సాక్షి, హైదరాబాద్: కేవలం 11 స్థానాలు మినహా మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పటివరకు కాంగ్రెస్ 88, టీడీపీ 13, టీజేఎస్ 4, సీపీఐ 3 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. పెండింగ్‌లో ఉన్న 11 స్థానాలకు ఆదివారం క్లియరెన్స్ రానుంది. ఆదివారం కాంగ్రెస్ తుది జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో కూటమి లెక్క పక్కాగా తేలనుంది. శనివారమే కాంగ్రెస్ పార్టీ తుది జాబితా వస్తుందని భావించినా, కేవలం 13 సీట్లకే అభ్యర్థులను ప్రకటించి 6 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. దీంతో కూటమిలోని ఇతర పార్టీలకు సంబంధించిన మరో ఐదు స్థానాలు కూడా అస్పష్టంగా మిగిలిపోయాయి. కాగా, శనివారం టీజేఎస్ 4స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
కాంగ్రెస్ కోటాలోకి జనగామ..
కూటమిలోని 17 మంది అభ్యర్థులను శని వారం అధికారికంగా ప్రకటించారు. ఇం దులో 13 కాంగ్రెస్, 4 జనసమితి స్థానాలున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. టీజేఎస్ అధినేత కోదండరాం పోటీచేస్తారని భావించిన జనగామ నియోజకవర్గాన్ని అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడితో కాంగ్రెస్ కోటాలో వేయడంలో పొన్నాల సఫలీకృతులయ్యారు. ఈయనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (తుంగతుర్తి), నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్.బాలూనాయక్ (దేవరకొండ), డి.సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ)కు కూడా టికెట్లు కేటాయించింది. రేవంత్‌రెడ్డి కోటాలో ఇల్లెందు స్థానం బాణోతు హరిప్రియా నాయక్‌కు ఖరారు చేశారు.
నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్‌కు నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని కేటాయించారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్‌లో అవకాశమిచ్చారు. ఇక, పాతబస్తీలోని యాకుత్‌పుర, బహుదూర్‌పుర నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కొల్లాపూర్‌లో ముందునుంచీ ఊహించినట్లుగానే హర్షవర్దన్‌రెడ్డికి టికెటిచ్చారు. ఇక, ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు మరోమారు అవకాశమిచ్చారు. తెలంగాణ జనసమితి కూడా నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కపిలవాయి దిలీప్‌కుమార్ (మల్కాజ్‌గిరి), చిందం రాజ్‌కుమార్ (దుబ్బాక), భవానీరెడ్డి (సిద్ధిపేట), జనార్దన్‌రెడ్డి (మెదక్)లున్నాయి.
‘మర్రి’కి మొండిచేయి...
మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. శనివారం ఆ పార్టీ ప్రకటించిన మూడో జాబితాలో ఆయన పేరు లేకపోవడం, ఆ జాబితా వచ్చిన వెంటనే సనత్‌నగర్ అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్‌ను టీడీపీ ప్రకటించడంతో ఆయన అవాక్కయ్యారు. షాక్ నుంచి తేరుకున్న శశిధర్‌రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే, శశిధర్‌రెడ్డికి శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ కోటరీలో శక్తివంతమైన నేతగా పేరున్న అహ్మద్‌పటేల్ నుంచి ఫోన్ రా>వడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో మర్రి భవితవ్యం ఏంటనేది ఆదివారం తేలనుంది.
పెండింగ్ వీరికేనా...
కూటమి పక్షాన ఇంకా ప్రకటించకుండా పెండింగ్‌లో ఉన్న 11 నియోజకవర్గాల్లో 6 చోట్ల కాంగ్రెస్ పోటీచేసే అవకాశాలున్నాయి. ఇందులో నారాయణŠ ఖేడ్ నుంచి సురేశ్‌షెట్కార్, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, దేవరకద్ర నుంచి పవన్‌కుమార్‌రెడ్డి, నారాయణపేట నుంచి శివకుమార్‌రెడ్డి లేదా షరాబు శివకుమార్, సికింద్రాబాద్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ లేదా ఆదం ఉమ లేదా బండా కార్తీక, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగరావు లేదా కొమిరెడ్డి జ్యోతి రామ్‌లు ఖరారు కానున్నారు. ఇక, రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ పోటీచేస్తే అక్కడ సినీ నిర్మాత బండ్ల గణేశ్ పేరు ఖరారు చేస్తారని తెలుస్తోంది. జన సమితి పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో వర్ధన్నపేట నుంచి డాక్టర్ దేవయ్య, అంబర్‌పేట నుంచి సత్యంగౌడ్, మిర్యాలగూడ నుంచి విజయేందర్‌రెడ్డి, వరంగల్ తూర్పు నుంచి గాదె ఇన్నారెడ్డి ఖరారు కానున్నారు. వరంగల్ తూర్పు స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇస్తే అక్కడ వద్దిరాజు రవిచంద్ర పోటీ చేయనున్నారు. మిర్యాలగూడ కూడా కాంగ్రెస్‌కు ఇచ్చే పక్షంలో అక్కడ జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి బరిలో ఉంటారు. పఠాన్‌చెరు స్థానాన్ని టీడీపీకి కేటాయించనుండగా అక్కడ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పేరు వినిపిస్తోంది.
‘కూటమి’కులాల వారీగా....
ఇప్పటి వరకు కూటమి పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల వివరాలను కులాల వారీగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 32 స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించింది. ఆ తర్వాత ఎస్సీల్లో మాదిగలకు 9, మాలలకు 8 సీట్లు ప్రకటించింది. ఎస్టీల్లో లంబాడీలు, ఆదివాసీలకు చెరో 5 నియోజక వర్గాలను కేటాయించగా, బీసీల్లో అత్యధికంగా మున్నూరు కాపులకు 7 చోట్ల అవకాశమిచ్చింది. ఆ తర్వాత గౌడ కులస్తులకు 4, పద్మశాలీలకు 2, యాదవ, బొందిలి, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, పవార్ కులస్తులకు ఒక్కోటి చొప్పున ఇచ్చింది. ముస్లిం మైనార్టీలకు 7 చోట్ల అవకాశం కల్పించింది. ఇక అగ్రవర్ణాల్లో వెలమలకు 3 చోట్ల, బ్రాహ్మణులకు 1 స్థానంలో అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.
తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన 13 స్థానాలకు గాను కమ్మ కులస్తులకు 3, వైశ్యులకు 1, రెడ్లకు 3, బీసీలకు 3, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఒక్కోటి చొప్పున కేటాయించింది. జనసమితి శనివారం సాయంత్రం ప్రకటించిన నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురు ఓసీ, ఒక బీసీ ఉన్నారు. అందులో ఒకరు బ్రాహ్మణ, ఒకరు మున్నూరుకాపు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారు. సీపీఐ తరఫున పోటీచేసే ముగ్గురిలో ఎస్సీ (మాదిగ) ఒకటి, ఎస్టీ (లంబాడ) ఒకటి, ఓసీ (రెడ్డి) ఒకటి చొప్పున కేటాయించారు.
స్నేహపూర్వక పోటీ లేనట్టే...
కూటమి పక్షాల్లో సీట్ల సర్దుబాటు శనివారంతో పూర్తికానుండగా, స్నేహపూర్వక పోటీలకు కూడా అవకాశం లేదని తెలుస్తోంది. ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని టీజేఎస్ చెప్పినా గందరగోళానికి తావు లేకుండా ఈ పోటీలను నివారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, కొన్ని చోట్ల కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించిన చోట్ల ఇంకో పార్టీ అభ్యర్థులు రెబల్‌గా బరిలో దిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు కూటమిలోని పార్టీలు ప్రకటించిన స్థానాల సంఖ్య:
కాంగ్రెస్: 88
టీడీపీ: 13
టీజేఎస్ : 04
సీపీఐ: 03
మొత్తం: 108
పెండింగ్: 11
కూటమి అభ్యర్థులను ప్రకటించని స్థానాలు:
నారాయణ్‌ఖేడ్, నారాయణపేట, మిర్యాలగూడ, హుజూరాబాద్, సికింద్రాబాద్, అంబర్‌పేట, వరంగల్ (ఈస్ట్), పఠాన్‌చెరు, కోరుట్ల, దేవరకద్ర, వర్ధన్నపేట.
ఇప్పటివరకు కాంగ్రెస్ మిత్రపక్షాలు అభ్యర్థులను ఖరారు చేసిన నియోజకవర్గాలివే:
తెలుగుదేశం:
నియోజకవర్గం అభ్యర్థి పేరు సామాజిక వర్గం
1. ఉప్పల్ టి.వీరేందర్‌గౌడ్ బీసీ (గౌడ్)
2. శేరిలింగంపల్లి భవ్య ఆనందప్రసాద్ ఓసీ (కమ్మ)
3. కూకట్‌పల్లి సుహాసిని ఓసీ (కమ్మ)
4. సనత్‌నగర్ కూన వెంకటేశ్‌గౌడ్ బీసీ (గౌడ్)
5. రాజేంద్రనగర్ గణేశ్‌గుప్తా ఓసీ (వైశ్య)
6. ఇబ్రహీంపట్నం సామా రంగారెడ్డి ఓసీ (రెడ్డి)
7. ఖమ్మం నామా నాగేశ్వరరావు ఓసీ (కమ్మ)
8. అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు ఎస్టీ (కోయ)
9. సత్తుపల్లి సండ్రవెంకటవీరయ్య ఎస్సీ (మాదిగ)
10. మహబూబ్‌నగర్ ఎర్ర శేఖర్ బీసీ (ముదిరాజ్)
11. మక్తల్ కొత్తకోట దయాకర్‌రెడ్డి ఓసీ (రెడ్డి)
12. వరంగల్ (వెస్ట్) రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఓసీ (రెడ్డి)
13. మలక్‌పేట ముజఫర్‌అలీ ముస్లిం మైనార్టీ
(టీడీపీ ప్రకటించిన 13 స్థానాల్లో ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో.. లేదంటే ఒకచోట కాంగ్రెస్ పోటీచేసే అవకాశాలున్నాయి. పఠాన్‌చెరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించనున్నారు.)
తెలంగాణ జనసమితి:
1. దుబ్బాక చిందం రాజ్‌కుమార్ బీసీ (మున్నూరుకాపు)
2. సిద్ధిపేట భవానీరెడ్డి ఓసీ (రెడ్డి)
3. మల్కాజ్‌గిరి కె. దిలీప్‌కుమార్ ఓసీ (బ్రాహ్మణ)
4. మెదక్ జనార్దనరెడ్డి ఓసీ (రెడ్డి)
(ఈ పార్టీ విషయంలో స్పష్టత వచ్చిన నియోజకవర్గాల్లో అంబర్‌పేట, వర్ధన్నపేట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిర్యాలగూడ, వరంగల్ (ఈస్ట్) నియోజకవర్గాల విషయంలో నేడు పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.)
సీపీఐ:
1. బెల్లంపల్లి గుండా మల్లేశ్ ఎస్సీ (మాదిగ)
2. వైరా బి. విజయ ఎస్టీ (లంబాడీ)
3. హుస్నాబాద్ చాడా వెంకటరెడ్డి ఓసీ (రెడ్డి)
కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సామాజిక వర్గాల వారీ వివరాలు:
ఓసీ – 36, బీసీ – 18, ఎస్సీ – 17, ఎస్టీ – 10, మైనార్టీ – 7 , మొత్తం – 88
కూటమి తరఫున ఇప్పటివరకు ఖరారైన అభ్యర్థుల సామాజిక వర్గాల వారీ వివరాలు:
ఓసీ – 47, బీసీ – 22, ఎస్సీ – 19, ఎస్టీ – 12, మైనార్టీ – 8, మొత్తం – 108.
కాంగ్రెస్ మూడో జాబితా
నిజామాబాద్(అర్బన్) : తాహెర్ బిన్ హమ్దాన్
నిజామాబాద్(రూరల్) : రేకుల భూపతిరెడ్డి
బాల్కొండ : ఇ.అనిల్‌కుమార్
ఎల్బీనగర్ : డి.సుధీర్‌రెడ్డి
కార్వాన్ : ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ
యాకుత్‌పుర : కె.రాజేందర్ రాజు
బహదూర్‌పు : కాలెం బాబా
కొల్లాపూర్ : బీరం హర్షవర్ధ్దన్‌రెడ్డి
దేవరకొండ(ఎస్టీ) : బాలూనాయక్
తుంగతుర్తి(ఎస్సీ) : అద్దంకి దయాకర్
జనగామ : పొన్నాల లక్ష్మయ్య
ఇల్లెందు : బానోతు హరిప్రియా నాయక్
బోథ్(ఎస్టీ) : సోయం బాపూరావు
టీజేఎస్ జాబితా..
మల్కాజ్‌గిరి : దిలీప్‌కుమార్
దుబ్బాక : రాజ్‌కుమార్
సిద్ద్ధిపేట్ : భవానీరెడ్డి
మెదక్ : జనార్దన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment