శనివారం ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదని, హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఎక్కువగా మేలు జరుగుతుందని నాడు చంద్రబాబు ఊదరగొట్టారు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ వ్యాఖ్యానించారు. ఓ దశలో హోదా పేరెత్తితే జైలుకు పంపుతామంటూ యువతను భయపెట్టారు. హోదా కోసం అలుపెరుగని పోరాటం సాగిస్తున్న ప్రతిపక్ష నేతను తప్పుపట్టారు. జగన్ నిర్వహించిన యువభేరీలకు తరలి వచ్చే విద్యార్థులను అడ్డుకున్నారు.
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ తన స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు. అవినీతి, అధికార దుర్వినియోగం మినహా నాలుగేళ్లుగా రాష్ట్రంలో పూచిక పుల్లంత అభివృద్ధి జరగలేదు. ఏడాదిలో ఎన్నికలు రానున్నాయని తెలిసి, ప్రజలంతా ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని గమనించి హోదా వల్లే అభివృద్ధి సాధ్యమని ఇపుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బాబు తీరు పట్ల ఔరా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అలవిగాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల వారిని మోసం చేసింది కాక, పూటకో మాట మాట్లాడుతూ మళ్లీ మోసం చేయజూస్తున్న చంద్రబాబు రెండు నాల్కల ధోరణిపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరు చూసి నిత్యం రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 96వ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా మోసాలు, అబద్ధాలతో పాలన సాగుతోందని, ఈ నాలుగేళ్లలో మనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే..
అవినీతి.. అబద్ధాలు..
‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అవినీతి వరద పారుతోంది. కింది నుంచి పైవరకు అధికార దుర్వినియోగం జరుగుతోంది. నాలుగేళ్లుగా అన్యాయమైన పాలన సాగుతోంది. ఇసుక నుంచి మట్టిదాకా దేనినీ వదిలి పెట్టలేదు. బొగ్గు, మద్యం, కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, గుడి భూములను కూడా వదిలిపెట్టకుండా తినేస్తున్నారు. పైన చంద్రబాబు అవినీతి చేస్తుంటే కింద జన్మభూమి కమిటీలు పెన్షన్‌లు, చివరకు మరుగుదొడ్ల మంజూరుకు కూడా లంచాలు తీసుకుంటున్నాయి. అవినీతి డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోవడం మనమంతా చూశాం. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. ఇలా అడ్డంగా దొరికినా ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయడు. ఆ ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించరు. చిన్న గవర్నమెంట్ ఉద్యోగి లంచాలు తీసుకుంటే వెంటనే ఉద్యోగం నుంచి తీసేసి జైలుకు పంపిస్తారు. ఒక ముఖ్యమంత్రి అవినీతి సొమ్ముతో పట్టుబడినా ఇవాళ వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో అని చెప్పడానికి చంద్రబాబు పాలనే నిదర్శనం. ఆ మనిషి మీద ఏ కేసులూ ఉండవు. ఆ మనిషి అవినీతికి చక్రవర్తి అయిఉండీ అవినీతి గురించి మాట్లాడతాడు.
చట్ట సభలో చట్టాలు అమలు కావు..
ఈయన పాలనలో చట్ట సభల్లో చట్టాలు అమలు కావడం లేదు. అసెంబ్లీకి వెళ్లాలంటే మనసురాని పరిస్థితి. అసెంబ్లీకి వెళ్లినప్పుడు మన ఎమ్మెల్యే ఏమి మాట్లాడుతాడో మనందరం చూస్తాం. ఇలా చూసినప్పుడు చట్టాలు చేసే చట్ట సభల్లో చట్టాలను అవహేళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొంటారు. కొనిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయరు. అనర్హులుగా ప్రకటించిన తర్వాత వాళ్ల పార్టీ టికెట్‌పై గెలిపించే సత్తా, దమ్ము లేని పరిపాలన ఇవాళ చూస్తున్నాం. ఇలా కొనుగోలు చేసిన వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి కొనసాగిస్తున్నారు. ఇటువంటి పాలన ఎప్పుడైనా చూశారా?
ఈ వ్యవస్థ మారాలి..
ఎన్నికలకు ముందు మద్యం గురించి ఏమన్నాడు? అధికారంలోకి రాగానే మద్యాన్ని, బెల్ట్‌షాపులను తీసేస్తామన్నాడు. ఇవాళ గ్రామాల్లో మంచినీళ్లు దొరుకుతాయో లేదో కానీ ఫోన్ కొడితే మద్యం హోం డెలివరీ చేస్తున్నారు. ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని ఈ పెద్దమనిషి మాట మార్చి మళ్లీ మీ ముందుకొస్తున్నారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విలువలు, విశ్వసనీయత అన్న పదాలు రావాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. అది ఒక్క జగన్ వల్లే సాధ్యం కాదు. మీ అందరి దీవెనలు కావాలి. ఆశీస్సులు కావాలి. చంద్రబాబును పొరపాటున క్షమిస్తే రేపు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటాడు. ప్రతి ఇంటికీ బెంజ్ కారు కూడా ఇస్తానంటాడు. ఇవన్నీ మీరు నమ్మరని.. ప్రతి ఇంటికీ తన మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతుల్లో రూ.3,000 డబ్బులు పెడతాడు. ఇస్తే మాత్రం వద్దని చెప్పమాకండి. మూడు వేలు కాదు ఐదు వేలు గుంజండి. అది మన డబ్బు. మన జేబులు కొట్టిన డబ్బు. గుంజిన తర్వాత ఓటు వేసేటప్పుడు మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వెయ్యండి. అప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ బాగు పడుతుంది ‘ అని వైఎస్ జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment