సాక్షి, శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్ కేసులో తన, తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేవిధంగా కూన రవికుమార్ ప్రవర్తించడం.. ఇందుకు సంబంధించి ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా ఆధారాలు దొరికాయన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఆయనపై కేసు పెట్టారని..ప్రస్తుతం చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ రాజకీయం తగదని సూచించారు. అధికార్లను బెదిరించిన చరిత్ర ఆ పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌కు ఉందని విమర్శించారు. అటువంటి వాళ్లు ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
కాగా టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ఎంపీడీఓ కార్యాలయంలోకి జొరబడి ప్రభుత్వ అధికారులపై దుర్భాషలాడినందుకు గానూ ఆయనతోతో పాటు 11 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అఙ్ఞాతంలో ఉన్న కూన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషిన్ పెట్టినట్లు సమాచారం. ముందస్తు బెయిల్ మంజూరు అయితేనే ఆయన బయటకు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆయన గృహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు అగ్రనేతలు పరామర్శలకు వచ్చి వెళ్తున్నారు. కూన రవికుమార్‌తోపాటు మరో ముద్దాయి అంబళ్ల రాంబాబు కూడా పరారీలో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment