ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గురువారం మహానాడు జరుగనుంది. ఈమహానాడులో మొత్తం 8 తీర్మానాలపై నేతలు చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపే ఎండగట్టడం తదితర అంశాలపై చర్చలు సాగనున్నాయి. ఈ నేపధ్యంలో టీటీడీపీ నేతలు ఎల్ రమణ, రావు చంద్రశేఖర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఇతర నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళలర్పించి అనంతరం మహానాడుకు బయల్దేరారు.
ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ..‘17 పార్లమెంట్ స్థాయి, రెండు జిల్లా స్థాయి మహానాడులు నిర్వహించాం. నేడు 8లక్షల మంది కార్యకర్తలు, నాయకులందరి సాక్షిగా తెలంగాణ మహానాడు జరుగుతోంది. దేశంలోనే సెక్రటేరియట్‌కు రానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. సెక్రటేరియట్‌కు రాకుండా ఇంటి నుంచి పాలన వల్ల పరిపాలన గాడి తప్పింది. సీఎం రాకపోవటంతో అజమాయిషీ లేకుండా పాలన పడకేసింది. ప్రగతిభవన్ పైరవీభవన్‌గా మారిపోయింది. టీడీపీ వల్లనే పేదవాళ్లకు న్యాయం జరగుతుంది’ అని తెలిపారు. కాగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లోని పార్టీ నాయకులు భారీగా మహానాడుకు తరలివచ్చారు.
పూర్వ వైభవానికి కృషి
35 ఏళ్లుగా మహానాడు ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా 27, 28, 29 లో విజయవాడలో మహానాడు నిర్వహిస్తున్నట్టు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రమణ నాయకత్వంలో తెలుగు దేశం మహానాడు జరుగుతోందని, అనేక తీర్మానాలతో పాటు, భవిష్యత్ కార్యచరణ రూపొందించుకుంటామన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ సుస్థిరంగా తెలుగు వారి గుండెల్లో నిలిచి పోయిందని తెలిపారు. తెలంగాణ మహానాడుకు వెళ్లేముందు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి ఆయన ఆశయాలు అభ్యర్థించేందుకు ఘాట్‌కు వచ్చామన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు అండదండలతో తెలంగాణలో తెలుగుదేశం పూర్వ వైభవానికి కృషిచేస్తామని పేర్కొన్నారు.
ముఖ్య అతిథిగా చంద్రబాబు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే మహానాడు చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకుని మహానాడులో పాల్గొంటారు. విజయవాడ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గాన మహానాడుకు చేరుకుంటారు. దాదాపు 5 గంటల పాటు మహానాడులో ఉండనున్న చంద్రబాబు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ, పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment