
లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు
అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు టీఆర్‌ఎస్‌కు చెందిన రెండు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. క్యాంపు నుంచి నేరుగా అలంపూర్‌కు వచ్చిన ఓ వర్గం ఎంపీటీసీ సభ్యులను మరోవర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అలంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. మొదటి రోజు శుక్రవారం కోరం లేక ఎన్నిక వాయిదా పడటంతో రెండోరోజు అధికారులు ఈ ప్రక్రియను కొనసాగించారు.
అలంపూర్ మండలంలోని ఆరు ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఎంపీపీ పీఠం కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఒకవర్గం బుక్కాపురం ఎంపీటీసీ సభ్యురాలు రూపాదేవిని ఎంపీపీగా ఎన్నుకోవాలని.. మరోవర్గం కాశీపురం ఎంపీటీసీ సభ్యురాలు పింజరి బేగంను ఎంపీపీని చేయాలని పట్టుబడుతున్నాయి. ఒక్కో వర్గంలో ముగ్గురు చొప్పున ఎంపీటీసీలు విడిపోయారు. కానీ కో–ఆప్షన్ ఎన్నిక తర్వాత ఒక వర్గంలో నలుగురు ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు నిర్వహించారు. మరోవర్గంలో ఇద్దరు ఎంపీటీసీలు మాత్రమే మిగిలారు. రెండోరోజు ఎంపీపీ ఎన్నికకు ఇద్దరు ఎంపీటీసీలు ఉన్న వర్గం ముందుగా చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత నలుగురు ఎంపీటీసీలు ఉన్న వర్గంలో అందరూ మహిళలు కావడంతో ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగులు ధరించారు.
వీరితోపాటు మరికొందరు ముసుగులు ధరించి ఎంపీడీఓ కార్యాలయానికి ఓ వాహనంలో చేరుకున్నారు. దీంతో వారిని మరోవర్గం వారు అడ్డుకున్నారు. పోలీసులు వారించే ప్రయత్నం చేస్తున్నా జెడ్పీటీసీ సభ్యురాలు షంషాద్ ఇస్మాయిల్ భర్తపై దాడికి దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేసి ఎంపీటీసీలను ఒక్కొక్కరిని లోపలికి పంపించారు. చివరకు కాశీపురం ఎంపీటీసీ సభ్యురాలు పింజరి బేగం ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా క్యాతూర్ ఎంపీటీసీ సభ్యురాలు అనురాధ ఎన్నికయ్యారు. గొడవ సమాచారం అందుకున్న ఎస్పీ లక్ష్మీనాయక్, ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ షాకీర్‌హుస్సేన్ అలంపూర్ చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment