సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్టో ఓటేసే అదృష్టాన్ని లక్షల మంది నవ ఓటర్లు త్రుటిలో కోల్పోనున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనకు 2019 జనవరి 1వ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం అర్హత తేదీగా ఖరారు చేసింది.
2020 షెడ్యూల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రకటించనుంది. ఈ జాబితాను ప్రాతిపదికగా తీసుకుంటే మున్సిపల్ ఎన్నికలను మార్చిలో నిర్వహించాల్సి ఉంటుంది. మార్చి నుంచి మే వరకు వరుసగా పరీక్షలు ఉండటంతో ఎన్నికలు వాయిదా వేసుకోక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను ఎలాగైనా జనవరి/ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే 2019 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది.
నోటిఫికేషన్ వరకు ఓటర్ల నమోదు..
2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు కలిగి ఉండి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే నాటికి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేరు కలిగి ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు సంపాదించని, అర్హులైన పౌరులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి ఓటరుగా నమోదు చేసుకుంటే ఓటు హక్కు పొందుతారని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వార్డు/డివిజన్ల వారీగా మున్సిపాలిటీలు/కార్పొరేషన్ల ఓటర్ల జాబితాను మరో వారం రోజుల్లో ప్రకటిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత నుంచి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే తేదీ లోగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
పురపోరుపై కీలక సమావేశం
పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికలకు త్వరలోనే నగారా మోగించేందుకు సిద్ధమవుతున్న ఈసీ.. మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, ఎన్నికల నిర్వహణపై తదితర అంశాలపై సమీక్షించనుంది. డిసెంబర్ 16న ప్రచురించిన అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాకు అనుగుణంగా
పట్టణ ఓటర్లను గుర్తించాలని ఎస్‌ఈసీ తాజాగా ఆదేశించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న ప్రచురించిన అసెంబ్లీ ఓటర్ల ముసాయిదా జాబితాకు అనుగుణంగా మున్సిపల్ ఓటర్ల జాబితాలను తయారు చేయాలని సూచించింది. ఈ జాబితా మేరకు పట్టణ ఓటర్లను గుర్తించి.. వార్డుల వారీగా జాబితాలను సరిచూసుకోవాలని స్పష్టం చేసింది. వార్డుల పునర్విభజనకు అనుగుణంగా ఓటర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పంద్రాగస్టులోపు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో జూలై 16న పురపాలక సంస్థల ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment