సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జిల్లాల్లో క్రికెట్ టోర్నీలు నిర్వహించని వివేక్.. ఆ పేరుతో కోట్ల రూపాయలు దిగమింగారని టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ గురువారెడ్డిలు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన టీసీఏ ప్రతినిధులు.. హెచ్‌సీఏ అక్రమాల చిట్టాను బయటపెట్టారు.
వెంకటస్వామి ట్రోఫికి అనుమతి ఎవరిచ్చారు? : ‘‘క్రికెట్‌లో ఓనమాలు కూడా తెలియని వివేక్ రాజకీయాలను అడ్డం పెట్టుకుని హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యారు. జిల్లాల్లో టోర్నమెంట్లు నిర్వహించకున్నా ఆ పని చేసినట్లు చెప్పుకుని నిధులు కాజేశారు. గత రెండు సంవత్సరాలలో రూ.2కోట్ల నిధులు దారిమళ్లించారు. హెచ్‌సీఏ కార్యదర్శి(శేష్ నారాయణ్) సస్పెన్షన్ విషయంలో నిబంధనలు పాటించలేదు. వెంకటస్వామి పేరు మీద ట్రోఫీ నిర్వహించడానికి హెచ్‌సీఏ జనరల్ బాడీ అనుమతి ఉందా? వివేక్ తన విశాఖ సంస్థ ప్రచారం కోసం క్రికెట్ సంఘాన్ని వాడుకుంటున్నారు’’ అని లక్ష్మీనారాయణ అన్నారు.
పోరాటం చేస్తాం : తెలంగాణ జిల్లాలన్నీ హెచ్‌సీఏ పరిథిలోకే వస్తాయని వివేక్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. టీసీఏ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్, చీఫ్ ప్యాట్రన్‌గా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయలు ఉన్నారు. ఇప్పటివరకు మేం(టీసీఏ) 1200 మ్యాచ్‌లు నిర్వహించాం. అవసరమైన మేరలో సీనియర్ క్రికెటర్ల సేవలను వినియోగించుకుంటాం. క్రికెట్ కోసం ఇంతగా కష్టపడుతోన్న టీసీఏకి బీసీసీఐ గుర్తింపు విషయంలో హెచ్‌సీఏ అనుమతి అవసరమేలేదు. వివేక్ ఆధ్వర్యంలో హెచ్‌సీఏలో కొనసాగుతోన్న అక్రమపర్వాలపై చట్టపరమైన పోరాటం చేస్తాం..’’ అని గురువారెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment