
టీడీపీ-జనసేనల మధ్య సీట్ల సర్దుబాటుపై.. టీజీ వెంకటేశ్
సాక్షి, హైదరాబాద్ : ‘జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఏమనవద్దు’ అని రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు తమ నేతలకు స్పష్టమైన ఆదేశాలివ్వగా.. తాజాగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఏకంగా టీడీపీ-జనసేనలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు–పవన్‌ల రహస్య స్నేహం మరోసారి బయటపడింది. బుధవారం టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ-జనసేనల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటని పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఉంటాయని, టీడీపీ-జనసేనలు కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు.
సీఎం చంద్రబాబును కలిసి వచ్చిన తరువాతే వెంకటేశ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు పొడిచిందని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ అనేక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబుపై కక్ష సాధించేందుకే టీఆర్‌ఎస్ నేతలు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. మరోవైపు పవన్ కల్యాణ్ ప్రజాయాత్రకు బ్రేక్ పడటం కూడా పొత్తులో భాగమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.