Telangana Cricket Association
-
'వివేక్ వెంటనే రాజీనామా చేయాలి'
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదకి జి. వివేక్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్ హెచ్‌సీఏలో కొనసాగడానికి ఎంతమాత్రం అర్హత లేదన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇచ్చే విషయంలో అడ్డుకుంటామని వివేక్ స్వయంగా చెప్పడం నిజంగా సిగ్గుచేటన్నారు. ఇలా చెప్పడం తెలంగాణ యువతను క్రికెట్ దూరం చెయ్యడం కాదా.. అని అరుణ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన తరువాత టీసీఏ..బీసీసీఐ అనుమతి కోసం యత్నంచడంలో తప్పేముందని అరుణ నిలదీశారు. ఈ సందర్భంగా టీసీఏను 1986లో పాల్వాయి గోవర్ధన్ స్థాపించిన సంగతిని గుర్తు చేశారు. అదే సమయంలో హెచ్‌సీఏ ఏనాడూ గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ నిర్వహించి, ప్రోత్సహకాలు అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా హెచ్‌సీఏ గ్రామాల్లోకి వెళ్లిన దాఖలాలు లేవని మండిపడ్డారు. టీసీఏపై హెచ్‌సీఏ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని అనడానికి వివేక్ వ్యాఖ్యలు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. హెచ్‌సీఏపై లెక్కలేనటువంటి ఆరోపణలున్నాయని, రూ. 140 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీలో కేసులో ఉన్నాయన్నారు. ఇక్కడ జరపని టోర్నమెంట్లను జరిపినట్లు చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు. ఇదిలా ఉంచితే, తెలంగాణలో మహిళా క్రికెటర్లకు ఎంతమాత్రం ప్రోత్సాహం లేదని, దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల యువతి, యువకులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు టీసీఏ కంకణం కట్టుకుని పనిచేస్తోందన్నారు. హెచ్‌సీఏలో వివేక్ కుటుంబ పాలన కొనసాగిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. హెచ్‌సీఏ అవినీతిపై అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తామని హెచ్చరించిన అరుణ.. హెచ్‌సీఏలో ఏమి జరిగినా జవాబు చెప్పాల్సిన బాధ్యత వివేక్‌పై ఉందన్నారు. టీసీఏకి త్వరలో బిసిసిఐ అనుమతి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టీసీఏ కి వస్తున్న ఆదరణ ఓర్వలేక వివేక్ ఆరోపణలకు దిగుతున్నారని అరుణ ఆరోపించారు. హెచ్‌సీఏలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న వివేక్ దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేయాలన్నారు. -
వివేక్‌పై నిప్పులుచెరిగిన టీసీఏ
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జిల్లాల్లో క్రికెట్ టోర్నీలు నిర్వహించని వివేక్.. ఆ పేరుతో కోట్ల రూపాయలు దిగమింగారని టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ గురువారెడ్డిలు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన టీసీఏ ప్రతినిధులు.. హెచ్‌సీఏ అక్రమాల చిట్టాను బయటపెట్టారు. వెంకటస్వామి ట్రోఫికి అనుమతి ఎవరిచ్చారు? : ‘‘క్రికెట్లో ఓనమాలు కూడా తెలియని వివేక్ రాజకీయాలను అడ్డం పెట్టుకుని హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యారు. జిల్లాల్లో టోర్నమెంట్లు నిర్వహించకున్నా ఆ పని చేసినట్లు చెప్పుకుని నిధులు కాజేశారు. గత రెండు సంవత్సరాలలో రూ.2కోట్ల నిధులు దారిమళ్లించారు. హెచ్‌సీఏ కార్యదర్శి(శేష్ నారాయణ్) సస్పెన్షన్ విషయంలో నిబంధనలు పాటించలేదు. వెంకటస్వామి పేరు మీద ట్రోఫీ నిర్వహించడానికి హెచ్‌సీఏ జనరల్ బాడీ అనుమతి ఉందా? వివేక్ తన విశాఖ సంస్థ ప్రచారం కోసం క్రికెట్ సంఘాన్ని వాడుకుంటున్నారు’’ అని లక్ష్మీనారాయణ అన్నారు. పోరాటం చేస్తాం : తెలంగాణ జిల్లాలన్నీ హెచ్‌సీఏ పరిథిలోకే వస్తాయని వివేక్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. టీసీఏ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్, చీఫ్ ప్యాట్రన్‌గా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయలు ఉన్నారు. ఇప్పటివరకు మేం(టీసీఏ) 1200 మ్యాచ్‌లు నిర్వహించాం. అవసరమైన మేరలో సీనియర్ క్రికెటర్ల సేవలను వినియోగించుకుంటాం. క్రికెట్ కోసం ఇంతగా కష్టపడుతోన్న టీసీఏకి బీసీసీఐ గుర్తింపు విషయంలో హెచ్‌సీఏ అనుమతి అవసరమేలేదు. వివేక్ ఆధ్వర్యంలో హెచ్‌సీఏలో కొనసాగుతోన్న అక్రమపర్వాలపై చట్టపరమైన పోరాటం చేస్తాం..’’ అని గురువారెడ్డి వ్యాఖ్యానించారు. -
గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రణాళిక హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రికెటర్లను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహిస్తామని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) ప్రకటించింది. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీసీఏ వెల్లడించింది. టీసీఏ ఏర్పాటైన తర్వాత గత రెండున్నరేళ్ల కాలంలో తాము నిర్వహించిన వివిధ టోర్నీలు, కోచింగ్ క్యాంప్‌ల వివరాలను టీసీఏ వైస్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ‘అత్యంత ప్రజాదరణ ఉన్న క్రికెట్లో భారత్ తరఫున ఒక్క తెలంగాణ ఆటగాడు కూడా లేకపోవడం బాధగా ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి, వివాదాలే అందుకు కారణం. హైదరాబాద్ మినహా గ్రామాలను వారు నిర్లక్ష్యం చేశారు. అందుకే ప్రతిభను వెలికి తీసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సత్తా ఉన్నవారు పెద్ద స్థారుుకి ఎదిగే విధంగా తమ సంఘం సహకరిస్తుందని ఆయన చెప్పా రు. బీసీసీఐ గుర్తింపు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే తమకు గుర్తింపు లభిస్తుందని టీసీఏ అధ్యక్షుడు యెండ్ల లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు కలవల విశ్వేశ్వర్ రెడ్డి, టీసీఏ కార్యదర్శి గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
8 నుంచి పాఠశాలల క్రికెట్ పోటీలు
హన్మకొండ : పాఠశాలల జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతాయని ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ తాళ్లపల్లి జయపాల్ తెలిపారు. సోమవారం హన్మకొండ స్నేహనగర్‌లోని ఓరుగల్లు జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ప్రథమ స్థానంలో నిలిచే జట్టుకు రూ.10 వేల నగదు పారితోషికాన్ని అందజేస్తామన్నారు. మ్యాచ్‌లు మ్యాట్‌పై జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పాఠశాలల జట్లు హన్మకొండ స్నేహనగర్‌లోని ఓరుగల్లు జూనియర్ కాలేజీలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. సెమీస్‌కు చేరే నాలుగు జట్లను హైదరాబాద్‌లో జరుగనున్న క్రికెట్ పోటీల్లో ఇతర జిల్లాల జట్లతో ఆడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ తమ స్కూల్ డ్రెస్‌లతో మ్యాచ్‌లలో ఆడాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 97006 85123, 98666 08130, 98494 40721 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ప్రతిభతో క్రీడల్లో గుర్తింపు
ఆదిలాబాద్ స్పోర్ట్స్: క్రీడాకారులోని ప్రతిభతోనే గుర్తింపు లభిస్తుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వివేకానందరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైధానంలో శనివారం టీసీఏ 2డే లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఆదిలాబాద్ అర్బన్, ఆసిఫాబాద్ మ్యాచ్‌ల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు సాధన అవసరమని, ప్రతిభతోనే గుర్తింపు చేకూరుతుందని చెప్పారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ క్రీడాకారులు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పారు. క్రీడాకారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. క్రీడానైపుణ్యాలతో అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇందులో టీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి నరోత్తమ్‌రెడ్డి, జిల్లా జట్టు కోచ్ జయేంద్రపటాస్కర్లు , క్రీడాకారులు ఉన్నారు. ఇంద్రనీల్ అల్రౌండర్ ప్రతిభ... ఆసిపాబాద్ జుట్ట టాస్‌గెలిచి మొదటి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ అర్బన్ జట్టు 359 పరుగులు చేసి 7 వికేట్ల నష్టపోయింది. ఇందులో ఇంద్రనీల్ పటాస్కర్ 156 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. జయగణేష్ 52 పరుగులతో నాటౌట్, అన్వేష్‌రెడ్డి 51 పరుగులు చేసి ఔట్ అయ్యారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆసిఫాబాద్ జట్టు 98 పరుగులు చేసి 9 వికేట్ల నష్టపోయింది. ఇందులో ఇంద్రనీల్ 5 వికేట్లు తీసుకోగా , ప్రణయ్ 2 వికేట్లు తీసుకున్నారు. -
వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలం టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి భీమారం : వరంగల్‌లో అంతర్జాతీయస్థాయి క్రికెట్ మైదానం ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి అన్నారు. నగర శివారులోని కిట్స్ కళాశాలలో శనివారం నుంచి టీసీఏ ఆధ్వర్యంలో జోనల్ స్థారుు క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యూరుు. ఈ సందర్భంగా పోటీలకు హాజరైన గురువారెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేయాలని టీసీఏ ఆధ్వర్యంలో ఇటీవల సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. స్టేడియం ఏర్పాటుపై బీసీసీఐకి కూడా దరఖాస్తు చేసుకున్నామని, త్వరలోనే దీనిపై అనుమతి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు జోన్ల నుంచి 30 జట్లను ఎంపిక చేసి వారికి లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైనల్ ఆడిన నాలుగు జట్ల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి రంజీ ట్రోఫీలకు సిద్ధం చేస్తామని వివరించారు. జట్లకు మాజీ క్రీడాకారులు అబిద్‌అలీ, విశ్వనాథ్‌లు కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తొలిసారిగా ఆన్లైన్ స్కోరింగ్.. కిట్స్ కళాశాలలో నిర్వహిస్తున్న వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జోనల్స్థారుు క్రికెట్ లీగ్ మ్యాచ్‌ల్లో తొలిసారిగా ఆన్లైన్ స్కోరింగ్ విధానం అమలు చేస్తున్నట్లు గురువారెడ్డి చెప్పారు. టీసీఏ. స్కోరింగ్ ఎస్టీఆర్. కం ద్వారా స్కోర్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఆయన వెంట కోచ్ ఇంద్రశేఖర్, టీసీఏ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జయపాల్, పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.