంగ్రెస్ నేతలు గురువారం ఆలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు జానారెడ్డి, భట్టి విక్రమార్క, సంపత్ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం కాంగ్రెస్ నేతలు లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలంపూర్‌లో ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్ నేతలు పలు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బ్యాండ్ వాయించగా.. ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క శంఖం పూరించారు. ఇక, సీనియర్ నేత జానారెడ్డి తనదైన శైలిలో తల్వార్ దూసి.. ఫొటోలకు పోజు ఇవ్వగా.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, సీనియర్ నేత డీకే అరుణ సైతం తల్వార్ ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారభేరీని మోగించారు. ఆలంపూర్ నుంచి శాంతినగర్, వడ్డేపల్లి, ఐజల మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ కాంగ్రెస్ నేతలు సాయంత్రానికి గద్వాల చేరుకున్నారు. గద్వాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఇప్పటికే అసెంబ్లీని రద్దుచేసి.. ముందస్తు ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతుండగా.. లాంఛనంగా కాంగ్రెస్ పార్టీ గద్వాల సభతో ప్రచార పర్వానికి తెర తీస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, మహాకూటమి అవసరాన్ని ప్రజలకు చాటిచెప్పడం, కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టడం లక్ష్యంగా గద్వాల బహిరంగ సభ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment