
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు విడతల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలు, 534 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టి అదే రోజు మధ్యాహ్నం నుంచి ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. ఫలితాలు వెలువడిన 2–3 రోజుల వ్యవధిలోనే అంటే 7వ తేదీన ఎంపీపీ అధ్యక్ష పదవులకు, 8న జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నిక కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఆర్డినెన్స్‌ను జారీ చేసిన నేపథ్యంలో పరిషత్ ఓట్ల కౌంటింగ్‌ను చేపట్టేందుకు వీలు ఏర్పడింది. పరిషత్ ఫలితాలు ప్రకటించాక ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పరోక్ష పద్ధతుల్లో జెడ్పీ, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ విడిగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడ్డాక 2, 3 రోజుల్లోనే జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహణకు ఎస్‌ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎస్‌ఈసీ సవరణలు...
పరిషత్ ఫలితాలు ప్రకటించిన 40 రోజుల తర్వాత జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికలు నిర్వహిస్తే ప్రలోభాలకు అవకాశం ఉంటుందని వివిధ రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయడంతో ఈ నెల 27న కౌంటింగ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని ఎస్‌ఈసీ వాయిదా వేయడం తెలిసిందే. ఫలితాలు వెలువడ్డాక ఎక్కువ జాప్యం చేయకుండా జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నిక నిర్వహణకు వీలుగా మార్గదర్శకాల్లో సవరణ చేయాలని కోరుతూ ఎస్‌ఈసీ రాసిన లేఖపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్ట సవరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశం ద్వారా చైర్మన్ల ఎన్నిక నిర్వహించాలని, అయితే ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త చైర్‌పర్సన్లు, అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. తదనుగుణంగా గతంలోని నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. జెడ్పీలు, ఎంపీపీలను ఎన్నుకునేందుకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్లను జెడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులను ఎంపీటీసీలు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. వైస్ చైర్‌పర్సన్లు, ఎంపీపీ ఉపాధ్యక్షుల ఎన్నిక కూడా ఇదే తరహాలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment