నటించే నాయకుడు కేసీఆర్‌ | There Is No Moral Right To Contest Elections To Kcr : Jaipal reddy | Sakshi
Sakshi News home page

నటించే నాయకుడు కేసీఆర్‌

Published Fri, Jun 1 2018 11:14 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

There Is No Moral Right To  Contest Elections To Kcr : Jaipal reddy - Sakshi

చౌదరిగూడలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతున్న జైపాల్‌రెడ్డి

కొందుర్గు(షాద్‌నగర్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమయానుకూలంగా నటించే నాయకుడని మాజీ ఎంపీ జైపాల్‌రెడ్డి అన్నారు. కొందుర్గు మండలం జిల్లేడ్‌చౌదరిగూడ మండల కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి, అమోదం పొందడానికి కృషిచేసింది తానేనని, ఇందులో ఏమైన తప్పు ఉంటే చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పార్లమెంట్‌లో బిల్లు అమోదం పొందిన అనంతరం కేసీఆర్‌ తన కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి సోనియాగాంధీ ఆశీస్సులు తీసుకొని తాను తెలంగాణకు కాపలా కుక్కలా ఉండానని తెలుపలేదా అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని దళితులను మోసం చేశాడన్నారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తేనే 2019 ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించారని, కానీ, ఇప్పటివరకు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు.

కేసీఆర్‌ కేబినెట్‌లో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. నోట్లు మార్పిడి చేసి పేద ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. పెట్రోల్‌పై సుంకం తగ్గించి పేద ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు. 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో రూ. 73 వేల కోట్ల బకాయి రుణాలు మాఫి చేశామన్నారు. అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ రెగ్యులర్‌గా రుణాలు చెల్లించే రైతులకు కూడా 5 వేల కోట్లతో మాఫీ చేశారని గుర్తుచేశారు.

ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. పెట్రోల్‌ ధర పెంచేది రూపాయల్లో.. తగించేది ఒక్క పైసనా..అని ప్రశ్నించారు. ఇక బీజేపీ భవిష్యత్‌ శూన్యమని, కేసీఆర్‌ది కూడా అంతేనని అన్నారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పింది ఏదీ చేయడని, ఆయన మాటలు అబద్దాల మూటలని విమర్శించారు. రైతులకు ముష్టి నాలుగు వేలు ఇవ్వడం కాదని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అప్పట్లో తెలంగాణ సొమ్ము ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారని, ఉద్యోగాలు ఆంద్రోళ్లకు పోతున్నాయని చెప్పిన కేసీఆర్‌.. కృష్ణ జలాలను ఇంకా ఆంధ్రకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టులు ఇస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌ మ్యానిఫెస్టో అబద్దాల పుట్ట అని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని యువతను మోసం చేశాడన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏకకాలంలో లక్ష రూపాయల వరకు మాఫీ చేసిందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయని విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సుధాకర్‌రావు, కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బంగారు స్వరూప, నాయకులు బుజ్జినాయక్, శంకర్‌గౌడ్, దామోదర్‌రెడ్డి, బాల్‌రాజ్, సయ్యద్‌ సాదిక్, శివలీల, నాగమణి, విజయలక్ష్మి, చంద్రశేఖర్, పురుషోత్తంరెడ్డి, మధు, రాములు, రమేష్, శేఖర్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement