
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించేదే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న పోరాటం మున్ముందు మరింత ఉధృతం చేయాలని.. అదే మన శ్వాస, మన ఊపిరి అని పార్టీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. హోదా పోరాటంలో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్రకు విరామం ఇచ్చిన వైఎస్ జగన్.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి సమీపంలో బస చేసిన శిబిరం నుంచే ఆందోళన కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఆయా జిల్లాల పార్టీ బాధ్యులతో మాట్లాడి ధర్నాలు జరిగిన తీరును తెలుసుకున్నారు. అన్ని జిల్లాలలో ధర్నాలు విజయవంతం అయ్యాయని పార్టీ నేతలు జగన్‌కు వివరించారు. ధర్నాలు విజయవంతం చేసిన అందరికీ జగన్ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఇదే స్ఫూర్తిని ప్రదర్శించడంతో పాటు కలిసొచ్చే వారందర్నీ సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేయాలని పార్టీ నాయకత్వానికి జగన్ విజ్ఞప్తి చేశారు.
5న ఢిల్లీలో ధర్నాకు ఏర్పాట్లు: ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఈనెల 5న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ధర్నాకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 3వ తేదీన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారు. పార్లమెంటు బయట, లోపల ఆందోళనను ఉధృతం చేసేలా ఆందోళనా కార్యక్రమాలను పార్టీ రూపొందించింది. ఈ ఆందోళనలకు దిగి రాకపోతే ఆఖరి అస్త్రంగా పార్టీ పార్లమెంటు సభ్యులు ఏప్రిల్ 6న తమ సభ్యత్వాలకు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment