కేంద్రం నుంచి వైదొలగడమే తొలి అస్త్రం కావాలి | YS Jaganmohan Reddy fires on CM Chandrababu in Addanki | Sakshi
Sakshi News home page

కేంద్రం నుంచి వైదొలగడమే తొలి అస్త్రం కావాలి

Published Mon, Mar 5 2018 1:23 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YS Jaganmohan Reddy fires on CM Chandrababu in Addanki - Sakshi

పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆదివారం జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఒక భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగడమే తొలి అస్త్రం కావాలి. చంద్రబాబేమో అది చివరి అస్త్రం అంటున్నారు. అలాగైతే ఎప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు..? ఎప్పుడు రాజీనామాలు చేస్తారు..? నాలుగేళ్లుగా కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించారు. ఇది సరిపోదన్నట్లు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ఆ పదవులను పట్టుకుని ఇంకా వేలాడుతున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనం’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 103వ రోజు ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వ్యవహారంలో చంద్రబాబు రోజుకో మాట.. పూటకో అబద్ధం చెబుతున్నారని, ఊసరవెల్లికే ట్యూషన్లు చెప్పేలా తయారయ్యారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. 5న (నేడు) ఢిల్లీలో ధర్నా చేస్తామని, 21న అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. చంద్రబాబు పార్ట్‌నర్‌ (పవన్‌ కళ్యాణ్‌) ఆయనతో మాట్లాడి మద్దతు కూడగట్టాలని విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అవినీతి పాలన సాగిస్తూ.. లంచాలు దిగమింగి ఇప్పుడు అమాయకత్వాన్ని నటిస్తున్నారన్నారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

హోదా కోసం ఎందాకైనా... 
‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 1న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసింది. 3న పార్టీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. 5న ఢిల్లీలో హోదా కోసం ధర్నా చేయబోతున్నారు. మంగళవారం నుంచి పార్లమెంట్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తారు. అప్పటికీ కేంద్రం దిగి రాకపోతే మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం పెడతాం. అయినా కేంద్రం స్పందించకపోతే ఏప్రిల్‌ 6న పార్టీ ఎంపీలు రాజీనామా చేసి వాళ్ల ముఖాన కొట్టి రాష్ట్రానికి వస్తారు. చంద్రబాబు పార్ట్‌నర్‌కు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసానికి టీడీపీ ఎంపీల మద్దతు కూడగట్టాలి. మొత్తం 25 మంది ఏపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగిరాదా? నిన్న ఆయన పత్రికలో చూసినట్టు గుర్తు.. అవిశ్వాసానికి చంద్రబాబు ముందుకు రారట.. రాజీనామాలకూ ముందుకు రారట. కేంద్ర మంత్రి వర్గం నుంచి తన మంత్రుల్ని ఉప సంహరించడం ఆఖరి అస్త్రమట. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. హోదా ఉంటే ఆదాయపన్ను, జీఎస్టీ మినహాయింపు, కరెంటు రాయితీలుంటాయి. అవి ఉంటే ఎవరైనా వచ్చి పరిశ్రమలో, హోటళ్లో, ఆస్పత్రులో పెడతారు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు. పూటకో మాట, రోజుకో నాటకం ఆడుతున్నారు. ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి కనుక హోదా కోసం తొలి అస్త్రంగా కేంద్రం నుంచి వైదొలుగుతూ మంత్రులు రాజీనామా చేయాలి.   

ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా ఎక్కడ? 
ఈ ఏడాది ఖరీఫ్, రబీలలో కలిపి 32 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. రబీలో అయితే అక్టోబర్, నవంబర్‌లో కురవాల్సిన వర్షాలు కురవలేదు. జనవరిలో చుక్కవాన లేదు. దీంతో వర్షపాతం లోటు రబీలో 95 శాతం దాటింది. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో రైతులున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ముందుకు వచ్చి ఆదుకుంటాడు. కానీ మన ఖర్మ ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ఇవేవీ పట్టవు. ఖరీఫ్‌లో కరవు వస్తే రబీ సీజన్‌కు అయినా ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పించి తోడుగా నిలవాలి. కానీ ఈ పెద్ద మనిషి ఆ ఆలోచన చేయడు.  ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని దుస్థితి. నాలుగేళ్లుగా ఇదే తీరు. ఇందులోనూ రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకుంటాడు. కందులు, శనగలకు గిట్టుబాటు ధర రాలేదని జగన్‌ అంటున్నాడు గనుక నామ్‌కే వాస్తేగా కందులు కొనండని మార్కెటింగ్‌ అధికారులను ఆదేశిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చాడు. రైతులు మార్కెట్‌కు వెళితే రూ.5,450 కనీస మద్దతు ధరకు కొనాల్సిన కందుల్ని రూ.4 వేలకు మించి కొనడం లేదు. రైతులు కష్టపడుతూ మార్కెట్‌కు వెళితే కేవలం 2 బస్తాలే కొంటున్నారు. అందులోనూ తేమ శాతం ఎక్కువగా ఉందని కోతలు పెడుతున్నారు. దీంతో రైతులు తిరిగి దళారుల్నే ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడా తెలుగుదేశం దళారులే.రైతుల నోట మట్టికొడుతున్నారు. అసలీ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?  

అంచనాలు పెంచుకున్నా పనులు చేయలేదు..
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు టెంకాయలు కొట్టి శంకుస్థాపనలు చేశాడు. ఆతర్వాత పట్టించుకోలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.579 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి పూర్తి చేసి జాతికి అంకితం చేశాడు. ఆ తర్వాత ఆయన మన మధ్య లేకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో మిగిలిపోయిన కాల్వ పనులను పూర్తి చేయలేకపోయాడు. కుడి కాల్వ కింద 52 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే చివరి 5 వేల ఎకరాలకు, ఎడమ కాల్వ కింద ఉన్న 28 వేల ఎకరాల ఆయకట్టులో 12 వేల ఎకరాలకు నీరు అందని పరిస్థితి. రూ.13 కోట్లతో అయిపోయే ఈ పనులకు చంద్రబాబు తన లంచాల కోసం అంచనాలను రూ.161 కోట్లకు పెంచినా ఇంత వరకు పనులు చేయలేదు. లంచాల మీద తప్ప నీళ్లు ఇద్దామనే ధ్యాసే లేదు. ఈ ప్రాంత ప్రజల కల భవానాశి రిజర్వాయర్‌. దివంగత నేత వైఎస్సార్‌ ఆనాడు రూ.170 కోట్లతో ఈ రిజర్వాయర్‌ను తలపెట్టి భూ సేకరణ కూడా పూర్తి చేస్తే ఈ నాలుగేళ్లలో చంద్రబాబు దాన్ని అసలు మరిచే పోయాడు. ఏదన్నా చెబితే దున్నపోతు ముందు శంఖం ఊదినట్టే ఉంది.  

ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తెస్తాం 
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అస్తవ్యస్తమైన ఆరోగ్యశ్రీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం.  మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి పేదవానికీ ఉచితంగా ఎంత పెద్ద ఆపరేషనైనా.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలలో ఎంతటి పెద్ద ఆస్పత్రిలోనైనా చేయించుకునేలా ఆరోగ్యశ్రీని ఆధునీకరిస్తాం. రూ.1000 ఖర్చు దాటే ప్రతి వ్యాధిని ఆరోగ్య శ్రీ కిందికి చేర్చి ఉచితంగా వైద్యం చేయిస్తాం. చికిత్స అనంతరం డాక్టర్ల సలహా మేరకు తీసుకునే విశ్రాంతి సమయానికీ డబ్బులు ఇస్తాం. కిడ్నీ, తలసీమియా వ్యాధులతో బాధపడే వారికి రూ.10 వేల పెన్షన్‌ ఇస్తాం. చెవిటి, మూగ పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ వంటి ఆపరేషన్‌ చేయించాలంటే రూ.ఆరేడు లక్షలు ఖర్చు అవుతుంది. మన ప్రభుత్వం రాగానే ఈ ఆపరేషన్లను ఉచితంగా చేయిస్తాం. పేదల కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా నేను రెండడుగులు ముందుకు వేస్తాను.  

నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, మోసాలు 
బాబు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, మోసాలు. ఇటువంటి నాయకుడు మనకు అవసరమా? ఆలోచించండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ రావాలి. ఎవరైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని ఏదయినా చెప్పి చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి పోయే పరిస్థితి రావాలి. మోసాలు, అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని క్షమిస్తే రేప్పొద్దున పెద్ద పెద్ద మోసాలు చేస్తారు. ఇదే చంద్రబాబు మీ ముందుకు వచ్చి.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, ఇంటికో బెంజికారు అంటారు. వాటినీ నమ్మరనుకుంటే ఒక్కొక్కరికీ రూ.3 వేలు డబ్బు ఇస్తామంటారు. రూ.3 వేలు ఇస్తామంటే రూ.5 వేలు గుంజండి. అదంతా మన జేబులు కత్తిరించి దోచిన సొమ్మే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి. అబద్ధాలు, మోసాలు చేసే వ్యక్తులను బంగాళాఖాతంలో కలపాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. ఈ పని జగన్‌ ఒక్కడి వల్లే కాదు. మీ అందరి సహాయ సహకారాలు, ఆశీర్వాదాలు, దీవెనలు కావాలి’’ అని జగన్‌ అన్నారు. 

అనగనగా ఓ కొండచిలువ..  
చంద్రబాబు గారి గిమ్మిక్కులు, నాటకాలు చూస్తుంటే ఒక కథ గుర్తుకు వస్తోంది. ఆ కథ ఏమిటంటే.. అనగనగనగా ఒక మంచి మనిషి ఉన్నాడంట. ఒకసారి అనుకోకుండా అతను ఉన్న ప్రాంతంలో వరదలు వచ్చాయి. అప్పుడు తన దగ్గర ఉన్న పశువులు, మేకలు, కోళ్లను తీసుకొని పైతట్టు ప్రాంతానికి వెళుతుండగా ఒక కొండ చిలువ వరద నీళ్లలో కొట్టుకుపోతూ కనిపించింది. కొండచిలువ అని తెలిసినా అయ్యోపాపం అనుకుని అతను దానిని కాపాడాడు. ఆ తర్వాత దానిని తన దగ్గరే పెట్టుకొని సాకడం మొదలు పెట్టాడు. కొండచిలువ తన బుద్ధిని పోనిచ్చుకుంటుందా? ఆ మంచి మనిషి దగ్గర ఉన్న మేకలు, కోళ్లను ఆ మనిషి చూడనప్పుడు తినడం మొదలుపెట్టింది. ఏరకంగా అయితే చంద్రబాబు ఆ తొమ్మిదేళ్లలో ప్రజలను పీల్చి పిప్పి చేశాడో అదేమాదిరి. ఏందబ్బా.. నేను కొండచిలువను తొమ్మిదేళ్లు ఆదరిస్తే నాకున్న కోళ్లు, మేకలను తినేస్తోందని ఆ మనిషికి విసుగెక్కి ఆ కొండచిలువను బహిష్కరించాడు.

ఆ తర్వాత అది పదేళ్లు కనపడలేదు. నేను మారిపోయాను, నన్ను క్షమించేసెయ్‌.. నన్ను నీదగ్గరే పెట్టుకో అని పదేళ్ల తర్వాత అది ఆ మనిషి దగ్గరకు వచ్చింది. పాపం ఆయన దానిని నమ్మాడు. చంద్రబాబును నమ్మి 2014లో అధికారం అప్పగించినట్లు. కొండచిలువ  ఈసారి ఆ మంచి మనిషి దగ్గర ఉన్న మేకలు, కోళ్లనే కాకుండా ఆవులను, ఆవుదూడలను కూడా తినడం మొదలు పెట్టింది.  రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి.. రాజధాని భూములతో చంద్రబాబు అవినీతి చేసినట్లన్నమాట. దీంతో మంచి మనిషికి కొండచిలువపై విసుగుపుట్టి ఏదోఒకటి చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు ఆ కొండచిలువ ఆ మంచి మనిషిని విపరీతంగా ప్రేమిస్తున్నట్లు నటించడం మొదలు పెట్టింది. మనిషి రాగానే చుట్టూ పెనవేసుకుని ముఖం మీద నాకేది. కొండచిలువ ఎందుకింత ప్రేమ చూపిస్తోందనుకున్నాడు.  ఇప్పుడు ఏ విధంగా చంద్రబాబు ప్రేమను చూపిస్తున్నాడో అలా.. రేషన్‌ కార్డు అందటం లేదా.. అయ్యోనాకు ఇప్పుడే తెలిసింది. పెన్షన్‌లు అందటం లేదా అయ్యో నాకు ఇప్పుడే తెలింది.

ఆరోగ్యశ్రీ హైదరాబాద్‌లో అమలు కావడం లేదా.. నాకు ఇప్పుడే నా దృష్టికొచ్చింది. మీకు ప్రత్యేక హోదా రాలేదా? 14వ ఆర్థిక సంఘం అలా చెప్పలేదా? నాకు ఇప్పుడే తెలిసిందని ఏరకంగా చంద్రబాబునాయుడు విపరీతమైన దొంగప్రేమ చూపిస్తున్నాడో ఆమాదిరిగా కొండచిలువ దొంగప్రేమ చూపించింది. ఒకరోజు కొండచిలువ ఉన్నట్లుండి పూర్తిగా తినడం మానేసిందంట. చంద్రబాబు అంటుంటారు చూశారా... వారానికి ఏడు రోజుల నుంచి ఎనిమిది రోజులు నేను కష్టపడుతున్నాను, రోజుకు 24 గంటలు ఉంటే 25 గంటలు కష్టపడుతున్నానని చెబుతున్నాడు కదా అలాగ. పాపం మంచి మనిషి కావడంతో కొండచిలువను డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్‌ దానిని పరీక్షించి.. ‘అయ్యా.. నువ్వు మంచి మనిషివి కాబట్టి కొండచిలువ ఈ విధంగా చేస్తోంది. ఇది మాయదారి కొండచిలువ. ఇది నిన్ను ఎందుకు పెనవేసుకుంటుందంటే దాని బలంతో నిన్ను నలిపేయగలనా లేదా అని చూసుకుంటోంది. ఎందుకు నీ ముఖాన్ని నాకుతోందంటే నీతల దాని నోట్లో పడుతుందో లేదో చూసుకునేందుకు’ అని డాక్టర్‌ చెప్పాడట. దాంతో ఆ మంచి మనిషికి కొండచిలువ గురించి అర్థమైందట. ఇవాళ చంద్రబాబునాయుడు చేస్తున్న మాయదారి పనులన్నీ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి రాష్ట్రంలో ఏమీ వదల్లేదు. అన్నీ తినేశాడు. పొరపాటున ఈ మనిషిని క్షమిస్తే రేప్పొద్దున ఏమవుతుందో తెలుసా? అందరినీ పూర్తిగా మింగేస్తాడు. చంద్రబాబు చిత్తశుద్ధి చూసి ఈ మాటలు చెప్పాల్సి వస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement