Telangana state Election Commission
-
జనవరిలో నోటిఫికేషన్.. ఫిబ్రవరిలో తెలంగాణ పంచాయితీ ఎన్నికలు!?
హైదరాబాద్, సాక్షి: మరో నెలన్నర రోజుల్లో.. స్థానిక సంస్థల సమరంతో తెలంగాణ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా.. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతతో పాటు రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై వేగం పెంచినట్లు సమాచారం.మొత్తం మూడు ఫేజ్‌లలో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. జనవరి 14వ తేదీన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే ప్రకటించింది. అలాగే.. శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించింది. -
తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ.. మళ్లీ ఎన్నికల సందడి మొదలుకానుంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్యలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీతో ఇప్పుడున్న సర్పంచ్ల పదవీకాలం పూర్తి కానుంది. ఈ క్రమంలో.. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రక్రియను ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై గ్రామ కార్యదర్శుల్ని వివరాలు అడిగి తీసుకున్నారు అధికారులు. రాబోయే వారం పదిరోజుల్లో ఈ ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేదానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు
-
దీపావళి తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక దీపావళి పండుగ తర్వాతే జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు.. ప్రస్తుతం హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కొద్దిరోజులుగా కురుస్తున్న వానలు, పలుచోట్ల వరదలు పోటెత్తుతుండటం, వరుసగా పండుగలు రానుండడంతోపాటు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలంగాణ సహా 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం లేదు..’’ అని తెలిపింది. ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఒకటిన ఆయా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నామని వివరించింది. అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణలో ఉన్న సవాళ్లను వివరించారని.. పండుగల సీజన్ ముగిశాకే ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరారని వెల్లడించింది. అక్టోబర్ నుంచి కరోనా మూడో వేవ్ ప్రారంభం కావచ్చని కేంద్రం, పలు పరిశోధన సంస్థలు, సాంకేతిక నిపుణుల కమిటీలు అంచనా వేసిన విషయాన్ని తమ దృష్టికి తెచ్చారని పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతానికి ఉప ఎన్నికలు నిర్వహించవద్దని నిర్ణయించినట్టు ప్రకటించింది. నవంబర్ చివరివారంలోనే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురు స్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి.. వానలు తగ్గుముఖం పడతా యి. అక్టోబర్ మూడో వారంలో దసరా, నవంబర్ తొలివారంలో దీపావళి పండుగలు ఉన్నాయి. మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించిన అక్టోబర్ నెల కూడా అప్పటికి ముగిసి.. కరోనా పరిస్థితిపై స్పష్టత రానుంది. తర్వాత ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలై.. నవంబర్ చివరివారంలో లేదా డిసెంబర్ తొలివారంలో ఉప ఎన్ని కలు నిర్వహించే అవకాశం ఉంది. ఈటల రాజేం దర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆరు నెలలలోగా.. అంటే డిసెంబర్ 12 లోగా హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించాలి. ఆలోగా ‘దళితబంధు’ కొలిక్కి.. ఈసీ ప్రకటన మేరకు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రావడానికి రెండు నెలలకుపైగా సమయం ఉంది. ఆలోగా నియోజకవర్గం పరిధిలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయంతో ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు, నిధుల విడుదల జరిగాయి. ఎన్నికల షెడ్యూల్ నాటికి లబ్ధిదారులకు ఉపాధి ప్రక్రియ పూర్తి చేయనుంది. (చదవండి: KBC-13 : కేబీసీలో అనూహ్యంగా కేటీఆర్...ఎలాగంటే!) -
మున్సిపల్ ఎన్నికలు యథాతధం: ఎస్ఈసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఎన్నికలు నిర్వహించడం ప్రమాదం.. నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడమే కాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విన్నవించాలని సూచిందింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. ‘‘ఈనెల 30న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తాం. ప్రభుత్వ సూచన మేరకు యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని పార్థసారధి తెలిపారు. కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని ... ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. కాగా లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విన్నవించాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. చదవండి: మున్సి‘పోరు’: టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం -
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ గోయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్‌కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నిమించింది. కొత్త సీఈఓ కోసం ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. వారిలో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ గోయల్ పేరును ఖరారు చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం శశాంక్ గోయల్ కార్మిక శాఖ ముఖ్య కారద్యర్శిగా ఉన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో వింత పరిస్థితి..
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్టో ఓటేసే అదృష్టాన్ని లక్షల మంది నవ ఓటర్లు త్రుటిలో కోల్పోనున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనకు 2019 జనవరి 1వ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం అర్హత తేదీగా ఖరారు చేసింది. 2020 షెడ్యూల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రకటించనుంది. ఈ జాబితాను ప్రాతిపదికగా తీసుకుంటే మున్సిపల్ ఎన్నికలను మార్చిలో నిర్వహించాల్సి ఉంటుంది. మార్చి నుంచి మే వరకు వరుసగా పరీక్షలు ఉండటంతో ఎన్నికలు వాయిదా వేసుకోక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను ఎలాగైనా జనవరి/ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే 2019 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది. నోటిఫికేషన్ వరకు ఓటర్ల నమోదు.. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు కలిగి ఉండి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే నాటికి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేరు కలిగి ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు సంపాదించని, అర్హులైన పౌరులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి ఓటరుగా నమోదు చేసుకుంటే ఓటు హక్కు పొందుతారని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వార్డు/డివిజన్ల వారీగా మున్సిపాలిటీలు/కార్పొరేషన్ల ఓటర్ల జాబితాను మరో వారం రోజుల్లో ప్రకటిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత నుంచి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే తేదీ లోగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పురపోరుపై కీలక సమావేశం పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికలకు త్వరలోనే నగారా మోగించేందుకు సిద్ధమవుతున్న ఈసీ.. మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, ఎన్నికల నిర్వహణపై తదితర అంశాలపై సమీక్షించనుంది. డిసెంబర్ 16న ప్రచురించిన అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాకు అనుగుణంగా పట్టణ ఓటర్లను గుర్తించాలని ఎస్ఈసీ తాజాగా ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న ప్రచురించిన అసెంబ్లీ ఓటర్ల ముసాయిదా జాబితాకు అనుగుణంగా మున్సిపల్ ఓటర్ల జాబితాలను తయారు చేయాలని సూచించింది. ఈ జాబితా మేరకు పట్టణ ఓటర్లను గుర్తించి.. వార్డుల వారీగా జాబితాలను సరిచూసుకోవాలని స్పష్టం చేసింది. వార్డుల పునర్విభజనకు అనుగుణంగా ఓటర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పంద్రాగస్టులోపు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో జూలై 16న పురపాలక సంస్థల ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించింది. -
మున్సిపోల్స్ ఖర్చుపై ఎస్ఈసీ స్పష్టత
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్పష్టతనిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు ప్రస్తుతం ఎన్నికలు లేని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు వివరాలను ప్రకటించింది. నూతన మున్సిపల్ చట్టానికి అనుగుణంగా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో మార్పులు చేస్తూ ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్‌గా పోటీచేసే అభ్యర్థి గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్థులు రూ.1.5 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో వార్డు సభ్యులు రూ.1 లక్ష వరకు ఎన్నికల ఖర్చు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమాచారాన్ని జీహెచ్చ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారులు, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఆర్వోలు, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ తదితరులకు ఎస్ఈసీ తెలియజేసింది. -
2,166 మందిపై అనర్హత వేటు
సాక్షి. హైదరాబాద్ : ఎన్నికల ఖర్చు వివరాలు తెలియజేయడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కొరడా ఝళిపించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు చూపని 2,166 మందిపై ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయకుండా ఎస్ఈసీ అనర్హత వేటు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లోని 49 మున్సిపాలిటీల్లో 2,166 మందిని అనర్హులుగా ప్రకటించడంతో పాటు వారు మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులు కాదంటూ స్పష్టం చేసింది. వీరిలో కొందరిని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు, మరికొందరిని 2020 జూన్ 22 వరకు పోటీకి అనర్హులుగా ప్రకటించింది. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా చేసిన వ్యయంపై ఎస్ఈసీకి లెక్కలు సమర్పించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గత మున్సిపల్ ఎన్నికల అనంతరం ప్రచారంలో భాగంగా చేసిన వ్యయంపై వివరాలు సమర్పించాలని ఎస్ఈసీ అధికారులు పలుమార్లు కోరినా వారు స్పందించకపోవడంతో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన వారు గెలుపోటములతో సంబంధం లేకుండా అభ్యర్థులంతా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉండగా, పలువురు అభ్యర్థులు దీనిని పట్టించుకోలేదు. అత్యధికంగా రామగుండంలో 363 మంది.. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 363 మందిని ఎస్ఈసీ అనర్హులుగా ప్రకటించింది. బోధన్ మున్సిపాలిటీకి పోటీ చేసిన 121 మందిని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు పోటీ చేసిన 132 మందిని, కామారెడ్డి మున్సిపల్‌కు పోటీ చేసిన 97 మందిని, కోరుట్ల మున్సిపాలిటీకి పోటీ చేసిన 93, జగిత్యాల్లో పోటీ చేసిన 81 మంది, ఆదిలాబాద్ మున్సిపాలిటీకి పోటీ చేసిన 113 మందిని, నాగర్‌కర్నూల్ నగర పంచాయతీలో 93 మందిని, పరకాల నగర పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీలు) 70 మందిని ప్రస్తుత పట్టణ స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. -
మున్సిపల్ ఓటర్ల జాబితా సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో 3,355 వార్డుల ఖరారుతో పాటు, వార్డు స్థాయిల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు మంగళవారం సిద్ధమయ్యా యి. ముసాయిదా ఓటర్ల జాబితాలు ప్రచురించి, వాటిలోని అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత ఓటర్ల జాబితాలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులోని 129 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 3,149 వార్డులను ఖరారు చేసి ఓటర్ల జాబితాలను రూపొందించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిమగ్నమైంది. 21న పోలింగ్ కేంద్రాల జాబితా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వార్డుల వారీగా ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా రూపొందించి, 21న తుది జాబితాను ప్రకటించాలని గతంలోని షెడ్యూల్‌ను సవరిస్తూ ఇదివరకే ఎస్ఈసీ సర్క్యులర్‌ను జారీచేసింది. మున్సిపాలిటీలకు సంబంధించి 17న ముసాయిదా జాబితా ప్రచురణ, అదేరోజు సాయంత్రం 3 గంటలకు మున్సిపాలిటీల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 19న సాయంత్రం 5 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకారం, అదేరోజు వాటి పరిష్కారం, 19న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సమర్పణ, 21న జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో సంబంధిత మున్సిపాలిటీల్లో తుది జాబితా ప్రచు రణ జరుగుతుంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికొస్తే 17న ముసా యిదా జాబితా ప్రచురణ, అదేరోజు సాయంత్రం 3 గంటలకు ఆయా కార్పొరేషన్ల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 19న సాయంత్రం 5 వరకు క్లెయి మ్స్, అభ్యంతరాలు, సలహాల స్వీకరణ, 20న వాటి పరిష్కారం, అదేరోజు పోలింగ్ స్టేషన్ల తుదిజాబితా ను సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు సమర్పణ, 21న జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదం పొందాక పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురిస్తారు. ఏర్పాట్లు వేగవంతం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయడంలో భాగంగా మున్సిపల్ కమిషనర్లకు శిక్షణా తరగతులు సైతం పూర్తిచేసింది. ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదముద్ర వేయనున్నారు. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. తదనుగుణంగా నాలుగో వారంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ విడుదల చేసే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక 16 రోజుల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిని బట్టి వచ్చేనెల 15 లోగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రక టన, పాలకవర్గాల బాధ్యతల స్వీకారం పూర్తి కావొచ్చునని అధికారవర్గాల సమాచారం. -
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ 4న
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు విడతల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలు, 534 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టి అదే రోజు మధ్యాహ్నం నుంచి ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. ఫలితాలు వెలువడిన 2–3 రోజుల వ్యవధిలోనే అంటే 7వ తేదీన ఎంపీపీ అధ్యక్ష పదవులకు, 8న జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఆర్డినెన్స్‌ను జారీ చేసిన నేపథ్యంలో పరిషత్ ఓట్ల కౌంటింగ్‌ను చేపట్టేందుకు వీలు ఏర్పడింది. పరిషత్ ఫలితాలు ప్రకటించాక ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పరోక్ష పద్ధతుల్లో జెడ్పీ, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ విడిగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడ్డాక 2, 3 రోజుల్లోనే జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీ సవరణలు... పరిషత్ ఫలితాలు ప్రకటించిన 40 రోజుల తర్వాత జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికలు నిర్వహిస్తే ప్రలోభాలకు అవకాశం ఉంటుందని వివిధ రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయడంతో ఈ నెల 27న కౌంటింగ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని ఎస్ఈసీ వాయిదా వేయడం తెలిసిందే. ఫలితాలు వెలువడ్డాక ఎక్కువ జాప్యం చేయకుండా జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నిక నిర్వహణకు వీలుగా మార్గదర్శకాల్లో సవరణ చేయాలని కోరుతూ ఎస్ఈసీ రాసిన లేఖపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్ట సవరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశం ద్వారా చైర్మన్ల ఎన్నిక నిర్వహించాలని, అయితే ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త చైర్పర్సన్లు, అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. తదనుగుణంగా గతంలోని నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. జెడ్పీలు, ఎంపీపీలను ఎన్నుకునేందుకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో జడ్పీ చైర్పర్సన్లను జెడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులను ఎంపీటీసీలు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ ఉపాధ్యక్షుల ఎన్నిక కూడా ఇదే తరహాలో జరుగుతుంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పరిషత్ ఫలితాల వెల్లడి తేదీ ఖరారు
సాక్షి, హైదరాబాద్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముహర్తం ఖరారైంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజున ఉదయం 8 గంటలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు తెలిపింది. అంతేకాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ చైర్పర్సన్, మండల పరిషత్ అద్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరిగే పరోక్ష ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు కూడా మార్గం సుగమమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం కంటే ముందే చైర్పర్సన్లను ఎన్నుకునే వెసులుబాటు కలిగింది. కాగా, రాష్ట్రంలో మూడు దశలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14న ముగిశాయి. ఈ ఎన్నిలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 27న చేపట్టాలని ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించింది. అయితే రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు మే 27న నిర్వహించాల్సిన కౌంటింగ్‌ను ఎస్ఈసీ వాయిదా వేసింది. తాజాగా జూన్ 4 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు ప్రకటించింది. -
ఇంకా పూర్తికాని నామినేషన్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గత మంగళవారం పూర్తి కావాల్సిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ బుధవారం కూడా పూర్తి కాలేకపోయింది. పరిశీలన తర్వాత తిరస్కరించిన, ఆమోదించిన అభ్యర్థుల నామినేషన్ల జాబితాను బుధవారం రాత్రి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం ప్రకటించలేకపోయింది. ఈ జాబితాను గురువారం ప్రకటిస్తామని సీఈఓ కార్యాలయం వాట్సాప్ గ్రూప్‌లో ప్రకటించింది. మరోవైపు గురువారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొని ఉంది. నిమిషం ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించడానికి నిరాకరించిన ఎన్నికల యంత్రాంగం.. షెడ్యూల్ ప్రకారం వాటిని పరిశీలించడంలో విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటరు స్లిప్ డౌన్లోడ్ చేసుకోండిలా..!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అటు ఎన్నికల సంఘం, ఇటు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా నిరాసక్తత కనబరిచే కారణాల్లో వారి పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియకపోవడం ఒకటని భావించి వెబ్సైట్నుంచి, మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటరు స్లిప్‌లను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (http://tsec.gov.in)లోకి వెళ్లాలి. అందులో.. ♦ ‘డౌన్లోడ్ ఓటర్ స్లిప్’ పై క్లిక్ చేయాలి. ♦ డౌన్లోడ్ జీహెచ్ఎంసీ ఓటరుస్లిప్ అని వస్తుంది. ♦ సర్కిల్, వార్డు, డోర్‌నెంబరు, పేరు, ఎపిక్ నెంబరు (ఓటరు గుర్తింపుకార్డు నెంబరు) ఎంటర్ చేయగానే ఓటరు వివరాలతో కూడిన స్లిప్వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ♦ ఎపిక్ కార్డులేని పక్షంలో సర్కిల్, వార్డులను ఆయా కాలమ్‌లలో భర్తీ చేశాక డోర్‌నెంబరు, పేరు వివరాల్లో ఏ ఆప్షన్‌ను పేర్కొన్నా సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు తెలిస్తే ఇంకా మంచిది. ♦ ఓటరు జాబితాలో కచ్చితంగా ఏపేరు ఉందో తెలిస్తే సదరు ఆప్షన్‌పై టిక్ చేసినా ఓటర్లు స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. లేని పక్షంలో పేరులోని తొలి అక్షరాలు కొన్ని చేసినా సదరు అక్షరాలతో ప్రారంభమయ్యే ఓటర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిల్లో కావాల్సిన వారి పేరు, వివరాలు చూసుకోవాలి. ఎవరి ఓటరు స్లిప్ కావాలో ఆపేరు వరుసలో ఉన్న ‘ప్రింట్ ఓటరు స్లిప్’పై క్లిక్ చేస్తే ఎపిక్ నెంబరు వివరాలతో కూడిన స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ♦ స్మార్ట ఫోన్ ఉన్నవారు గూగుల్ ప్లేస్టోర్‌నుంచి టీఎస్ ఎలక్షన్ కమిషనర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, అందులో ఎపిక్ నెంబరును ఎంట్రీ చేస్తే వివరాలొస్తాయి. ♦ నగర ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.