
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) స్పష్టతనిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు ప్రస్తుతం ఎన్నికలు లేని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు వివరాలను ప్రకటించింది. నూతన మున్సిపల్ చట్టానికి అనుగుణంగా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో మార్పులు చేస్తూ ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కార్పొరేటర్‌గా పోటీచేసే అభ్యర్థి గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.
మిగతా మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్థులు రూ.1.5 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో వార్డు సభ్యులు రూ.1 లక్ష వరకు ఎన్నికల ఖర్చు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమాచారాన్ని జీహెచ్‌చ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారులు, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఆర్వోలు, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ తదితరులకు ఎస్‌ఈసీ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment