సాక్షి, న్యూఢిల్లీ: అభ్యర్థుల ఖరారు విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. అభ్యర్థుల వడపోత ఏకధాటిగా ఏడుగంటలపాటు సాగింది. కాగా, సాయంత్రం సమయంలో వడపోత కార్యక్రమానికి స్క్రీనింగ్ కమిటీ కాసేపు విరామం ఇచ్చింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం కొనసాగనుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ ముగించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు అభ్యర్థుల ఖరారును పూర్తిచేయాలని స్ర‍్కీనింగ్ కమిటీ సభ్యులు పట్టుదలతో ఉన్నారు. 40 మంది అభ్యర్థుల ఎంపికపై ప్రస్తుతం వడపోత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 8న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం లోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించుకుంది.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, సంప్రదింపుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 9న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ మిగతా 14 మంది అభ్యర్థులను ప్రకటించేందుకు రెండు నెలల సమయం ఎందుకు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు దిగజారి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment