పొన్నాలకు షాక్‌.. శశిధర్‌రెడ్డికి హ్యాండ్‌.. | Telangana Elections 2018 Congress Party Changed Some Candidates Constituencies | Sakshi
Sakshi News home page

32 చోట్ల మార్పు.. ఇద్దరికి స్థానచలనం

Published Tue, Nov 13 2018 2:18 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Telangana Elections 2018 Congress Party Changed Some Candidates Constituencies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా రానే వచ్చింది. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని సోమవారం రాత్రి 11 గంటల సమయంలో 65 మందితో కాంగ్రెస్‌ అధిష్టానం తొలి జాబితాను అధికారికంగా ప్రకటించింది. జాబితా వివరాలను పరిశీలిస్తే.... 2014 ఎన్నికల్లో పోటీ చేసిన 32 మందికి ఈ జాబితాలో అవకాశం లభించలేదు. స్థానాలు మార్చి మరో ఇద్దరిని వేరే చోటకు పంపించారు. దీంతోపాటు కూటమి భాగస్వామ్య పక్షాలు గట్టిగా పట్టుపడుతున్న స్థానాల్లో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. తొలిజాబితాలో ప్రకటించిన 65 మందిలో 39 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశమివ్వగా, 22 మంది రెడ్డి కులస్తులకు, ముగ్గురు వెలమలకు, ఒక బ్రాహ్మణ నేతకు టికెట్లిచ్చింది. బీసీ కులాల్లో మొత్తం 13 మందికి తొలిజాబితాలో చోటు దక్కగా అందులో మున్నూరుకాపులు ఐదుగురు, గౌడ నలుగురు , పద్మశాలీ, యాదవ కులానికి చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మహిళల విషయానికొస్తే 65 మందిలో 10 మందికి టికెట్లు కేటాయించిన కాంగ్రెస్‌ అధిష్టానం మొత్తానికి తొలి జాబితాపై తన మార్కు చాటుకుంది.  

సగం మారాయి...!
కాంగ్రెస్‌ అధిష్టానం తొలి జాబితాలో ప్రకటించిన 65 స్థానాలకుగాను 32 చోట్ల అభ్యర్థులను మార్చింది. మరో ఇద్దరికి స్థానచలనం కల్పించింది. స్థానచలనం కలిగినవారిలో ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), పొడెం వీరయ్య(భద్రాచలం) ఉన్నారు. గతంలో ప్రేంసాగర్‌రావు సిర్పూర్‌ నుంచి, పొడెం వీరయ్య ములుగు నుంచి పోటీ చేశారు. అభ్యర్థులను మార్చిన వివరాల్లోకి వెళితే... గతంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వినోద్‌(చెన్నూరు), విఠల్‌రెడ్డి (ముథోల్‌), సురేశ్‌రెడ్డి (ఆర్మూరు), భానుప్రసాదరావు(పెద్దపల్లి), కాలె యాదయ్య (చేవెళ్ల), కె.దామోదర్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌), రెడ్యానాయక్‌ (డోర్నకల్‌), మాలోతు కవిత (మహబూబాబాద్‌)ల స్థానంలో ఇతరులకు టికెట్లిచ్చారు. ఇందులో ఎమ్మెల్సీ ఆకుల లలిత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ తదితరులున్నారు. మిగిలిన 24 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థులను మార్చినట్టయింది. ఈ 24 స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినవారు, పారాచూట్లకు కూడా అవకాశం కల్పించారు.  

ప్రముఖులకు ‘షాక్‌’
తొలిజాబితాలో పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు చోటు లభించకపోవడం గమనార్హం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ అసెంబ్లీ స్థానం టీజేఎస్‌కు కేటాయించే అవకాశం ఉండడంతో ఆ స్థానాన్ని ప్రకటించలేదు. మాజీమంత్రి శశిధర్‌రెడ్డి(సనత్‌నగర్‌), పీజేఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి(జూబ్లీహిల్స్‌)లకు కూడా టికెట్‌ దక్కలేదు. మహిళల విషయానికి వస్తే... ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీమంత్రి కొండా సురేఖకు తొలి జాబితాలోనే టికెట్‌ ఖరారు చేశారు. ఆమెతోపాటు మాజీమంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, గీతారెడ్డి, డి.కె.అరుణ సహా మొత్తం 10 మంది మహిళలకు తొలి జాబితాలో స్థానం దక్కింది. ఇక, ఉస్మానియా విద్యార్థి నేతల్లో మేడిపల్లి సత్యంకు మాత్రమే అవకాశమిచ్చారు. రేవంత్‌తోపాటు పార్టీలో చేరినవారిలో రేవంత్‌సహా నలుగురికి తొలి జాబితాలో చోటు లభించింది. ఇందులో సి.హెచ్‌. విజయరమణారావు(పెద్దపల్లి), మేడిపల్లి సత్యం(చొప్పదండి), సీతక్క(ములుగు) ఉన్నారు.  

కొత్త అభ్యర్థులను ఎంపిక చేసిన నియోజకవర్గాలివే...
సిర్పూర్, చెన్నూరు, మంచిర్యాల, ఆదిలాబాద్, ముధోల్, ఆర్మూరు, పెద్దపల్లి, కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, గజ్వేల్, చేవెళ్ల, తాండూరు, ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కంటోన్మెంట్, కొడంగల్, నాగర్‌కర్నూలు, మునుగోడు, భువనగిరి, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, ములుగు, కొత్తగూడెం, భద్రాచలం, రామగుండం, స్టేషన్‌ ఘన్‌పూర్‌.

తొలిజాబితాలో స్థానం పొందిన మహిళా నేతలు వీరే..
గండ్రత్‌ సుజాత, ఆకుల లలిత, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డి.కె.అరుణ, పద్మావతి, ఇందిర, కొండా సురేఖ, సీతక్క.  

బరిలో నలుగురుమాజీ ఎంపీలు..
కాంగ్రెస్‌ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీ బరిలోకి దిగారు. పొన్నం కరీంనగర్‌ నుంచి, సర్వే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి, బలరాం నాయక్‌ మహబూబాబాద్‌ నుంచి, రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి పోటీలో నిలిచారు. కాంగ్రెస్‌ తొలి జాబితాలో వీరికి చోటు దక్కింది.

మిత్రులు అడుగుతున్న స్థానాల్లోనూ...
టీజేఎస్, సీపీఐలు అడుగుతున్న స్థానాల్లోనూ కాంగ్రెస్‌ తొలిజాబితాలోనే అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఆసిఫాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్, తాండూరు స్థానాలను టీజేఎస్‌ అడుగుతుండగా, కొత్తగూడెం సీటును సీపీఐ ఆశిస్తోంది. అయితే, కొత్తగూడెం స్థానాన్ని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించారు. దీనికితోడు తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తారని భావించిన నకిరేకల్‌ స్థానంలో కూడా కాంగ్రెస్‌ చిరుమర్తి లింగయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. మిగిలినచోట్ల మిత్రపక్షాలతో స్పష్టతలేని స్థానాలను, ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న స్థానాలను ప్రకటించకుండా కాంగ్రెస్‌ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. కుటుంబసభ్యుల విషయానికి వస్తే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి కుటుంబాల్లో ఇద్దరికి చొప్పున చోటు లభించింది.

ఉత్తమ్‌ సతీమణి పద్మావతికి కోదాడ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు, మల్లు భట్టివిక్రమార్క సోదరుడు మల్లు రవికి జడ్చర్ల స్థానాలను కేటాయించారు. జానారెడ్డి తనయుడు ఆశిస్తున్న మిర్యాలగూడ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. అయితే, పద్మావతి ఇప్పటికే సిట్టింగ్‌ కావడం, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండడంతో ఈ ఇద్దరికి అవకాశమిచ్చినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. జడ్చర్ల జనరల్‌ సీటును మరోమారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవికి కేటాయించారు. తొలిజాబితాలో 14 ఎస్సీ రిజర్వుడు, ఆరు ఎస్టీ రిజర్వుడు స్థానాలను ప్రకటించారు. ఇందులో ఎస్టీ నియోజకవర్గాలకుగాను నలుగురు కోయలు, ఇద్దరు లంబాడీలకు అవకాశం దక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement