న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, నేతకాని వెంకటేష్, బండ ప్రకాష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రహదారుల అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు అంశాన్ని గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రారంభించిన రోడ్ల విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని గడ్కరీని కోరారు. మందమర్రి నుంచి చెన్నూర్ వరకు నూతన రహదారి వేయాలని బాల్క సుమన్ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఈ మార్గం ద్వారా దాదాపు 40 నుంచి 50 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. వెనకబడిన ప్రాంతాల నుంచి వెళ్లే ఈ మార్గంతో స్థానికంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని మంత్రికి వెల్లడించారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సుమన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంపీలందరం కలిసి కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొస్తామని ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండ ప్రకాశ్ మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment