మావల జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేస్తున్నటీఆర్‌ఎస్ అభ్యర్థి
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల్లోనూ త్రిముఖ పోటీయే కనబడుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యనే వార్ నెలకొననుంది. సాధారణంగా ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని పార్టీల్లో అసంతృప్తులు, స్వతంత్ర అభ్యర్థులు అధికంగా బరిలో ఉండే వారు. అయితే ప్రధాన పార్టీల నుంచి పోటీ కనిపిస్తుండగా, మిగతా నామమాత్రమే అయింది. గురువారం ప్రాదేశిక ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఘట్టానికి తెర పడింది. ఆరు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు మే 6న జరగాల్సి ఉండగా, ఈ మండలాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి అన్నిచోట్ల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఒకట్రెండు చోట్ల టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు రంగంలో ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అభ్యర్థుల ఎంపికలో కసరత్తు..
రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తీవ్రంగా కసరత్తు చేశారు. ప్రధానంగా బుధవారం నామినేషన్లకు చివరి రోజు అయినా మంగళవారం వరకు ఆయా మండలాల నుంచి పార్టీల అభ్యర్థులు ఎవరనేది స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో అసలు పోటీలో ఎవరుంటారనేది ఆసక్తి కలిగించింది.
ఆదిలాబాద్‌రూరల్ మండలం: ఆదిలాబాద్‌రూరల్ మండలంలో జెడ్పీటీసీ జనరల్ రిజర్వేషన్ కాగా టీఆర్‌ఎస్ నుంచి మార్కెట్ కమిటీ తాజా మాజీ చైర్మన్ ఆరె రాజన్న, బీజేపీ నుంచి రిటైర్డ్ ఉపాధ్యాయుడు దారట్ల జీవన్, కాంగ్రెస్ పార్టీ నుంచి మడావి హన్మంత్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా మడావి హన్మంత్‌రావు తండ్రి మడావి రాజు బీజేపీ నుంచి తిరిగి సొంతగూటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తండ్రి, తనయులు కాంగ్రెస్‌లో చేరిన వెంటనే హన్మంత్‌రావు పేరును కాంగ్రెస్ ఖరారు చేయడం గమనార్హం. మడావి రాజు లోక్‌సభ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. ఇక టీడీపీ నుంచి ఆకుల రాము, సీపీఐ(ఎం) నుంచి ఆత్రం కిష్టన్న, సీపీఎం నుంచి పెందూర్ రాములు, స్వతంత్రులుగా కె.రాజేశ్వర్, ఎ.వినోద్‌కుమార్ నామినేషన్ వేశారు.
మావల మండలం: మావల జెడ్పీటీసీ స్థానం ఎస్సీ(మహిళ) రిజర్వ్ కాగా, టీఆర్‌ఎస్ నుంచి నల్ల వనిత, కాంగ్రెస్ నుంచి ధర్మపూరి నాగలత, బీజేపీ నుంచి ఎంబటి ప్రమిళ, టీడీపీ నుంచి గాలిపెల్లి ప్రియాంకలు బరిలో నిలిచారు.
జైనథ్ మండలం: జైనథ్ జెడ్పీటీసీ జనరల్(మహిళ) రిజర్వ్ కాగా, టీఆర్‌ఎస్ నుంచి తుమ్మల అరుంధతి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి గడ్డం మమతారెడ్డి, బీజేపీ నుంచి బోయర్ షాలున, స్వతంత్ర అభ్యర్థిగా జి.సౌందర్య నామినేషన్ వేశారు.
బేల మండలం: బేల జెడ్పీటీసీ జనరల్(మహిళ) రిజర్వ్ కాగా, టీఆర్‌ఎస్ నుంచి అక్షిత పవార్, కాంగ్రెస్ నుంచి నాక్లే సవిత, బీజేపీ నుంచి ఠాక్రే వర్ష, టీడీపీ నుంచి ఉధార్ వనిత బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ డమ్మి అభ్యర్థిగా పవార్ నానుబాయి నామినేషన్ దాఖలు చేశారు. కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ఆ పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ జెడ్పీటీసీ స్థానం గతంలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఇక్కడ గెలువాలని టీఆర్‌ఎస్ ఆర్థికంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది. ఇక బీజేపీ సీనియర్ నేత కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపారు. ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది.
తాంసి మండలం: తాంసి జెడ్పీటీసీ స్థానం జనరల్ రిజర్వ్ కాగా, టీఆర్‌ఎస్ నుంచి తాటిపల్లి గంగాధర్, కాంగ్రెస్ నుంచి కౌడాల నారాయణ, బీజేపీ నుంచి సామ సంతోష్‌రెడ్డి, సామ కవిత ఇరువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఇప్పటి వరకు బీ–ఫాం ఇవ్వకపోవడం గమనార్హం. బీజేపీ నుంచి ఇరువురు నామినేషన్లు వేసినా బీ–ఫాం ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా బెల్లూరి భీమన్న బరిలో నిలిచారు. కాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సోదరుడు రామారావు రాథోడ్ ఇక్కడి నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరిగినా ఆయన నామినేషన్ వేయకపోవడంతో ఈ ప్రచారానికి తెరపడింది. అయితే తాటిపెల్లి గంగాధర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అనుచరుడిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరగణాలు రెండు గ్రూపులుగా ఉన్న విషయం విధితమే.
భీంపూర్ మండలం: భీంపూర్‌లో జెడ్పీటీసీ ఎస్టీ(జనరల్) కాగా, ఇక్కడ టీఆర్‌ఎస్ నుంచి కుమ్రం సుధాకర్, కాంగ్రెస్ నుంచి మెస్రం హన్మంత్, బీజేపీ నుంచి మరప భరత్, టేకం బోన్, స్వతంత్ర అభ్యర్థిగా ఎం.నామ్‌దేవ్ వేశారు. అయితే బీజేపీ నుంచి ఇద్దరిలో ఎవరికి బీ–ఫాం ఇస్తారో ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది.
ఎంపీటీసీకి జోరుగా నామినేషన్లు
ఎంపీటీసీ స్థానాలకు కొన్ని మండలాల్లో జోరుగా నామినేషన్లు వచ్చాయి. జైనథ్‌లో 14 స్థానాలకు గాను 71 నామినేషన్‌లు దాఖలయ్యాయి. బేలలో 11 స్థానాలకు గాను 63 రావడం గమనార్హం. మిగతా మండలాల్లో స్థానాల సంఖ్యకు ప్రధాన పార్టీల నుంచిపోను కొంత స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు.
నేడు నామినేషన్ల పరిశీలన..
నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. గురు వారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. 26న అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. 28న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఇక ఈ ఆరు మండలాల్లో ప్రచారం జోరందుకోనుంది. మే 6న ఎన్నికలు జరగనుండగా ఇక అభ్యర్థులు ఎవరనేది తేట తెల్లం కావడంతో పార్టీలు ప్రచారంలో వేగం పెం చనున్నాయి. కాగా రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment